విజయనగరం మున్సిపాలిటీ : మున్సిపాలిటీలో ఆస్తిపన్ను వసూళ్లపై అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సామాన్య, మధ్య తరగతి ప్రజల నుంచి ముక్కు పిండి మరీ పన్నులు వసూలు చేసే అధికారులు బడాబాబులు ఏళ్ల తరబడి పన్ను చెల్లించకపోయినా.. వారి జోలికి వెళ్లకపోవడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. అధికారుల తీరుతో ఇప్పటివరకు ఆస్తి పన్ను బకాయి రూ 20 కోట్ల వరకు పేరుకుపోయింది. ఇందులో రూ. 30 వేల నుంచి రూ.10 లక్షల వరకు పన్ను బకాయిల ఉన్న వారు మొత్తం రూ 17.17 కోట్ల ఉన్నట్టు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి.
ఇందులో పాత బకాయిలు రూ 9 కోట్ల 35 లక్షల 55 వేల 434 ఉండగా... బకాయి పడిన మొత్తాన్ని అపరాధ రుసుం కింద రూ 7 కోట్ల 31 లక్షల 94 వేల 223కు పెరిగింది. ఇది కాకుండా ప్రస్తు తం రూ కోటీ 7లక్షల 17వేల 861 చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తాన్ని కేవలం 74 మంది మాత్రమే చెల్లించాల్సి ఉండడం గమనార్హం. మిగిలిన వారి నుంచి మరో రూ .2.75 కోట్లు వసూలు కావాల్సి ఉందని అంచనా. పెద్ద మొత్తంలో బకాయిలు పేరుకుపోయిన వాటిలో పలు ప్రభుత్వ శాఖలతో పాటు వివిధ ప్రైవేటు వ్యాపార సం స్థలు, విద్యాసంస్థలు ఉన్నట్లు తెలుస్తోంది.
మొండి బకాయిల్లో అత్యధికంగా చెల్లించాల్సిన వారిలో ప్రభుత్వ సంస్థ అయిన ఉడా వైస్ చైర్మన్ నుంచి రూ కోటీ 16 లక్షల 67వేల 130, కలెక్టర్ కార్యాలయం నుంచి రూ 71 లక్షల 97వేల 30, మాన్సాస్ మహారాజా అలక్ నారాయణ నుంచి రూ రూ 44 లక్షల 84వేల 892, ఇదే పేరు కు చెందిన మరో అసెస్‌మెంట్ నుంచి రూ 26 లక్షల 36వేల 673, విజయనగరం ఏపీఎస్ ఆర్‌టీసీ డిపో నుం చి రూ 12లక్షల 33వేల 247, పందుల పెంపకం కేంద్రం నుంచి రూ 9 లక్షల 26వేల 955, సర్వారాయ టెక్స్‌టైల్స్ నుంచి రూ 7 లక్షల 43వేల 655, ఇదే పేరుకు చెందిన మరో అసెస్‌మెంట్ నుంచి రూ 11 లక్షల 61 వేల 937, ఇంకొక అసెస్‌మెంట్ నుంచి రూ 8లక్షల 34 వేల 505 ఒకటవ పట్టణ పోలీస్‌స్టేషన్ నుంచి రూ 5 లక్షల 16వేల 196, ఎస్పీ కార్యాలయం నుంచి రూ 5 లక్షల 89 వేల 481 చెల్లించాల్సి ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి.
వసూళ్లు సాధ్యమేనా?
ఏళ్ల తరబడి పేరుకుపోయిన ఆస్తి పన్ను మొండి బకాయిలు వసూలు చేయడం అధికారులకు సాధ్యమేనా అన్న సందేహాలు వ్యక్త మవుతున్నాయి. ఇందులో పలు ఆస్తులు వివాదాల్లో ఉండగా.. మరికొన్ని ప్రభుత్వ శాఖ లకు చెందినవి. మిగిలినవి ప్రైవేటు వ్యక్తులకు చెందిన వి. అయితే వీటి వసూళ్లపై అధికారులు ఇప్పటికీ దృష్టి సారించనట్టు తెలుస్తోంది. ఫలితంగా మున్సిపాలిటీకి రావాల్సిన ఆదాయంలో పెద్ద మొత్తానికి గండి పడుతోంది. సామాన్యుల నుంచి పట్టుబట్టి పన్ను వసూలు చేసే అధికారులు మొండి బకాయిల వసూళ్లపై ఎటు వంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది.
ఈ బకాయిల సంగతేంటి...?
Published Mon, Aug 11 2014 2:46 AM | Last Updated on Tue, Oct 16 2018 7:36 PM
Advertisement