నేవీ డే ఉత్సవాలను పురస్కరించుకుని తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో ఆర్కే బీచ్‌లో చేపట్టిన రిహార్సల్స్ అబ్బుర పరిచాయి. జెమినీ బోట్లలో దూసుకొచ్చిన నౌకాదళం విన్యాసాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి.
సాక్షి, విశాఖపట్నం: సముద్రాన్ని చీల్చుకుంటూ సాగిపోతున్న హైస్పీడ్ బోట్లు.. వినీలాకాశంలో చక్కర్లు కొడుతూ భువి నుంచి సాగర జలాల్లోకి త్రివర్ణ పతాకంతో దిగివచ్చిన స్కై డైవర్లు.. శత్రు స్థావరాలపై మెరైన్ కమాండోల ఆకస్మిక దాడులు.. రివ్వున దూసుకొచ్చి.. శత్రు నౌకలపై దాడి చేసి మెరుపు వేగంతో వెళ్లిపోయిన సీ కింగ్ హెలికాఫ్టర్లు.. ఇలా.. ఒకటి కాదు రెండు కాదు.. కళ్లు చెదిరే విన్యాసాలతో కదన రంగాన్ని తలపించే వాతావరణంతో ఆర్‌కే బీచ్ వేడెక్కింది. నేవీ డే ఉత్సవాలు పురస్కరించుకుని తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో ఆర్‌కె బీచ్‌లో చేపట్టిన మొదటి ప్రధాన రిహార్సల్స్ అబ్బుర పరిచాయి.
జెమినీ బోట్లలో దూసుకొచ్చిన నౌకాదళం విన్యాసాలు బీచ్ సందర్శకులను ఆకట్టుకున్నాయి. డిసెంబర్ 4న నేవీ డే సందర్భంగా సాగర జలాల్లో నేవీ సిబ్బంది ఏటా విన్యాసాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా వారం రోజుల ముందు నుంచే రిహార్సల్స్ చేస్తుంటారు. తొలి రోజు రిహార్సల్ అదరహో అనిపించాయి. డిసెంబర్ 2వ తేదీన సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకూ భారీ రిహార్సల్స్ నిర్వహించనున్నట్లు నౌకాదళ వర్గాలు వెల్లడించాయి. ఆర్‌కె బీచ్ ఆవరణలో ఏర్పాటు చేసిన నేవీ తాత్కాలిక కంట్రోల్ రూమ్ నుంచి అధికారులు విన్యాసాలను పర్యవేక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment