
చాగల్లులో జరిగిన వైఎస్సార్ సీపీ కొవ్వూరు నియోజకవర్గ బూత్ కమిటీల సమావేశంలో మాట్లాడుతున్న పార్టీ ఉభయగోదావరి జిల్లాల రీజినల్ కో–ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి, చిత్రంలో పార్టీ ముఖ్య నేతలు కౌరు శ్రీనివాస్, రాజీవ్ కృష్ణ, తానేటి వనిత తదితరులు
పశ్చిమగోదావరి, కొవ్వూరు/చాగల్లు: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన నవరత్నాలు నవశకానికి నాంది పలుకుతాయని, ఈ పథకాల ద్వారా రాష్ట్రంలో ప్రతి కుటుంబానికీ రూ.లక్ష నుంచి రూ.5లక్షల మేరకు లబ్ధి చేకూరనుందని ఆ పార్టీ ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ కో–ఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. చాగల్లు మండలం నెలటూరులోని నిమ్మగడ్డ చినరాములు కల్యాణ మండపంలో మంగళవారం నిర్వహించిన వైఎస్సార్ సీపీ నియోజకవర్గ బూత్ కమిటీల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడుతూ.. పార్టీ బూత్ కమిటీ సభ్యులంతా ప్రజలతో మమేకమై నవరత్నాల పథకాల ద్వారా చేకూరే లబ్ధిని వివరించాలని సూచించారు. నాలుగున్నరేళ్లుగా టీడీపీ ప్రభుత్వం చేస్తున్న దోపిడీని ప్రజల్లో ఎండగట్టాలన్నారు. టీడీపీ పాలన పైశాచికత్వానికి కొవ్వూరు నియోజకవర్గమే ఉదాహరణ అన్నారు. ఇక్కడ ఇసుక, మద్యం, మట్టితో టీడీపీ నేతలు ప్రజలను దోచుకుంటున్నారని విమర్శించారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు చేస్తున్న దోపిడీని ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్సార్ సీపీ శ్రేణులకు ఆయన సూచించారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లోఎన్నికలు వచ్చే అవకాశాలు ఉన్నందున రానున్న ఐదారు నెలలపాటు పార్టీ శ్రేణులు రాత్రింబవళ్లు పార్టీ విజయం కోసం కష్టించి పనిచేయాలని కోరారు. రుణమాఫీ పేరుతో చంద్రబాబు రైతులను నిలువునా మోసం చేశారని ధ్వజమెత్తారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరల్లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని వైవీ సుబ్బారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని ఇచ్చిన హామీకి తూట్లు పొడవడమే కాకుండా మాఫీ చేసేదే లేదంటూ స్వయంగా చట్టసభలో మంత్రి ప్రకటన చేయడం బాధాకరమని పేర్కొన్నారు. మరోసారి ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారని, బాబు తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాను బీజేపీకి తాకట్టు పెట్టారని వైవీ సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్ సీపీతోనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తుందని స్పష్టం చేశారు.
సమష్టిగా పనిచేస్తేనే విజయం
సమావేశానికి అధ్యక్షత వహించిన వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తానేటి వనిత మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో బూత్‌స్థాయిలో కమిటీలు పటిష్టంగా లేకపోవడం వల్లే ఓటమిపాలు కావాల్సి వచ్చిందని, ఆ పరిస్థితిని అధిగమించేందుకు ఈసారి బూత్ కమిటీలు కీలక పాత్ర పోషించాలని కోరారు. తటస్థులను పార్టీలో చేర్చుకోవడంతోపాటు సమష్టిగా పార్టీ గెలుపు కోసం పనిచేయాలని సూచించారు.
టీడీపీ మోసాలను ప్రజలకు వివరించండి
రాజమండ్రి పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు కౌరు శ్రీనివాస్ మాట్లాడుతూ పార్టీ అభివృద్ధి కోసం ప్రతి నాయకుడు, కార్యకర్త రోజుకు గంట చొప్పున కేటాయించాలని సూచించారు. టీడీపీ పాలనలో ఎలా మోసపోయామో ప్రజలకు వివరించాల్సిన బాధ్యత బూత్ కమిటీలపై ఉందన్నారు. నవరత్నాల ద్వారా ప్రతి కుటుంబానికీ నెలకు రూ.8వేలకు పైగా లబ్ధి చేకూరుతుందని పేర్కొన్నారు.
ఓటర్ల సవరణపై దృష్టి సారించండి
ఉభయ గోదావరి జిల్లాల రీజినల్ బూత్ కమిటీల కో–ఆర్డినేటర్ బి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఓటర్ల జాబితాల్లో దొంగ ఓట్ల తొలగింపు, అర్హుల ఓట్ల నమోదుపై బూత్ కమిటీలు శ్రద్ధ వహించాలని కోరారు. ప్రతి బూత్‌లోనూ తొలగించిన పేర్ల జాబితాలను పంపుతామని, వాటిని సరి చూసుకోవాలని సూచించారు. పంచాయతీ ఎన్నికల్లో మాదిరిగా అత్యధిక శాతం ఓట్లు పోలయ్యేలా చూడాలని, ప్రతి ఓటూ విలువైనదిగా భావించాలని సూచించారు.
బూత్ కమిటీలు పటిష్టంగా పనిచేయాలి
వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రాజీవ్ కృష్ణ మాట్లాడుతూ బూత్‌స్థాయిలో ఎవరెవరు ఏ పార్టీకి మద్దతుగా ఉన్నారో తెలుసుకోవడంతోపాటు తటస్థులు ఎవరనే అంశాలపై బూత్ కమిటీలకు స్పష్టమైన అవగాహన ఉండాలన్నారు. తద్వారా తటస్థుల ఓట్లను పార్టీకి అనుకూలంగా మలుచుకునే యత్నం చేయాలని సూచించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోడూరి శివరామకృష్ణ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కరిబండి గనిరాజు మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ బూత్ కమిటీల కో–ఆర్డినేటర్ యండపల్లి రమేష్, పార్టీ మండల అధ్యక్షులు కోఠారు అశోక్‌బాబా, కుంటముక్కల కేశవనారాయణ, గురుజు బాల మురళీకృష్ణ, పట్టణ అ«ధ్యక్షుడు రుత్తల భాస్కరరావు తదితరులు మాట్లాడారు. పార్టీ సంయుక్త కార్యదర్శి పోతుల రామతిరు పతి రెడ్డి, ముళ్లపూడి కాశీవిశ్వనాథ్, లకంసాని సూర్యప్రకాశరావు, బొర్రా కృష్ణ, కొమ్మిరెడ్డి వెంకటేశ్వరరావు, గండ్రోతు సురేంద్రకుమార్, కాకర్ల నారాయుడు తదితరులతోపాటు అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొన్నారు.