కదం తొక్కిన ఆశ వర్కర్లు
- ఏపీ సాక్స్ కార్యాలయం, కలెక్టరేట్ల ముట్టడి
- కనీస వేతనం రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్
హైదరాబాద్/సాక్షి నెట్‌వర్క్: ఆశవర్కర్లు ఆందోళనబాట పట్టారు. కనీస వేతనం కోసం కదంతొక్కారు. సమస్యల్ని పరిష్కరించాలని బుధవారం ఏపీ సాక్స్ కార్యాలయాన్ని, పలు జిల్లాల్లో కలెక్టరేట్లను ముట్టడించారు. పోలీసులు అడ్డుకోవడంతో పలుచోట్ల ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణ వాలంటరీ అండ్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్(ఆశా) యూనియన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కోఠిలోని ఏపీ సాక్స్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. తెలంగాణ నలుమూల నుంచి వందలాదిగా ఆశవర్కర్లు వచ్చారు. ఈ సందర్భంగా యూనియన్ రాష్ర్ట నాయకురాలు కె.నిర్మల మా ట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వస్తే ఆశ వర్కర్లలకు వెట్టిచాకిరీ ఉండదని సీఎం కేసీఆర్ ఉద్యమ సమయంలో చెప్పి ఇప్పుడు విస్మరించారన్నారు.
ఆశ వర్కర్లకు కనీస వేతనం 15 వేలు ఇవ్వాలని ఆమె డిమాండ్ చేశారు. అనంతరం ఆశ నోడల్ అధికారి జనార్దన్‌కు వినతిపత్రం సమర్పించారు. ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో ఉదయం ఏడు గంటల నుంచే ఆశా కార్యకర్తలు కలెక్టరేట్లకు తరలివచ్చి ప్రవేశద్వారాల వద్ద బైఠాయించారు.ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్‌లోకి చొచ్చుకొని పోయేందుకు ప్రయత్నించగా, పోలీసులు పలువురిని అదుపులోకి తీసుకున్నా రు. కరీంనగర్ కలెక్టరేట్ వద్ద జరిగిన తోపులాటలో పలువురు ఆశవర్కర్లు సొమ్మసిల్లి పడిపోయారు. నల్లగొండ కలెక్టరేట్ వద్ద ముగ్గురు వర్కర్లు కిందపడిపోయారు. వరంగల్ జిల్లా హన్మకొండలోని కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా జరిగింది. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ ఆశవర్కర్ల సమస్యల్ని పరిష్కరించకపోతే వామపక్షాల ఆధ్వర్యంలో అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు.