కార్మికులపై దమనకాండ
సాక్షి, విజయవాడ బ్యూరో: మున్సిపల్ కార్మికులు తమ ఆందోళనలో భాగంగా శుక్రవారం చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడిపై పోలీసులు బలప్రయోగానికి దిగారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని విన్నవిస్తూ 15 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోని నేపథ్యంలో మున్సిపల్ కార్మికులు తాజా ఆందోళన చేపట్టగా.. వారిపై ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పింది. దీంతో పోలీసులు దమనకాండకు దిగారు.
ఉవ్వెత్తున ఉద్యమం.. :సమ్మెకు వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ మద్దతు తెలిపిన నేపథ్యంలో శుక్రవారం కలెక్టరేట్‌ల దిగ్బంధనం ఉవ్వెత్తున సాగింది. నాలుగు రోజుల్లో సమ్మెను పరిష్కరించకపోతే రాష్ట్ర బంద్ చేపడతామంటూ ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో కార్మికులు పెద్ద ఎత్తున కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు.
మున్సిపల్ కార్మికులతోపాటు వారి సమ్మెకు మద్దతు పలికిన వివిధ పార్టీల నేతలు ఈ ఆందోళనల్లో పాలుపంచుకున్నారు.కలెక్టరేట్ల ముట్టడికి దిగిన కార్మికులు, నేతలపై పోలీసుల దమనకాండ కొనసాగింది. కడప కలెక్టరేట్‌ను ముట్టడించిన కార్మికులు, నేతలను లాఠీలతో చావబాదారు. పోలీసుల ప్రతాపానికి దాదాపు 25 మంది కార్మికులకు గాయాలవగా 9 మంది ఆసుపత్రిపాలయ్యారు. విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయ ముట్టడి సందర్భంగా పోలీసులు, కార్మికులకు మధ్య తోపులాట జరిగింది.
తోపులాటలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేషు, వైఎస్సార్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి, కార్మికులు పెద్దసంఖ్యలో సొమ్మసిల్లి పడిపోయారు. శ్రీకాకుళంలో మంత్రి అచ్చెన్నాయుడ్ని ఆందోళనకారులు అడ్డుకున్నారు.
నేటినుంచి నిరవధిక నిరాహారదీక్షలు..
తమ సమస్యల పరిష్కారం విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్న ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకుంటామని మున్సిపల్ కార్మికులు, ఉద్యోగుల జేఏసీ నేతలు కె.ఉమామహేశ్వరరావు, రంగనాయకులు శుక్రవారం ప్రకటించారు. శనివారం నుంచి నిరవధిక నిరహార దీక్షలు చేపడతామని తెలిపారు.