మోగిన మున్సిపల్ ఎన్నికల నగారా
రాష్ట్ర విభజన...అనంతరం రాష్ర్టపతి పాలన, ఆపై అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఉక్కిరిబిక్కిరవుతున్న అధికారులు, రాజకీయ నేతలపై ఉప్పెనలా మున్సిపల్‌ఎన్నికలు వచ్చిపడ్డాయి. దీంతో వారు తేరుకోలేని పరిస్థితి ఏర్పడింది. మరో వైపు వార్షిక పరీక్షలు కూడా ఇదే నెలలో నిర్వహించవలసి రావడంతో అధికారులు ఒత్తిడికి గురవుతున్నారు. ఉన్న ఉపాధ్యాయులను ఇటు పరీక్షలకు, అటు ఎన్నికల విధులకు ఎలా సర్దుబాటు చేయాలో తెలియని పరిస్థితిలో వారుండగా, ఒకే సారి ఇటు మున్సిపల్ ఎన్నికలు, అటు అసెంబ్లీ ఎన్నికలు వచ్చి పడడంతో సమయాభావంతో తాము వెనుకబడిపోతామేమోనని నేతలు ఆందోళన చెందుతున్నారు.
సాక్షి ప్రతినిధి, విజయనగరం : మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. సార్వత్రిక ఎన్నికల ముందే మున్సిపల్ ఎన్నికల రైలు పట్టాల మీదకు వచ్చేసింది. దీంతో అధికార యంత్రాంగం ఎన్నికల ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఆశావహుల్లో ఉత్కంఠ మొదలైంది. ఎన్నికల ఫీవర్ ప్రారంభమైంది. జిల్లాలోని విజయనగరం, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం మున్సిపాలిటీలకు ఈనెల 30వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. కోర్టులో ఉన్న వివాదం కారణంగా నెల్లిమర్ల నగర పంచాయతీకి మాత్రం ఈ విడతలో ఎన్నికలు జరగడం లేదు. ఎన్నికలు జరగనున్న నాలుగు మున్సిపాలిటీలకు సోమవారం రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. 10వ తేదీన ఎన్ని కలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది.ఆ రోజు నుంచి 14వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ, 15వ తేదీన నామినేషన్ల పరిశీలన, 18వ తేదీ లోపు ఉపసంహరణ ప్రక్రియ జరగనుంది. 30న పోలింగ్, ఏప్రిల్ రెండో తేదీన లెక్కింపు జరుగుతుంది. ఏప్రిల్ 7వ తేదీన చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారు.
‘కోడ్’ కూసింది...
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సోమవారం సాయంత్రం నుంచే కోడ్ అమల్లోకి వచ్చింది. కొత్తగా చేపట్టే అభివృద్ధి పనులకు బ్రేక్ పడింది. పాలనాపరమైన వ్యవహారాలు స్తంభించిపోనున్నాయి. అత్యవసరమైన వాటికి తప్ప మిగతా ఏ విషయాల్లోను నిర్ణయాలు తీసుకునే అధికారం యంత్రాంగానికి ఉండదు. త్వరలోనే సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ ఖరారు కానుండడంతో దా దాపు 70 రోజులకు పైగా అభివృద్ధి పనులు నిలిచిపోనున్నారుు.
ప్రభుత్వ కార్యాలయాలు వెలవెలబోనున్నాయి. అధికారులంతా ఎన్ని కల ఏర్పాట్లలో నిమగ్నం కానున్నారు. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల కోసం ఆత్రుతతో ఎదురుచూస్తున్న నాయకులకు ఊహించని విధంగా మున్సిపల్ ఎన్నికలు ఎదురవడం పరిస్థితి కాస్త క్లిష్ట తరంగా మారింది. అయితే ఎన్నాళ్లగానో కౌన్సిలర్, చైర్మన్ పదవుల కోసం ఆశపడుతున్న నేతలు మాత్రం ఉత్సాహంగా ఉన్నారు. మున్ముందు ఎమ్మెల్యే ఎన్నికలు జరగ నుండడంతో నాయకులంతా పట్టుదలతో పని చేస్తారని, తమ గెలుపు కోసం తీవ్రంగా కష్టపడతారని భావిస్తున్నారు. కాకపోతే పార్టీ తమకు పోటీ అవకాశం ఇస్తుందో లేదన్న ఉత్కంఠ మాత్రం ఆశవాహులకు మొదలైంది