
సాక్షి, విజయవాడ : ఏపీ లాక్‌డౌన్ నేపథ్యంలో చీఫ్ సెక్రటరీ నీలం సహాని, డీజీపీ గౌతమ్ సవాంగ్‌లు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా నీలం సాహ్ని మాట్లాడుతూ.. రాష్ట్రంలో లాక్డౌన్ పటిష్టంగా అమలు చేస్తామన్నారు. అత్యవసర సేవల వాహనాలకు మాత్రమే అనుమతిస్తామన్నారు.నిబంధనలు అతిక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు స్వచ్చందంగా సహకరించాలని, హౌజ్ క్వారంటైన్ లో ఉండవలసిన వారు బయటకు వస్తే కేసులు పెడుతామని హెచ్చరించారు. ప్రభుత్వం ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ 1897 మేరకు విడుదల చేసిన జివోఎమ్‌ఎస్ 209 మేరకు నేటి నుంచి 31 మార్చ్ వరకు ఆంధ్ర ప్రదేశ్‌లో లాక్‌డౌన్ అమలులో ఉంటుందన్నారు.
కరోనా మహమ్మారిని పారద్రోలడానికి అందరూ భాధ్యతాయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. పబ్లిక్, ప్రైవేట్ వాహనాలను అనుమతించేది లేదని కానీ అత్యవసర వాహనాలకు మాత్రమే అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. నిత్యావసరాల వస్తువుల కొరకు కుటుంబం నుంచి ఒక్కరు మాత్రమే బయటకు రావాలన్నారు. మెడికల్ షాపులు, మెడిసిన్ మినహా నిత్యావసర వస్తువులు రాత్రి 8 గంటల తరువాత విక్రయానికి అనుమతి లేదన్నారు. పండుగలు, పార్టీలు, ఫంక్షన్లు, వివాహాలు, విహారయాత్రలు వాయిదా వేసుకోవాలన్నారు. డాక్టర్లు, నర్సింగ్, మున్సిపాలిటి, రెవిన్యూశాఖల సిబ్బంది ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు. అత్యవసర సేవలకై డయల్ 100,104 విరివిగా ఉపయోగించుకోవాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం పోలీసులు నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తామన్నారు.
ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో అనేక చెక్ పాయింట్లను ఏర్పాటు చేశామన్నారు. మీడియా పై ఎలాంటి ఆంక్షలు లేవు.. వారు ఎక్కడైనా తిరిగేందుకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం తీసుకున్న చర్యలను కఠినంగా అమలు చేస్తామన్నారు. నిబంధనలు అతిక్రమణ కు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తాము. వివిధ దేశాల నుంచి రాష్ట్రంలోకి వచ్చిన విద్యార్థులు, టూరిస్టులు, ఉద్యోగులు కచ్చితంగా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలన్నారు. కొన్ని విద్యాసంస్థలు బయట రాష్ట్రాలకు చెందిన విద్యార్థులను బలవంతంగా బయటకు పంపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment