కావూరి.. కరుణించాలి | need help from kavuri samba siva rao | Sakshi
Sakshi News home page

కావూరి.. కరుణించాలి

Published Tue, Dec 24 2013 2:55 AM | Last Updated on Sat, Aug 11 2018 7:28 PM

కావూరి.. కరుణించాలి - Sakshi

కావూరి.. కరుణించాలి

 సిరిసిల్ల, న్యూస్‌లైన్ :
 రాష్ర్టంలోనే అత్యధికంగా 34వేల మరమగ్గాలతో ఘనకీర్తి పొందిన సిరిసిల్ల వస్త్రపరిశ్రమ నేతన్నల బతుకులకు భరోసా ఇవ్వలేకపోతోంది. సర్కారు అస్తవ్యస్త విధానాలతో తరచూ తలెత్తుతున్న సంక్షోభాల వల్ల నేత కార్మికులు నూలుపోగులనే ఉరితాళ్లుగా చేసుకుని బలవన్మరణాల బలిపీఠమెక్కుతున్నారు. వస్త్రపరిశ్రమనే నమ్ముకుని ఐదు వేల మంది ఆసాములు, 25 వేల మంది కార్మిక కుటుంబాలు నిత్యం బతుకు సమరం సాగిస్తున్నాయి. పరిశ్రమలో ఆటుపోట్లతో నష్టపోతున్నది ఆసాములు, కార్మికులే. గత ఐదేళ్లలో 184 మంది కార్మికులు బలవన్మరణాలకు పాల్పడగా, ఈ ఏడాది ఇప్పటివరకు 34 మంది ఆత్మహత్య చేసుకోవడం కార్మిక  కుటుంబాల దుస్థితిని తెలుపుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర జౌళిమంత్రిత్వ శాఖ సిరిసిల్లను క్లస్టర్‌గా ఎంపిక చేసి మరమగ్గాల ఆధునికీకరణకు పూనుకోవడం శుభపరిణామం. కేవలం ఈ క్లస్టర్‌తోనే కష్టాలు కడతేరుతాయనుకోవడం అత్యాశే అవుతుందని కార్మికులు అంటున్నారు. సిరిసిల్ల వస్త్రపరిశ్రమ సంక్షోభానికి మూలాలను గుర్తించి.. ఆ సమస్యల పరిష్కారానికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. మరమగ్గాల ఆధునికీకరణ క్లస్టర్ ప్రారంభోత్సవానికి నేడు సిరిసిల్లకు వస్తున్న కేంద్ర జౌళిశాఖ మంత్రి కావూరి సాంబశివరావు మరిన్ని వరాలు ప్రకటించాలని వేడుకుంటున్నారు.
 
 క్లస్టర్‌పై ఆసక్తి కరువు..
 కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఆరు పవర్‌లూం క్లస్టర్లను గుర్తించగా అందులో సిరిసిల్ల ఒకటి. దీనికింద 50 శాతం సబ్సిడీతో మరమగ్గాలను ఆధునికీకరిస్తారు. ప్రస్తుతం ఉన్న మగ్గాలకు ఆధునిక పరికరాలను అమర్చుకుంటే పవర్‌లూంపై మార్కెట్‌లో డిమాండ్ ఉన్న వస్త్రాన్ని ఉత్పత్తి చేసే అవకాశం ఉంటుంది. ఒక్కో యజమాని గరిష్టంగా 8 మగ్గాల వరకు ఆధునికీకరించుకోవచ్చు. సిరిసిల్లలో 5 వేల మంది ఆసాములు, 34 వేల మరమగ్గాలు ఉండగా ఇప్పటివరకు 392 మంది ఆసాములు, 2,982 మగ్గాలను మాత్రమే ఆధునికీకరించుకునేందుకు ముందుకొచ్చారు.
 
 సమస్యలిక్కడ.. సేవాకేంద్రం ఎక్కడో..
 సిరిసిల్లలో సేవలందించాల్సిన మరమగ్గాల సేవాకేంద్రం హైదరాబాద్‌లో కొనసాగుతోంది. దానిని సిరిసిల్లలో ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన బుట్టదాఖలవుతోంది. సమస్యలు ఇక్కడ ఉంటే.. సేవా కేంద్రం అక్కడ ఉండడం ఎవరికి సేవలందించేందుకో అర్థం కాదు. చిత్తూరు జిల్లా నగరిలో పదివేల మరమగ్గాలు ఉంటే.. అక్కడే సేవా కేంద్రం కొనసాగుతోంది.
 
 7వేల కుటుంబాలకే బీమా ధీమా
 సిరిసిల్లలో 25 వేల కార్మిక కుటుంబాలుండగా.. ఏడువేల కుటుంబాలకే జనశ్రీ బీమా యోజన వర్తిస్తోంది. మిగతా 18 వేల కుటుంబాలకు బీమా ధీమా కరువైంది. ఇప్పటికీ సగం మంది కార్మికులు గుర్తింపు కార్డులకు నోచుకోవడం లేదు.
 
 టెక్స్‌టైల్ పార్కులో పరిశ్రమల మూత
 రాష్ట్రంలోనే తొలిసారిగా 2002లో సిరిసిల్లలో ఏర్పాటు చేసిన టెక్స్‌టైల్ పార్కు ఆదిలోనే మూసివేత దిశగా అడుగులు వేస్తోంది. అధిక విద్యుత్ బిల్లులు, అందని రాయితీలు, మౌలిక వసతుల లేమితో ఈ దుస్థితి తలెత్తింది. ఇందులో 223 ప్లాట్లు కేటాయించగా, 130 పరిశ్రమలు మాత్రమే వెలిశాయి. ఇందులో ఇప్పటికే 40 దాకా యూనిట్లు మూతపడ్డాయి.
 
 చేనేత ఖిల్లా సిరిసిల్లలో వస్త్ర పరిశ్రమ ఆధునికీకరణ దిశగా అడుగులు వేస్తోంది. కాలం చెల్లిన మగ్గాలను ఆధునికీకరించి నాణ్యమైన వస్త్రాన్ని ఉత్పత్తి చేయడం ద్వారా మార్కెట్లో డిమాండ్‌గా వస్త్రాన్ని అమ్ముకునే అవకాశం దరిచేరుతోంది. దేశంలోనే తొలిసారిగా సిరిసిల్లలో పవర్‌లూం క్లస్టర్‌ను కేంద్ర జౌళిశాఖ మంత్రి కావూరి సాంబశివరావు మంగళవారం ప్రారంభించనున్నారు. సిరిసిల్లను పవర్‌లూం క్లస్టర్‌గా ప్రకటించి ప్రత్యేక రాయితీలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని జౌళి శాఖ అధికారులు పేర్కొంటుండగా, క్లస్టర్ ఏర్పాటు కార్మికుల కష్టాలను గట్టెక్కిస్తుందా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. కేంద్ర మంత్రి ‘కావూరి’ రాక సందర్భంగా సిరిసిల్ల సమస్యలపై ఫోకస్...
 
 సిరిసిల్ల, న్యూస్‌లైన్
 మూడు దశాబ్ధాలుగా సిరిసిల్ల నేతన్నలు పురాతన మగ్గాలతో కాటన్, పాలిస్టర్ వస్త్రాన్ని ఉత్పత్తి చేస్తున్నారు. సిరిసిల్లలో మొత్తం 34 వేల మరమగ్గాలు ఉండగా, ఇందు లో 27 వేల మరమగ్గాలపై పాలిస్టర్, 7 వేల మ గ్గాలపై కాటన్ వస్త్రం ఉత్పత్తవుతోంది. 120 డైయింగ్‌లు, 50 సైజింగ్‌లతో వస్త్రోత్పత్తి పరిశ్ర మ విస్తరించి ఉంది. పాతికవేల మంది కార్మికులు వస్త్ర పరిశ్రమలో పనిచేస్తున్నారు. ఇప్పుడున్న మగ్గాలకు కేవలం రూ.30 వేల పెట్టుబడితో ఆధునికీకరించుకోవడం ద్వారా వస్త్రం నాణ్యత పెరుగుతుంది. విద్యుత్ వినియోగం తగ్గుతుంది. మరమగ్గాలకు ఆధునికమైన వార్ప్, వెప్ట్ స్టాప్‌మోషన్, ఎపిసెంట్ బ్రేకింగ్ డివైస్, 0.75 హెచ్‌పీ మోటార్లు అమర్చుకుంటే సరిపోతుంది. ఈ విధానం మూలంగా పోగు తెగిపోయినప్పుడు వెంటనే మగ్గం ఆగిపోతుం ది. ఫలితంగా వస్త్రం నాణ్యత పెరిగే అవకాశం ఉంటుంది. ఒక్క మగ్గం ఆధునికీకరించేందుకు రూ.30 వేలు అవసరమవుతుండగా, ఇందులో కేంద్ర జౌళి శాఖ రూ.15 వేల సబ్సిడీ అంది స్తోంది. మరో రూ.15 వేలను ఆసామి భరిస్తే మగ్గాల ఆధునికీకరణ పూర్తవుతుంది. ఇంత మొత్తాన్ని భరించలేని ఆసాములకు రూ.10 వేల మేరకు బ్యాంకు ద్వారా రుణాలు ఇప్పిం చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పవర్‌లూం క్లస్టర్ పెలైట్ పథకం ద్వారా ఎన్ని మగ్గాలనైనా వచ్చే ఐదేళ్ల లో ఆధునికీకరించేందుకు సబ్సిడీ విడుదల చేసేందుకు సిద్ధంగా ఉంది. మరోవైపు ఈ మగ్గాలపై ఆధునిక డిజైన్లను ఉత్పత్తి చేసే వీలుంది. మరోవైపు కార్మికుల నైపుణ్యాన్ని పెంచేందుకు శిక్షణ ఇప్పించాలి.
 
 బకాయిలకు మోక్షం లభించేనా?
 2010 మార్చి నుంచి సిరిసిల్ల సెస్‌కు రాష్ట్ర ప్ర భుత్వం ద్వారా రావాల్సిన యాభై శాతం విద్యుత్ రాయితీ బకాయి ఏటేటా పెరిగిపోతోంది. ఇప్పటివరకు రూ.25.26 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. సిరిసిల్లలో 5,710 మరమగ్గాల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిపై వచ్చే విద్యుత్ బిల్లుల్లో సగాన్ని ఆసామి చెల్లిస్తుండగా, మిగతా సగాన్ని రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీగా చెల్లించాలి. ఇటీవల ప్రభుత్వం సెస్ బకాయిలు మంజూరు చేస్తూ, రూ.7.59 కోట్ల ఎఫ్‌ఎస్‌ఏ రద్దు చేస్తూ జీవో జారీ చేసినా ఆర్డర్ ఇవ్వకపోవడంతో సెస్‌కు రావాల్సిన రూ.25.26 కోట్ల బకాయిలు ఎప్పటికి వస్తాయో తెలియని పరిస్థితి. ఫలితంగా సహకార విద్యుత్ సరఫరా సంఘం (సెస్) ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది.
 
 మూడంచెల విధానం
 సిరిసిల్లలో మూడంచెల విధానం అమలవుతోంది. నూలు మిల్లుల ద్వారా సిరిసిల్లలోని యజమానులు (మాస్టర్ వీవర్స్) నూలును దిగుమతి చేసి సైజింగుల్లో భీములు నింపి ఆసాముల (వీవర్స్)కు ఇస్తారు. ఆ భీములను తమ సాంచాలపై (మరమగ్గాలు) బిగించి వస్త్రం తయారు చేసిన తరువాత తిరిగి ఆ వస్త్రాన్ని యజమానులకు అప్పగిస్తారు. ఆసాములు మగ్గాలు నడుపుతూనే మరో ఒకరిద్దరు కార్మికులకు పని కల్పిస్తారు. మగ్గాల యజమాని ఆసామే కావడంతో కరెంటు బిల్లులను భరిస్తూ యజమాని వద్ద నూలు తెచ్చుకుని వస్త్రాన్ని తయారు చేసి అప్పగించడం ఆసామి డ్యూటీ. ఇక్కడ యజమాని, ఆసామి, కార్మికుడు అనే మూడంచెల విధానం అమలవుతోంది. సిరిసిల్లలో యాభైమంది వరకు యజమానులు ఉండగా.. ఐదువేల మంది ఆసాములు ఉన్నారు. అందరూ కలిసి పాతికవేల మంది కార్మికులు పని చేస్తున్నారు. పరిశ్రమలో సంక్షోభం కారణంగా ఐదేళ్లలో 184 మంది కార్మికులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఈ ఏడాది ఇప్పటివరకు 34 మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. అప్పులబాధలు, అనారోగ్యం, పరిశ్రమ సంక్షోభం ఆత్మహత్యలకు కారణమవుతోంది. కార్మికులకు దీర్ఘకాలిక ఉపాధి లభించే విధంగా చేతినిండా పని ఉంటేనే వారి బతుకులకు భరోసా లభిస్తుంది.
 
 పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలు..
     విద్యుత్ టారిఫ్ రేటు పెరగడంతో సిరిసిల్ల వస్త్రోత్పత్తిదారులు ఎక్కువగా వస్తున్న విద్యుత్ చార్జీలను భరించలేకపోతున్నారు. వీటికి తోడు ఇంధన సర్దుబాటు చార్జీలు(ఎఫ్‌ఎస్‌ఏ) భారంగా మారాయి.
     మార్కెట్‌లో మరమగ్గాల మరమ్మతుకు అవసరమయ్యే విడిభాగాల రేట్లు పెరగడం, వస్త్రపరిశ్రమకు అవసరమైన నూలు రేట్లు పెరగడంతో వస్త్రోత్పత్తి వ్యయం పెరిగింది. అదే స్థాయిలో వస్త్రాన్ని మార్కెట్‌లో అమ్ముకోవడానికి వీలులేక వస్త్రానికి గిట్టుబాటు ధర లభించడం లేదు.
     యజమానులు, ఆసాములు, కార్మికుల వ్యవస్థ మొత్తం ప్రైవేటు, అసంఘటిత రంగం కావడంతో ప్రభుత్వపరంగా వారిపై అజమాయిషీ ఉండడం లేదు. ఫలితంగా ఆసాములు సమ్మె చేయడంతో దినసరి కార్మికులు నష్టపోతున్నారు. యజమానులు మొండికేసినప్పుడు కార్మికశాఖ అధికారులు సైతం ఏమీ చేయలేని పరిస్థితి ఉంటోంది.
     సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో రాత్రీ పగలు పని చేయడం మూలంగా కార్మికులు, ఆసాములు శారీరకంగా అలసిపోతున్నారు. ఒక్కో కార్మికుడు పన్నెండు గంటల పాటు వస్త్రోత్పత్తి చేయడంతో అనారోగ్యం పాలవుతున్నారు. ఎనిమిది గంటల పని విధానం ఉంటే పరిశ్రమలో కార్మికులకు వెసులుబాటుగా ఉంటుంది. ఇటీవల అమలు చేస్తున్నా అది పూర్తిస్థాయిలో అమలుకావడం లేదు.
     సిరిసిల్ల వస్త్రోత్పత్తికి అవసరమైన నూలును యజమానులతో సంబంధం లేకుండా ఆసాములకు అందే విధంగా ప్రభుత్వ పరంగా నూలు డిపోలు లేకపోవడం పెద్ద సమస్య. ప్రభుత్వం నూలు డిపోలను ఏర్పాటు చేస్తే కొంత మేర మేలు జరిగే అవకాశముంటుంది.
 
 చేతినిండా పని ఉండాలి
 కార్మికులకు చేతినిండా పని ఉండే విధంగా చూస్తే చాలు. చేసుకుని బతుకుతం. నేను సూటింగ్ పని చేస్తా. నా భార్య మల్లిక బీడీలు చేస్తుంది. ఇప్పుడు 8 గంటలు పని చేస్తే వారానికి వెయ్యి నుంచి 1300 వస్తుంది. కూలి పెంచి పని కల్పించాలి.
 - సామల సాయికృష్ణ, కార్మికుడు
 
 హెల్త్‌కార్డులు ఇవ్వాలి
 కార్మికులకు హెల్త్‌కార్డులు ఇవ్వాలి. ప్రైవేటు దవాఖానాల్లోనూ ఉచితంగా వైద్యం అందించాలి. మగ్గాలను ఆధుని కీకరించడంతోపాటు కార్మికులకు ఇల్లు, జాగ ఇచ్చి ఆ దుకోవాలి. అన్నింటి ధరలు పెరిగిన యి. వచ్చే ఆదాయం ఖర్చులకు సరిపోతలేదు.
 - కొమటిపల్లి సదానందం, కార్మికుడు
 
 కార్మికులకు
 మగ్గాలివ్వాలి
 ప్రతీ కార్మికుడికి నాలుగు మగ్గాలు ప్రభుత్వం అందించే ఏర్పాటు చేయాలి. షెడ్డు నిర్మాణానికి రుణ వసతి కల్పించాలి. సిరిసిల్ల వస్త్రాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి కార్మికులందరికీ పీఎఫ్ సౌకర్యం కల్పించాలి. నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత కరెంటు అందించాలి.
 - మూషం రమేశ్, కార్మిక నాయకుడు
 
     చేనేత రంగాన్ని జౌళి శాఖ నుంచి వేరు చేసి సిరిసిల్ల కేంద్రంగా ప్రత్యేక కమిషనరేట్‌ను ఏర్పాటు చేయాలి.
     సిరిసిల్లలో ఉత్పత్తి అయిన వస్త్రాన్ని కొనుగోలు చేసేందుకు ఆప్కో తరహాలో కో-ఆప్టెక్స్ ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలి. ధర లేనప్పుడు నిల్వ చేసుకునే ఉత్పత్తిదారులకు రుణవసతి కల్పించాలి.
     వస్త్రోత్పత్తికి అవసరమైన నూలు, రంగులు, రసాయనాలను రాయితీపై అందించేందుకు ప్రత్యేక సంస్థను నెలకొల్పాలి.
     చేనేత రుణాలతోపాటు మరమగ్గాల పరిశ్రమకు సంబంధించిన రుణాలను, వ్యక్తిగత రుణాలను మాఫీ చేయాలి.
     సిరిసిల్లకు 50 శాతం విద్యుత్ రాయితీని అందిస్తుండగా.. మరో 25 శాతం పెంచాల్సిన అవసరం ఉంది.
     వస్త్రోత్పత్తి, దాని అనుబంధ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులందరికీ విధిగా గుర్తింపు కార్డులు ఇవ్వాలి. పీఎఫ్ సౌకర్యం కల్పించాలి. కార్మికులందరికీ జనశ్రీ బీమా పాలసీలు చేయించాలి. తమ వద్ద పనిచేసే కార్మికులందరికీ యజమానులు, ఆసాములు బీమా చేయించేలా చర్యలు తీసుకోవాలి.
     పేద కార్మికులకు 35 కిలోల అంత్యోదయ కార్డులను అందించి అనర్హుల కార్డులను తొలగించాలి.
     సిరిసిల్లలోనే పాలిస్టర్, కాటన్ ప్రాసెసింగ్ యూనిట్లను నెలకొల్పి వస్త్రం అమ్మకాలకు మార్కెట్ వసతి కల్పించాలి.
     సిరిసిల్ల మరమగ్గాలపై వస్త్రోత్పత్తి కాకుండా.. దోమ తెరలు, చీరెల ఉత్పత్తి, ఆస్పత్రులకు అవసరమైన వస్త్రాల ఉత్పత్తిని ప్రోత్సహించాలి.
     {పభుత్వరంగ సంస్థల్లో సిరిసిల్ల వస్త్రాన్ని వినియోగించే విధంగా ప్రోత్సహించాలి.
     సాంఘిక సంక్షేమ హాస్టల్, స్కూల్ పిల్లలకు డ్రెస్‌లు, మున్సిపల్, గ్రామపంచాయతీ సిబ్బంది యూనిఫాంలకు ఇక్కడి వస్త్రాన్ని వినియోగించాలి.
     వస్త్ర పరిశ్రమకు అనుబంధంగా ఉన్న డైయింగ్, సైజింగ్, వార్పిన్ యూనిట్లకు పవర్‌లూం సబ్సిడీని వర్తింపజేయాలి.
     పవర్‌లూం స్థాపనకు గతంలో ప్రభుత్వం రూ.30 వేల సబ్సిడీ ఇవ్వగా దాన్ని రూ.75 వేలకు పెంచి పవర్‌లూం పరిశ్రమను ఆధునికీకరించేందుకు ప్రణాళికలు రూపొందించాలి.
     చేనేత సహకార సంఘాల మాదిరిగానే పవర్‌లూం సహకార సంఘాలను ఏర్పాటు చేసి ప్రభుత్వం ద్వారా ఆర్థిక సాయం అందించాలి. సబ్సిడీ విడుదల చేసి పవర్‌లూం పరిశ్రమ పటిష్టానికి ప్రభుత్వం కృషి చేయాలి.
     సిరిసిల్ల నేత కార్మికుల కోసం ప్రత్యేక ఆస్పత్రి ఏర్పాటు చేయాలి. ఇలాంటి చర్యలను పాలకులు, అధికారులు చిత్తశుద్ధితో చేపడితే.. సిరిసిల్ల వస్త్రపరిశ్రమ సమస్యలకు శాశ్వత మోక్షం లభిస్తుంది. ఆకలి చావులు, ఆత్మహత్యలు లేని ‘సిరి’సిల్లగా విలసిల్లే అవకాశం ఉంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement