=సీసీ కెమెరాల ఏర్పాటులో టీటీడీ జాప్యం
=టెండర్ల దశ దాటని వైనం
సాక్షి, తిరుపతి: నిఘా వ్యవస్థకు ఎంతో ప్రాధాన్య త ఇవ్వాల్సిన తిరుమల తిరుపతి దేవస్థానములు (టీటీడీ)లో నిర్లక్ష్యం అడుగడుగునా కనిపిస్తోంది. సీసీ కెమెరాల ఏర్పాటు వ్యవహారాన్నే దీనికి ఉదాహరణగా పేర్కొనవచ్చు. గత జూలైలో జరిగి న టీటీడీ ట్రస్టుబోర్డు సమావేశంలో తిరుమల, తిరుపతి, ముఖ్య నగరాల్లోని ఆలయాల్లో నిఘా పెంచడం కోసం రెండువేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఇందుకోసం రూ.62కోట్లు కేటాయించారు. బ్రహ్మోత్సవాల లోపు సీసీ కెమెరాల ఏర్పాటు పూర్తి చేయాలని నిర్ణయించారు. అయి తే బ్రహ్మోత్సవాలు ముగిసినా టెండర్ల ప్రక్రియ దాటకపోవడం విమర్శలకు తావిస్తోంది. అత్యాధునిక విలువలతో కూడిన హైటెక్నాలజీ సోఫెస్టికేటెడ్ కెమెరాల ధరలో వ్యత్యాసముండడంతో ప్రస్తుతం కేటాయించిన రూ.62 కోట్లు సరిపోవడం లేదని తెలుస్తోంది.
ఖర్చు మరింత పెరిగే అవకాశం ఉండడం, ఇదే సమయంలో ఈవో ఎల్వీ.సుబ్రహ్మణ్యం బదిలీ కావడం, కొత్తగా ఎంజీ.గోపాల్ బాధ్యతలు చేపట్టడంతో ఈ ప్రాజెక్టు కాస్త ఆలస్యమైనట్లు సమాచారం. కొత్త ఈవో ఈ వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి అత్యాధునిక సాంకేతిక పరి జ్ఞానం కలిగిన కెమెరాలను కొనుగోలు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. దీనికిగాను ఆయన తన నేతృత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐజీపీ (టెక్నికల్), ఐజీపీ (ఇంటలిజెన్స్)లతో కమిటీని నియమించారు.
వీరు ఇటీవల హైదరాబాద్‌లో సమావేశమై కెమెరాల కొనుగో లు, సామర్థ్యంపై చర్చించినట్లు తెలు స్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే టెండర్లు పిలిచే అవకాశమున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికి ఆరు నుంచి ఎనిమిది నెలల సమయం పట్టే అవకాశమున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది శ్రీవారి బ్రహ్మోత్సవాల నాటికి పూర్తి స్థాయిలో కెమెరాలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.
14 లోకల్ కంట్రోల్ రూమ్‌లు
తిరుమల తిరుపతి దేవస్థానముల పరిధిలో ఏర్పాటు చేయనున్న సీసీ కెమెరాలను కంట్రోల్ చేయడానికి 14 లోకల్ కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. తిరుమల, తిరుపతిలో ఈ కంట్రోలు రూములు ఉంటాయి. చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబయి లాంటి ప్రాంతాల్లో ఏర్పాటు చేసే కెమెరాలను ఇంటర్నెట్ ద్వారా తిరుపతిలోనే కంట్రోలింగ్ సిస్టంను ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది.
ప్రభుత్వ భాగస్వామ్యం అవసరం
లక్షల మంది భద్రతకు సంబంధించిన సీసీ కెమెరాల ఏర్పాటులో ప్రభుత్వ భాగస్వామ్యం కూడా ఉండాలని భావి స్తున్నాం. ఈవో ప్రభుత్వ అధికారులతో కలసి కమిటీని నియమించారు. అనుభవజ్ఞులైన అధికారుల సలహాలతో కెమెరాలు ఏర్పాటు చేయనున్నాం. త్వరలోనే దీనికి తుదిరూపు వస్తుంది.
- అశోక్‌కుమార్, సీవీఎస్‌వో, టీటీడీ