పేదల ఇంట 'వెలుగు' | Nearly 2 Lakh SC, ST Households Get Benefit From Free Power Sought Up To 200 Units In Guntur | Sakshi
Sakshi News home page

పేదల ఇంట 'వెలుగు'

Published Thu, Jul 18 2019 12:17 PM | Last Updated on Thu, Jul 18 2019 12:17 PM

Nearly 2 Lakh SC, ST Households Get Benefit From Free Power Sought Up To 200 Units In Guntur  - Sakshi

సాక్షి, చిలకలూరిపేట:  ఎన్నికలలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహనరెడ్డి సర్కార్‌ యుద్ధ ప్రాతిపదికన నెరవేరుస్తూ ముందుకు సాగుతోంది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మొదటి రోజు నుంచే హామీల అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ఇచ్చిన హామీ మేరకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. దీంతో జిల్లాలో 1,96,568 ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు లబ్ధి చేకూరనుంది. 

అధికారంలోకి వచ్చిన మరుక్షణమే 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందిస్తామని... లేదా ఏడాదికి రూ. 6వేలు అందజేస్తామని ఎస్సీ,ఎస్టీ వర్గీయులకు ఎన్నికల సమయంలో వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. విద్యుత్‌ ఉచితంగా అందించటంతో పాటు ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి, సంక్షేమానికి అన్ని రకాలుగా కృషి చేస్తామని చెప్పారు. ఇప్పుడు ఆ హామీ అమలుకు వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం సిద్ధమైంది. దీని వలన జిల్లాలోనే 1,59,582 ఎస్సీ, 36,986 ఎస్టీ కుటుంబాలకు అంటే మొత్తం 1,96,568 కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుంది.

జిల్లాలోని బాపట్ల డివిజన్‌లో ఎస్సీ, ఎస్టీలకు కలిపి 40,169 గృహసర్వీసులు ఉండగా, నరసరావుపేట డివిజన్‌లో 43,853 సర్వీసులు, మాచర్లలో 35,043, గుంటూరు–1లో 18,008, తెనాలిలో 59,495 సర్వీసులు ఉన్నాయి. ఇంకా మంగళగిరి, చిలకలూరిపేట వంటి సీఆర్‌డీఏ చేరిన ప్రాంతాలకు కలిపితే లబ్ధిదారుల సంఖ్య ఇంకా పెరుగుతుంది. వీటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్‌ ఇవ్వడం వల్ల ఎస్సీ, ఎస్టీలలో పేదలకు మేలు జరుగుతుంది. 

బాబు హయాంలో..
చంద్రబాబునాయుడు ఐదేళ్ల పాలనలో ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్‌ రాయితీ మొక్కుబడిగా సాగింది. 100 యూనిట్లకు మాత్రమే విద్యుత్‌ రాయితీ కల్పించారు. అదికూడా 125 యూనిట్ల లోపు వాడుకున్న కుటుంబాలకు మాత్రమే ఆ రాయితీ అని చెప్పినప్పటికీ గత ప్రభుత్వం సకాలంలో విద్యుత్‌ శాఖకు బకాయిలు చెల్లించలేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా కోట్లాది రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. జిల్లా వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీల గృహ సర్వీసులకు సంబంధించి రూ.8,46,55,000 బకాయిలు గత ప్రభుత్వం చెల్లించలేదు. 

ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి..
ఎస్సీలలో ప్రధానంగా ఉన్న మాల, మాదిగ సామాజిక వర్గాలకు వేర్వేరుగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అన్ని రకాల పథకాల ద్వారా ఆర్థిక లబ్ధి చేకూర్చడంతో పాటు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ పారదర్శకంగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌ హామీ ఇచ్చారు. భూ పంపిణీతో పాటు ఉచిత బోరు బావుల పథకాన్ని వర్తింపజేస్తామన్నారు. వైఎస్సార్‌ పెళ్లి కానుక కింద ఎస్సీ, ఎస్టీ చెల్లెమ్మల వివాహాల కోసం లక్ష రూపాయలు ఇవ్వడంతో పాటు గిరిజనులకు ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేసి ప్రత్యేక యూనివర్సిటీ, మెడికల్, ఇంజినీరింగ్‌ కళాశాలలను సైతం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

500 మంది జనాభా ఉన్న ప్రతి తండా, గూడెంలను పంచాయతీలుగా మారుస్తామన్నారు. ఐటీడీఏ పరిధిలో సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మిస్తామన్నారు. పోడు భూములను సాగు చేసుకొనే గిరిజన రైతులకు యాజమాన్యహక్కు కల్పిస్తూ (ఫారెస్టు రైట్స్‌ యాక్ట్‌ 2006 ప్రకారం) గిరిజనులకు హామీలను నెరవేరుస్తామన్నారు. వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కాగానే ఈ హామీల అమలుకు శ్రీకారం చుట్టడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement