విజయనగరం మున్సిపాలిటీ, న్యూస్‌లైన్:
మున్సిపల్ ఎన్నికలు జరగవులే..అని ఇంతవరకు ధీమాగా ఉన్న రాజకీయ పార్టీలకు సుప్రీం కోర్టు ఆదేశాలతో ఒక్కసారిగా షాక్ తగిలింది. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ అకస్మాత్తుగా విడుదల కావడంతో అభ్యర్థుల ఎంపిక అన్ని పార్టీలకు సవాల్‌గా మారింది. దీంతో పాటు సాధారణ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కావడంతో రాజకీయ పార్టీలన్నీ బిజీబిజీగా తయారయ్యాయి. జిల్లాలో విజయనగరం, పార్వతీ పురం, సాలూరు, బొబ్బిలి మున్సి పాలిటీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలై ఐదు రోజులైనా పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించలేని పరిస్థితులు ఉన్నాయి.
నాలుగు మున్సిపాలిటీల్లో అభ్యర్థులను ఎంపిక చేసేందుకు రాజకీయ పార్టీల నేతలు వేటను ముమ్మరం చేశాయి. ఒకపక్క నామినేషన్ వేయడానికి రోజులు దగ్గర పడుతున్నా అభ్యర్థుల కోసం ఇంకా వెతుకుతూనే ఉన్నారు. అయితే జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో వైఎస్‌ఆర్‌పీసీ, కాంగ్రెస్, టీడీపీలు అభ్యర్థుల ఎంపికకోసం కమిటీలను ఏర్పాటు చేశా యి. ఆ కమిటీలు అభ్యర్థుల ఎంపిక తదితరాలపై చర్చించి మంచి అభ్యర్థుల కోసం వెతుకులాట ప్రారంభించాయి. జిల్లాలో ఎంపిక చేసిన లిస్టులను రాష్ట్ర కమిటీకి పంపించి ఆమోదిస్తారు. అయితే ఇంతవరకు మూడు ప్రధాన రాజకీయ పార్టీలు మున్సిపల్ అభ్యర్థులను ఎంపిక చేయకపోవడం విశేషం. మున్సిపల్ అభ్యర్థుల జాబితాలను దఫదఫాలుగా విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మూడు ప్రధాన రాజకీయపార్టీలతో పాటు ఆమ్ ఆద్మీ, లోక్‌సత్తా, సీపీఐ ఈ ఎన్నికల్లో రంగంలోకి దిగుతున్నాయి. ఆయా పార్టీల తరఫున పోటీచేసే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరుతున్నాయి. రాష్టస్థాయిలో ఉన్న పొత్తులను బట్టి మున్సిపాల్టీల్లో కొన్ని వార్డుల్లో పోటీ చేసేందుకు సీపీఎం సిద్ధమవుతోంది. సీపీఐ కూడా సాలూరు, విజయనగరం మున్సిపాల్టీల్లో బలమున్న వార్డుల్లో పోటీ చేసేందుకు సన్నద్ధమవుతోంది. మరో రెండురోజుల్లో జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు సంబంధించి పోటీ చేసే అభ్యర్థుల లిస్టులను ప్రకటించే అవకాశం ఉంది.
విజయనగరంలో కాంగ్రెస్‌ది అయోమయ పరిస్థితి
విజయనగరంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అయోమయంలో ఉంది. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీదే పూర్తి బాధ్యత అని ప్రజలు భావిస్తున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో విధ్వంసకర సంఘటనలపై విద్యార్థులపై అక్రమ కేసులు పెట్టడంతో కాం గ్రెస్ పార్టీని ఎన్నికల భయం వెంటాడుతోంది. సమైక్యాంధ్ర ఉద్యమం చేసినా ప్రజలు తమ పార్టీని నమ్మడం లేదని స్వయంగా డీసీసీ అధ్యక్షుడు కోలగట్ల వీరభద్రస్వామి గతంలో ప్రకటన చేయడం విశేషం. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కాకుండా ఇండిపెండెంట్లుగా పోటీ చేసేందుకు కొందరు కాంగ్రెస్ నేతలు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఎవరైతే గెలుస్తారో?
Published Fri, Mar 7 2014 3:17 AM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM
Advertisement
Advertisement