
యూపీఏ సర్కార్ బాటలోనే ఎన్డీఏ
యూపీఏ సర్కార్ బాటలోనే ఎన్డీఏ సర్కార్ పయనిస్తోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు.
ఒంగోలు కలెక్టరేట్ : యూపీఏ సర్కార్ బాటలోనే ఎన్డీఏ సర్కార్ పయనిస్తోందని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు విమర్శించారు. కఠిన నిర్ణయాలకు సిద్ధం కావాలని చెప్పిన వారం రోజులకే దేశ ప్రజలపై రైల్వే చార్జీల రూపంలో అదనపు భారం మోపారని ధ్వజమెత్తారు. సీపీఎం జిల్లా ప్లీనరీ సమావేశం శనివారం స్థానిక కాపు కల్యాణ మండపంలో జరిగింది. ఈ సమావేశానికి సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు పూనాటి ఆంజనేయులు నేతృత్వం వహించారు.
ముఖ్య అతిథిగా పాల్గొన్న రాఘవులు మాట్లాడుతూ ధరలు పెంచారంటూ కాంగ్రెస్‌ను విమర్శించిన బీజేపీ.. తాను అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే రైల్వే చార్జీలు భారీగా పెంచి కాంగ్రెసుకు తమకు తేడా లేదని నిరూపించిందన్నారు. తాము అధికారంలోకి రావడం ద్వారా దేశాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చని దేశ ప్రజలను నమ్మించిన బీజేపీ ఆ నమ్మకాన్ని తుంగలో తొక్కిందని విమర్శించారు. వందశాతం ఎఫ్‌డీఐలను రైల్వే రంగంలోకి తీసుకొచ్చి ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేస్తోదన్నారు.రానున్న రోజుల్లో నరేంద్రమోడీ ప్రభుత్వం ప్రజలపై మరిన్ని భారాలు మోపేందుకు కసరత్తు చేస్తోందన్నారు.
కార్పొరేట్ కంపెనీల ప్రయోజనాలు, హిందూత్వ పరిరక్షణ ధ్యేయంగా నరేంద్రమోడీ పాలన సాగబోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం అవలంబించే ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు ఉద్యమించాలని రాఘవులు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు రుణమాఫీని ఎలాంటి నిబంధనలు లేకుండా చిత్తశుద్ధితో అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జాలా అంజయ్య, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ముప్పరాజు కోటయ్య, ఎన్.ప్రభుదాస్, జీవీ కొండారెడ్డి, ఎస్‌డీ హనీఫ్‌లతో పాటు జిల్లా కమిటీ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. అనంతరం నిబంధనలు లేకుండా రుణమాఫీ అమలు చేయాలని సీపీఎం జిల్లా ప్లీనరీ సమావేశం తీర్మానించింది. ఉపాధి హామీతో పాటు ఇతర పథకాలను ఎలాంటి సవరణలు చేయకుండా అమలు చేయాలని ప్లీనరీ కోరింది.
బె ల్టుషాపుల ఎత్తివేత కలే
రాష్ట్రంలో బెల్టుషాపుల తొలగింపు కలేనని బీవీ రాఘవులు అన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే బెల్టు షాపులు తొలగిస్తామంటూ ఎన్నికల సమయంలో ప్రకటించిన చంద్రబాబు.. సీఎం అయ్యాక ఆ ప్రస్తావనే తీసుకురావడం లేదని విమర్శించారు. పార్టీ జిల్లా ప్లీనరీ సమావేశంలో పాల్గొనేందుకు ఒంగోలు వచ్చిన సందర్భంగా తనను కలిసిన విలేకరులతో ఆయన మాట్లాడారు. నూతన ఎక్సైజ్ పాలసీ ద్వారా బెల్ట్ షాపులను తొలగించవచ్చని, ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్న దాఖలాలు లేవన్నారు.
రాష్ట్ర రాజధాని ఏర్పాటు విషయమై అన్ని రాజకీయ పార్టీలతో చర్చించి ఆమోదయోగ్యమైన ప్రాంతాన్ని ఎంపిక చేయాలని రాఘవులు సూచించారు. ఇప్పటికే విజయవాడ - గుంటూరు ప్రాంతాల మధ్య రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటనలు రావడంతో రియల్ ఎస్టేట్‌పై ఆధారపడినవారు లబ్ధి పొందుతున్నారన్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సీపీఎంకు ఎదురైన ఓటమిపై జిల్లాల వారీగా విశ్లేషించుకోనున్నట్లు వెల్లడించారు. జూలై 19, 20, ఆగస్టు 8, 10తేదీల్లో ఢిల్లీలో జాతీయ స్థాయిలో పార్టీ పనితీరు గురించి సమీక్ష జరుగుతుందన్నారు. కేంద్రంలోని ఎన్‌డీఏ, రాష్ట్రంలోని తెలుగుదేశం ప్రభుత్వాలు అవలంబించే ప్రజా వ్యతిరేక విధానాలపై మిలిటెంట్ పోరాటాలు నిర్వహించనున్నట్లు రాఘవులు తెలిపారు.