Collecterate siege
-
కదం తొక్కిన ఆశ వర్కర్లు
- ఏపీ సాక్స్ కార్యాలయం, కలెక్టరేట్ల ముట్టడి - కనీస వేతనం రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ హైదరాబాద్/సాక్షి నెట్వర్క్: ఆశవర్కర్లు ఆందోళనబాట పట్టారు. కనీస వేతనం కోసం కదంతొక్కారు. సమస్యల్ని పరిష్కరించాలని బుధవారం ఏపీ సాక్స్ కార్యాలయాన్ని, పలు జిల్లాల్లో కలెక్టరేట్లను ముట్టడించారు. పోలీసులు అడ్డుకోవడంతో పలుచోట్ల ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ వాలంటరీ అండ్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్(ఆశా) యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కోఠిలోని ఏపీ సాక్స్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. తెలంగాణ నలుమూల నుంచి వందలాదిగా ఆశవర్కర్లు వచ్చారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ర్ట నాయకురాలు కె.నిర్మల మా ట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వస్తే ఆశ వర్కర్లలకు వెట్టిచాకిరీ ఉండదని సీఎం కేసీఆర్ ఉద్యమ సమయంలో చెప్పి ఇప్పుడు విస్మరించారన్నారు. ఆశ వర్కర్లకు కనీస వేతనం 15 వేలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. అనంతరం ఆశ నోడల్ అధికారి జనార్దన్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో ఉదయం ఏడు గంటల నుంచే ఆశా కార్యకర్తలు కలెక్టరేట్లకు తరలివచ్చి ప్రవేశద్వారాల వద్ద బైఠాయించారు.ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్‌లోకి చొచ్చుకొని పోయేందుకు ప్రయత్నించగా, పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నా రు. కరీంనగర్ కలెక్టరేట్ వద్ద జరిగిన తోపులాటలో పలువురు ఆశవర్కర్లు సొమ్మసిల్లి పడిపోయారు. నల్లగొండ కలెక్టరేట్ వద్ద ముగ్గురు వర్కర్లు కిందపడిపోయారు. వరంగల్ జిల్లా హన్మకొండలోని కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా జరిగింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ఆశవర్కర్ల సమస్యల్ని పరిష్కరించకపోతే వామపక్షాల ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. -
ఉద్రిక్తత
- ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ నాయకుల కలెక్టరేట్ ముట్టడి - లోపలికి చొచ్చుకెళ్లిన కార్యకర్తలు - కలెక్టర్ కార్యాలయం పెకైక్కి నిరసన అనంతపురం అర్బన్ : ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై అసెంబ్లీలో తీర్మానం చేయాలనే డిమాండ్‌తో ఎమ్మార్పీఎస్ (కృష్ణమాదిగ వర్గం) ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. జిల్లా అధ్యక్షుడు ఎగ్గడి మల్లయ్య ఆధ్వర్యంలో కార్యకర్తలు కలెక్టరేట్ వద్దకు చేరుకున్నారు. వారు లోపలికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. అయినా కొందరు గేటు ఎక్కి లోపలికి ప్రవేశించారు. మరికొందరు గేటును నెట్టుకుని వెళ్లారు. దీంతో కలెక్టర్ ఛాంబర్‌కు వెళ్లే ద్వారాన్ని పోలీసులు మూసేశారు. ఈ క్రమంలో పోలీసులు, ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది. అప్పటికే కొందరు కలెక్టర్ కార్యాలయంపైకి చేరుకుని నిరసన తెలిపారు. మరికొందరు మొదటి అంతస్తులో ఉన్న జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) హేమసాగర్ ఛాంబర్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారందరినీ కిందకు తీసుకొచ్చారు. ఈ క్రమంలో ఒక కార్యకర్త సొమ్మసిల్లి పడిపోవడంతో పోలీసు వాహనంలో ఆస్పత్రికి తరలించారు. చంద్రబాబు అవకాశవాది ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చి అవకాశవాది. ఎస్సీ వర్గీకరణ చేసి పెద్ద మాదిగనవుతానని ఎన్నికల ముందు చెప్పి మాదిగల ఓట్లు దండుకున్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత వర్గీకరణ ఊసెత్తడం లేదు. అసెంబ్లీలో వర్గీకరణ బిల్లుపై ఏకగ్రీవ తీర్మానం చేయకపోతే తగిన రీతిలో బుద్ధిచెబుతామ’ని ఎమ్మార్పీఎస్ నాయకులు హెచ్చరించారు. ఆందోళన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మల్లయ్య, ఇతర నాయకులు మాట్లాడారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి పదహైదు నెలలవుతున్నా ఎస్సీ వర్గీకరణ అంశంపై ఒక్క మాట కూడా మాట్లాడలేదని మండిపడ్డారు. ఇదే తరహాలో వ్యవహరిస్తే మాదిగల సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు. నిరుపేదలైన మాదిగలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని, ఇప్పటికే ప్రభుత్వ స్థలంలో నిర్మించుకున్న ఇళ్లకు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న డీఆర్ఓ హేమసాగర్ అక్కడి చేరుకుని నాయకులతో మాట్లాడారు. ఇళ్ల స్థలాలు, పట్టాలు ఇచ్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు పెన్నోబుళేసు, ఎమ్పార్పీఎస్ నాయకులు పోతులయ్య, కదిరప్ప, ప్రకాశ్, బేదెప్ప తదితరులు పాల్గొన్నారు. -
కార్మికులపై దమనకాండ
సాక్షి, విజయవాడ బ్యూరో: మున్సిపల్ కార్మికులు తమ ఆందోళనలో భాగంగా శుక్రవారం చేపట్టిన కలెక్టరేట్ల ముట్టడిపై పోలీసులు బలప్రయోగానికి దిగారు. తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని విన్నవిస్తూ 15 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోని నేపథ్యంలో మున్సిపల్ కార్మికులు తాజా ఆందోళన చేపట్టగా.. వారిపై ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పింది. దీంతో పోలీసులు దమనకాండకు దిగారు. ఉవ్వెత్తున ఉద్యమం.. :సమ్మెకు వైఎస్సార్ కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ మద్దతు తెలిపిన నేపథ్యంలో శుక్రవారం కలెక్టరేట్ల దిగ్బంధనం ఉవ్వెత్తున సాగింది. నాలుగు రోజుల్లో సమ్మెను పరిష్కరించకపోతే రాష్ట్ర బంద్ చేపడతామంటూ ఇప్పటికే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చిన సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో కార్మికులు పెద్ద ఎత్తున కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమంలో పాల్గొన్నారు. మున్సిపల్ కార్మికులతోపాటు వారి సమ్మెకు మద్దతు పలికిన వివిధ పార్టీల నేతలు ఈ ఆందోళనల్లో పాలుపంచుకున్నారు.కలెక్టరేట్ల ముట్టడికి దిగిన కార్మికులు, నేతలపై పోలీసుల దమనకాండ కొనసాగింది. కడప కలెక్టరేట్‌ను ముట్టడించిన కార్మికులు, నేతలను లాఠీలతో చావబాదారు. పోలీసుల ప్రతాపానికి దాదాపు 25 మంది కార్మికులకు గాయాలవగా 9 మంది ఆసుపత్రిపాలయ్యారు. విజయవాడ సబ్‌కలెక్టర్ కార్యాలయ ముట్టడి సందర్భంగా పోలీసులు, కార్మికులకు మధ్య తోపులాట జరిగింది. తోపులాటలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.ఓబులేషు, వైఎస్సార్ కాంగ్రెస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పి.గౌతంరెడ్డి, కార్మికులు పెద్దసంఖ్యలో సొమ్మసిల్లి పడిపోయారు. శ్రీకాకుళంలో మంత్రి అచ్చెన్నాయుడ్ని ఆందోళనకారులు అడ్డుకున్నారు. నేటినుంచి నిరవధిక నిరాహారదీక్షలు.. తమ సమస్యల పరిష్కారం విషయంలో మీనమేషాలు లెక్కిస్తున్న ప్రభుత్వంతో అమీతుమీ తేల్చుకుంటామని మున్సిపల్ కార్మికులు, ఉద్యోగుల జేఏసీ నేతలు కె.ఉమామహేశ్వరరావు, రంగనాయకులు శుక్రవారం ప్రకటించారు. శనివారం నుంచి నిరవధిక నిరహార దీక్షలు చేపడతామని తెలిపారు. -
ప్రోత్సాహం లేదు
ఉద్యమించిన పాడి రైతులు చిక్కబళ్లాపురం కలెక్టరేట్ ముట్టడి చిక్కబళ్లాపురం :నిబంధనల పేరుతో పాల సేకరణలో ఇక్కట్లకు గురి చేస్తున్న ప్రభుత్వ వైఖరిపై పాడి రైతులు మండిపడ్డారు. బుధవారం చిక్కబళ్లాపురం కలెక్టరేట్‌ను ముట్టడించి ధర్నా చేపట్టారు. అంతకు ముందు కెఎంఎఫ్ డెరైక్టర్ కె.వి.నాగరాజు నేతృత్వంలో వేలాది మంది పాడి రైతులు స్థానిక ఎపీఎంసీ యార్డు నుంచి శిడ్లఘట్ట సర్కిల్ చేరుకుని ఏడవ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ... ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 3.5 ఫ్యాట్ 8.5ఎస్ఎన్ఎఫ్ పాలు సరఫరా చేసే వారికి మాత్రమే రూ. 4 మద్దతు ధర అందజేస్తోందని తెలిపారు. ఈ విధానం వల్ల పాడి రైతులు సంక్షోభంలో కూరుకుపోతున్నారని అన్నారు. కరువు జిల్లాలో ఉన్న కొద్ది పాటి నీటి వనరులతోనే పాడి పరిశ్రమ అభివృద్ధికి రైతులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కర్ణాటకలో ప్రతి లీటరు పాలకు రూ. 29 చెల్లిస్తున్నారని, అదే ఆంధ్ర, మహారాష్ట్ర ప్రాంతాల్లో ఒక లీటరు పాలకు రూ. 36 ఇస్తున్నారని వివరించారు. కర్ణాటకలోనూ లీటరు పాలకు రూ. 36 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్ చేరుకుని ముట్టడి చేశారు. ఈ సందర్భంగా నగరంలో పాడి రైతులు బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో తాలూకా విశ్వేశ్వర్య పాల అభివృద్ధి సంఘం అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, పాడి రైతులు పాల్గొన్నారు. -
విద్యార్థి సంఘాల ఆందోళన
ఉద్రిక్తంగా మారిన విద్యార్థి సంఘాల ఆందోళన కార్యాలయంలోనికి చొచ్చుకెళ్లేందుకు యత్నం వారి వెంట పరుగులు తీసిన పోలీసులు దాదాపు గంటసేపు హైడ్రామా : భారీగా తోపులాట 50 మంది విద్యార్థి నాయకుల అరెస్ట్ : ఠాణాకు తరలింపు ఇందూరు : విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ శనివారం పలు విద్యార్థి సంఘాలు చేపట్టిన కలెక్టరేట్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. నగరంలోని రాజీవ్‌గాంధీ ఆడిటోరియం నుంచి ర్యాలీతో శాంతియుతంగా వచ్చిన విద్యార్థులు ఒక్కసారిగా కలెక్టర్ కార్యాలయం లోపలికి చొచ్చుకెళ్లడానికి ప్రయత్నించారు. వారిని నిలువరించడానికి పోలీసులు యత్నించినప్పటికీ, విద్యార్థి నాయకులు దాదాపు పది మంది వరకు గేట్లను తోసుకుని మరీ లోనికి పరుగులు తీశారు. పోలీసులు వారి వెంట పరుగులు తీశారు. కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద ఉన్న నాయకులను, లోనికి చొరబడినవారిని అరెస్టు చేసి వాహనంలో ఎక్కించారు. అయితే, విద్యార్థి నాయకుల ఆరెస్టుకు నిరసనగా మరికొంత మంది విద్యార్థి నాయకులు ప్రధాన గేటు వద్ద ఆందోళనకు దిగారు. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మరోదఫా విద్యార్థి నాయకులను పోలీసులు అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. ఇటు విద్యార్థి నాయకులు మరోసారి కలెక్టరేట్‌లోకి చొచ్చుకెళ్లడానికి గేటు ఎక్కడానికి ప్రయత్నం చే యగా పోలీసులు అడ్డుకున్నారు. భారీ తోపులాట అనంతరం పోలీసులు విద్యార్థి నాయకులను లాక్కె ళ్లి పోలీసు వ్యాన్‌లో ఎక్కించి, ఒకటో టౌన్‌కు తరలించారు. మొత్తం మీద గంట సేపు విద్యార్థి నాయకులు హంగామా చేశారు. దాదాపు 50 మంది వి ద్యార్థి నాయకులు అరెస్టు అయ్యారు. విద్యార్థులను ప్రభుత్వం వంచిస్తోంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత విద్యార్థుల సమస్యలు తీరుస్తానని చెప్పిన సీఎం కేసీఆర్ హామీలను మరిచి విద్యార్థులను వంచిస్తున్నారని పీడీఎస్‌యూ జిల్లా అద్యక్షుడు శ్రీనివాస్ ఆరోపించారు. విద్యార్థుల పేరుతో గెలిచిన కేసీఆర్ విద్యరంగ సమస్యల పరిష్కరించకుండా వెన్నుచూపడం సిగ్గుచేటని విమర్శించారు. కార్పొరేట్ విద్యా వ్యవస్థను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ విద్యను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ కార్పొరేట్ విద్యా సంస్థలకు ఎంపీ కవిత ఎంపిక కావడం ఇందుకు అ ద్దం పడుతోందన్నారు. కేజీ టూ పీజీ విద్యను అమలు చేస్తానని చెప్పి, సంవత్సర కాలంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయకపోవడం దారుణమన్నారు. వెంట నే దాని విధి విధానాలను ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థకు భంగం కలిగిస్తున్న కార్పొరేట్ విద్యా సంస్థలను రద్దు చేయాలన్నారు. ప్రయివేటు వి ద్యా సంస్థల యాజమాన్యాలు విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నా సర్కారు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యహరిస్తోందన్నారు.వెంటనే ఫీజుల నియంత్రణ చట్టా న్ని అమలు చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో మౌలిక సదుపాయలు కల్పించి, ప్ర భుత్వ, ప్రయివేటు పాఠశాలలలో ప్రభుత్వ పాఠ్యపుస్తకాలనే వినియోగించాలన్నారు. ఈ ఆందోళనలో పీడీఎస్‌యూ సంఘ నాయకులు అన్వేష్, సౌంద ర్య, సుధాకర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అద్యక్ష, కార్యదర్శు లు కిరణ్, భానుప్రసాద్, ఎస్ఎఫ్ఐ జిల్లా అద్యక్ష, కార్యదర్శులు నరేష్, రఘురాం, ఏఐఎఫ్డీఎస్ రాష్ట్ర నాయకులు రాజశేఖర్, వినయ్ పాల్గొన్నారు. -
ఈ కలెక్టర్‌ను సాగనంపండి
♦ అఖిలపక్షం నేతృత్వంలో కలెక్టరేట్ ముట్టడి ♦ పోలీసుల బలప్రయోగం ..పలువురికి గాయాలు ♦ కలెక్టర్‌కు శాపనార్థాలు పెట్టిన బద్వేలు మహిళలు ♦ ప్రజావ్యతిరేకి కలెక్టర్‌ను సాగనంపేంతవరకూ విశ్రమించేది లేదు ♦ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ ప్రజాప్రతినిధులు ఐదుగురు డీఎస్పీలు, ఎనిమిది మంది సర్కిల్ ఇన్స్పెక్టర్లు, 10 మంది ఎస్ఐలు, వందలాది మంది ఇతర పోలీసు సిబ్బంది.కలెక్టరేట్ ప్రాంగణం లోపల ముళ్లకంచె. ఉదయం తొమ్మిది గంటలకే పోలీసు యంత్రాంగం హడావుడి. అంతలోనే జిల్లా నలుమూలల నుంచి అఖిలపక్షం నేతృత్వంలో కలెక్టర్ కేవీ రమణకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టేందుకు తరలివచ్చిన నాయకులు, ప్రజలు. ఈ కలెక్టర్‌ను సాగనంపండి అంటూ నేతలు, ప్రజల నినాదాలతో హోరెత్తించారు. ఆందోళన కారులను అరెస్టు చేసేందుకు పోలీసుల బలప్రయోగం చేశారు. ఆందోళనకారులు ప్రతిఘటించడంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. సాక్షి ప్రతినిధి/సెవెన్‌రోడ్స్, కడప : గత కొంతకాలంగా జిల్లా కలెక్టర్ కేవీ రమణ వైఖరికి నిరసనగా అఖిలపక్షం నేతృత్వంలో వివిధ రూపాల్లో ఆందోళన నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రజానీకం, నాయకులు తరలివచ్చారు. కలెక్టరేట్ ఎదుట టెంట్లు ఏర్పాటు చేసుకొని శాంతియుతంగా ఆందోళన చేపట్టారు. ఒక దశలో ‘మాకు అన్యాయం చేస్తుంటే మీ ప్రసంగాలు వినేందుకా! మేము వచ్చింది. కలెక్టర్ ఆఫీసులో ఉంటే ఎలా ఇక్కడే కూర్చుండేది, అక్కడికే పోదాం పదండి. ఆయనతోనే తేల్చుకుందామని’ బద్వేల్ మహిళలు ఆవేశంతో ఊగిపోయారు. వారిని శాంతింపజేసేందుకు పలువురు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అర్థం చేసుకోండి, ఆందోళనను కొనసాగిద్దాం, ఓపిక పట్టండి అంటూ ప్రజాప్రతినిధులు సముదాయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రజావ్యతిరేక వైఖరిపై ప్రజాసంఘాలు, ప్రజలు, ప్రజాప్రతినిధులు తీవ్రస్థాయిలో ఆగ్రహావే శాలు వ్యక్తం చేశారు. ప్రజల్ని కాదని ఏకపక్షంగా వ్యవహరించడం ఎంతమాత్రం సరైంది కాదని నాయకులు మండిపడ్డారు. తన ఇంటి వ్యవహారం అనుకుంటున్నాడా? ప్రజాస్వామ్యంలో ప్రజాధనంతో విధులు నిర్వర్తిస్తున్నారా? అంటూ నిలదీశారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే కుదరదు. కలెక్టర్‌కు రాజకీయాలు అవసరమా? అలా అయితే ఉద్యోగాన్ని వదిలేసి రాజకీయాల్లోకి రా?అంటూ పలువురు సవాల్ విసిరారు. కలెక్టర్ వైఖరికి నిరసనగా ఆందోళన కారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బాబుకు సవతి బిడ్డలం..అందుకే వివక్ష జిల్లా ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, ఇరువురు ఎంపీలు, జడ్పీ ఛెర్మైన్ ఇతర స్థానిక సంస్థల ప్రతినిధులుగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల్ని గెలించారు. గెలిచిన మేము, గెలిపించిన మీరు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవతి బిడ్డలం అయ్యామని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. అందుకే జిల్లా పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని తెలిపారు. కరువు బండను కలెక్టర్ రూపంలో జిల్లా నెత్తిన వేశారని విమర్శించారు. గ్రూప్-1 ద్వారా ఉద్యోగ బాధ్యతలు చేపట్టి డక్కామక్కీలు తిని సస్పెండ్ అయి, పదోన్నతుల ద్వారా కలెక్టర్‌గా జిల్లాకు కేవీ రమణ వచ్చారన్నారు. ప్రజలు, ప్రజాసంఘాలు, ప్రజాప్రతినిధులు ఆందోళన చేస్తుంటే దున్నపోతు మీద వాన కురిసినట్లుగా వ్యవహరిస్తున్నారే తప్పా ప్రజాస్వామ్య విలువలు పెంపొందించే చర్యలు చేపట్టడం లేదని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు.బద్వేల్ ఆస్పత్రిని తరలించవద్దని ప్రజలు వాపోతున్నా, ప్రజాభిప్రాయం మేరకు ఎమ్మెల్యేగా ఆందోళన చేపట్టినా ఏకపక్షంగా తరలించారని ఎమ్మెల్యే జయరాములు తెలిపారు. ప్రస్తుతం వందేళ్లుగా నిర్వహిస్తున్న చ ర్చిలో 60 అడుగులు దారి ఇవ్వాలని హుకుం జారీ చేస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం కలెక్టరేట్ ముట్టడికి సిద్ధమైన ఎమ్మెల్యేలను, ఆందోళనకారులను అరెస్టు చేసి రిమ్స్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈక్రమంలో పలువురు మహిళలకు, కమ్యూనిస్టు కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఎమ్మెల్యేలను వ్యక్తిగత పూచీకత్తుపై పోలీసులు విడుదల చేశారు. అభివృద్ధిని అడ్డుకుంటున్నారు కలెక్టర్ కేవీ రమణ చర్యలు గమనిస్తే జిల్లా అభివృద్ధిని అడ్డుకునేవిగా ఉన్నాయి. బద్వేలు సీఎస్ఐ చర్చి విషయంలో క్రైస్తవులపై చిన్నచూపు చూడటం ఏమాత్రం తగదు. కొంతమంది నాయకుల పనులు చేయడం మినహా జిల్లా ప్రజల సమస్యల గురించి ఆయన పట్టించుకోవడం లేదు. కలెక్టర్‌కు ఇక్కడ పనిచేసే అర్హత ఇక ఏమాత్రం లేదు. - దేవగుడి చంద్రమౌళీశ్వరరెడ్డి, కార్యదర్శి, జిల్లా రైతుసంఘం కలెక్టర్ చర్యలు గర్హనీయం బద్వేలు సీఎస్ఐ చర్చి విషయంలో కలెక్టర్ చర్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. ప్రజలు ఎంత వ్యతిరేకిస్తున్నప్పటికీ సీమాంక్ ఆస్పత్రికి డాక్టర్లను మార్చారు. అధికార పార్టీ నేతల మాటలు వింటూ చర్చి వాళ్లను వేధిస్తున్నారు. ఇంకా కలెక్టర్‌గా ఆయన కొనసాగడం సిగ్గుచేటు. - కె.జయశ్రీ, కన్వీనర్,మానవ హక్కుల వేదిక కలెక్టర్‌ను వెళ్లగొడతాం ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న జిల్లా కలెక్టర్ కేవీ రమణ వైఖరి సహించరానిది. జిల్లాలో పనిచేసే అర్హత ఆయనకు ఏమాత్రం లేదు. ఇలాంటి కలెక్టర్‌ను జిల్లా నుంచి వెళ్లగొట్టాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం తాము ఎటువంటి పోరాటాలకైనా వెనుకాడబోము. - జయరాములు, ఎమ్మెల్యే, బద్వేలు కలెక్టర్ క్షమాపణ చెప్పాలి బద్వేలు పట్టణంలోని సీఎస్ఐ చర్చి, ఆస్పత్రి, దుకాణాల తొలగింపు విషయాల్లో జోక్యం చేసుకోనని, ఇప్పటిదాకా జరిగిన తప్పులపై కలెక్టర్ కేవీ రమణ క్షమాపణ చెబితే ఈ ఆందోళన విరమిస్తాం. లేదంటే ఆయన్ను జిల్లా నుంచి సాగనంపే వరకు పోరాడుతాం. - కె.ఆంజనేయులు,జిల్లా కార్యదర్శి, సీపీఎం ఫ్యాక్షన్‌ను ప్రోత్సహిస్తున్న కలెక్టర్ జిల్లాలో ఫ్యాక్షన్ పోయి ఫ్యాషనిజం వచ్చింది. కానీ కలెక్టర్ వైఖరి ఫ్యాక్షన్‌కు దారి తీసే విధంగా ఉంది. ఆయనకు ఎస్పీ నవీన్‌గులాఠీ కూడా జత కలిశారు. అవసరం లేని 15 చోట్ల ఇసుక రీచ్‌లకు అనుమతించడం ద్వారా అధికార పార్టీ నేతల దోపిడీకి కలెక్టర్ సహకరిస్తున్నారు. జిల్లా కరువుతో అల్లాడుతున్నా సహాయక చర్యల విషయం ఆయనకు పట్టదు. ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డికి సైతం ఒంటిమిట్ట కోదండరామస్వామి కల్యాణోత్సవం రోజు అవమానం జరగడానికి కలెక్టరే కారణం. ఆయన్ను జిల్లా నుంచి సాగనంపకపోతే ఊరుకోం. - ఆదినారాయణరెడ్డి,ఎమ్మెల్యే, జమ్మలమడుగు సీఎస్‌తో విచారణ జరపాలి కలెక్టర్ వ్యవహారాలపై రాష్ట్ర చీఫ్ సెక్రటరీతో విచారణ జరిపించాలి. కలెక్టర్ రమణ క్రైస్తవ-ముస్లింల మధ్య తగువులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. బూట్లతో చర్చిలోకి వెళ్లినందుకు అభ్యంతరం చెప్పిన వారిపై కక్షగట్టడం ఆయన స్థాయికి తగదు. ఒక విద్యార్థి పట్ల అసభ్యంగా వ్యవహరించిన టీచర్‌ను వెనకేసుకు రావడం ఆయన వైఖరిని స్పష్టం చేస్తోంది. ఇలాంటి కలెక్టర్‌ను కొనసాగించడం ప్రభుత్వానికి తగదు. - జి.ఈశ్వరయ్య,జిల్లా కార్యదర్శి, సీపీఐ కలెక్టర్‌ను బదిలీ చేయకపోతే సహాయ నిరాకరణ జిల్లా ప్రజలు తనకు ఓట్లు, సీట్లు ఇవ్వలేదని కక్షగట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడి ప్రజలను కాల్చుకు తినాలంటూ కలెక్టర్ కేవీ రమణను ఇక్కడికి పంపారు. జిల్లాలో నెలకొన్న కరువును కలెక్టర్ పట్టించుకోకపోవడం కాదు...కలెక్టరే ఒక కరువు బండ. గతంలో ప్రతి కలెక్టర్ జిల్లాకు ఎంతో కొంత మేలు చేశారు. దొడ్డిదారిన పదోన్నతి పొంది వచ్చిన కేవీ రమణ ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవడం లేదు. జిల్లా ప్రజల గురించి చెడుగా మాట్లాడటం ఆయనకు తగదు. బద్వేలు ఆస్పత్రిని మార్చవద్దని, అవసరమైతే ప్రసూతి ఆస్పత్రి కూడా అక్కడే పెట్టాలంటూ ప్రజలు కోరినా ఆయన పట్టించుకోవడం లేదు. కలెక్టర్‌ను తక్షణమే బదిలీ చేయకపోతే జిల్లా ప్రజలు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టాల్సి వస్తుంది. - రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్యే, ప్రొద్దుటూరు కలెక్టర్‌ను రీకాల్ చేయాలి సక్రమంగా పనిచేయడం లేదన్న ఆరోపణలపై ఇటీవల కొందరు జిల్లా అధికారులను కలెక్టర్ కేవీ రమణ ప్రభుత్వానికి సరెండర్ చేశారు. అధికార పార్టీలోని కొందరు నేతల పనులను తప్ప ప్రజల సమస్యలను ఏమాత్రం పట్టించుకోని కలెక్టర్‌ను ప్రభుత్వం తక్షణమే రీకాల్ చేయాలి. - ఎస్ఏ సత్తార్, కార్యదర్శి, జిల్లా కాంగ్రెస్ కమిటీ అరెస్టులు అప్రజాస్వామికం ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా తమ సమస్యలపై ఆందోళనలు నిర్వహించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. కలెక్టర్‌ను బదిలీ చేయాలంటూ అఖిలపక్షం నేతృత్వంలో ఆందోళన నిర్వహిస్తున్న ప్రజాప్రతినిధులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం పూర్తిగా అప్రజాస్వామికం. జిల్లాలో నిరంకుశ పాలన కొనసాగుతోంది. బద్వేలులో బ్రిటీషు కాలంలో నిర్మించిన ఆస్పత్రిని అర్ధంతరంగా మార్చాల్సిన పని లేదు. ఇందువల్ల 28 గ్రామాల ప్రజలకు తీవ్ర అసౌకర్య పరిస్థితులు ఏర్పడతాయి. బద్వేలు మున్సిపల్ కౌన్సిల్ సైతం ఆస్పత్రిని మార్చరాదంటూ తీర్మానించినప్పటికీ కలెక్టర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదు. 13 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని నారాయణ కళాశాల యాజమాన్యానికి అప్పగించడానికేనన్న గుసగుసలు ప్రజల్లో వినబడుతున్నాయి. - ఎస్.రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే, మైదుకూరు