ప్రోత్సాహం లేదు
ఉద్యమించిన పాడి రైతులు చిక్కబళ్లాపురం కలెక్టరేట్ ముట్టడి
చిక్కబళ్లాపురం :నిబంధనల పేరుతో పాల సేకరణలో ఇక్కట్లకు గురి చేస్తున్న ప్రభుత్వ వైఖరిపై పాడి రైతులు మండిపడ్డారు. బుధవారం చిక్కబళ్లాపురం కలెక్టరేట్‌ను ముట్టడించి ధర్నా చేపట్టారు. అంతకు ముందు కెఎంఎఫ్ డెరైక్టర్ కె.వి.నాగరాజు నేతృత్వంలో వేలాది మంది పాడి రైతులు స్థానిక ఎపీఎంసీ యార్డు నుంచి శిడ్లఘట్ట సర్కిల్ చేరుకుని ఏడవ జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ... ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం 3.5 ఫ్యాట్ 8.5ఎస్‌ఎన్‌ఎఫ్ పాలు సరఫరా చేసే వారికి మాత్రమే రూ. 4 మద్దతు ధర అందజేస్తోందని తెలిపారు. ఈ విధానం వల్ల పాడి రైతులు సంక్షోభంలో కూరుకుపోతున్నారని అన్నారు. కరువు జిల్లాలో ఉన్న కొద్ది పాటి నీటి వనరులతోనే పాడి పరిశ్రమ అభివృద్ధికి రైతులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో రైతులను ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. కర్ణాటకలో ప్రతి లీటరు పాలకు రూ. 29 చెల్లిస్తున్నారని, అదే ఆంధ్ర, మహారాష్ట్ర ప్రాంతాల్లో ఒక లీటరు పాలకు రూ. 36 ఇస్తున్నారని వివరించారు. కర్ణాటకలోనూ లీటరు పాలకు రూ. 36 ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టరేట్ చేరుకుని ముట్టడి చేశారు. ఈ సందర్భంగా నగరంలో పాడి రైతులు బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో తాలూకా విశ్వేశ్వర్య పాల అభివృద్ధి సంఘం అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, పాడి రైతులు పాల్గొన్నారు.