నెల్లూరు, సిటీ: సింహపురి వాసులకు ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు, సాయంత్రం వేళలో సేదతీరేందుకు వీలుగా వసతుల కల్పనపై నెల్లూరు నగర పాలక సంస్థ కమిషనర్ కేవీఎన్ చక్రధర్‌బాబు దృష్టి పెట్టారు. హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ పరిసరాల్లో అభివృద్ధి చేసిన నెక్లెస్‌రోడ్డుకు దీటుగా నెల్లూరులోనూ స్వర్ణాల చెరువు చుట్టూ రోడ్డు నిర్మాణానికి కార్పొరేషన్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. రొట్టెల పండగతో అంతర్జాతీయ ప్రఖ్యాతిగాంచిన స్వర్ణాల చెరువు పరిసరాల్లో ఆహ్లాదకర వాతావరణం కల్పించడంపై కమిషనర్ ప్రత్యేక చొరవ చూపుతున్నట్లు సమాచారం. ఇరుకళల పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నుంచి పొట్టేపాళెం, పొదలకూరురోడ్డు మీదుగా కొత్తూరును కలుపుతూ 12 కిలోమీటర్ల పొడవునా 60 అడుగుల వెడల్పు రోడ్డు నిర్మించాలని భావిస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించి మున్సిపల్ పరిపాలన శాఖ అనుమతితో రోడ్డు డిజైన్, వ్యయ అంచనాలను రూపొందించడానికి ప్రైవేటు కన్సల్టెన్సీ సహకారం తీసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం.
ప్రాథమిక అంచనాల ప్రకారం రూ.5 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని అంటున్నారు. రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటడంతో పాటు విశ్రాంతి తీసుకునేందుకు బెంచీలతో పాటు వివిధ నిర్మాణాలు చేపడతారు. ప్రస్తుత పరిస్థితుల్లో నిధులు సమకూర్చడంపైనే ఈ ప్రతిపాదనల ఆమోదం ఆధారపడి ఉంటుంది. అయితే నెక్లెస్‌రోడ్డు ప్రతిపాదన కార్యరూపం దాల్చితే నగర వాసుల సుందర సింహపురి ఆకాంక్ష కొంతమేర అయినా తీరుతుంది.
నెల్లూరులో నెక్లెస్ రోడ్డు
Published Sun, Dec 7 2014 1:26 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
Advertisement