ఇక అధికారిక కోతలు | official power cuts | Sakshi
Sakshi News home page

ఇక అధికారిక కోతలు

Published Tue, Mar 4 2014 3:17 AM | Last Updated on Tue, Oct 16 2018 6:35 PM

official power cuts

  జిల్లా కేంద్రంలో మూడు గంటలు
  మున్సిపాల్టీలు, మండల కేంద్రాల్లో నాలుగు గంటలు
  నేటి నుంచి అమల్లోకి ఉత్తర్వులు జారీ చేసిన ఎస్‌ఈ  
 
 విజయనగరం కంటోన్మెంట్ న్యూస్‌లైన్: వేసవి ఆరంభం నుంచే విద్యుత్ వినియోగదారులకు కోతల  వాతలు మొదలయ్యాయి.  నిన్నటి వరకు అనధికారికంగా కోతలు విధిస్తున్న  అధికారులు  మంగళవారం నుంచి అధికారికంగా  అమలుచేయనున్నారు. రాష్ట్రంలో ఏర్పడిన విద్యుత్ కొరత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు  చెబుతున్నారు. ఈ మేరకు ఏపీఈపీడీసీఎల్ విజయనగరం ఆపరేషన్ సర్కిల్ ఎస్‌ఈ దత్తి సత్యనారాయణ  కోతల సమయాన్ని అధికారికంగా ప్రకటించారు.  జిల్లా కేంద్రంలో ఉదయం 7.30 గంటల నుంచి 9.00 గంటల వరకు మళ్లీ మధ్యాహ్నం 12.30 గంటల నుంచి 2.00 గంటల వరకూ మొత్తం  మూడు గంటల పాటు  కోత విధించనున్నారు.  సాలూరు, బొబ్బిలి, పార్వతీపురం మున్సిపాల్టీల్లో  ఉదయం 9.00 గంటల నుంచి 11.00 గంటల వరకు మళ్లీ మధ్యాహ్నం  3.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు  మొత్తం నాలుగు గంటల పాటు కోత విధిస్తారు. మండల కేంద్రాల్లో  ఉదయం 10.00 గంటల నుంచి 12.00 గంటల వరకు  మరల మధ్యాహ్నం 4.00 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు మొత్తం నాలుగు గంటల పాటు కోత అమలుచేయనున్నారు.  ఇది కాకుండా డిమాండ్‌కు  సరఫరాకు మధ్య వ్యత్యాసం పెరిగినా.... అత్యవసర సమయంలో అదనంగా విద్యుత్ కోతలు విధించనున్నట్లు  ప్రకటించారు.   
 
 గ్రామాల్లో అయోమయం
 అయితే  గ్రామీణ ప్రాంతలకు సంబంధించి విద్యుత్‌కోతలపై అధికారులు ఎటువంటి ప్రకటన చేయలేదు. దీంతో  పల్లెల్లో ఎప్పుడు సరఫరా ఉంటుందో... ఏ సమయానికి నిలిచిపోతుందో తెలియని పరిస్థితి ఉంటుందన్న భావన వ్యక్తమవుతోంది. వాస్తవ పరిస్థితులు పరిశీలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో పగటి సమయంలో సరఫరా ఉండడం లేదు. ఇది కాకుండా రాత్రి వేళల్లో కూడా రెండు నుంచి మూడు  గంటల పాటు ఈఎల్‌ఆర్ పేరిట కోతలు విధిస్తున్నారు. వేసవి ఆరంభంలోనే ఈ తరహా పరిస్థితి ఉంటే భవిష్యత్‌లో ఇంకెంత దారుణంగా ఉంటుందోనన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement