♦ అఖిలపక్షం నేతృత్వంలో కలెక్టరేట్ ముట్టడి
♦ పోలీసుల బలప్రయోగం ..పలువురికి గాయాలు
♦ కలెక్టర్‌కు శాపనార్థాలు పెట్టిన బద్వేలు మహిళలు
♦ ప్రజావ్యతిరేకి కలెక్టర్‌ను సాగనంపేంతవరకూ విశ్రమించేది లేదు
♦ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ ప్రజాప్రతినిధులు
ఐదుగురు డీఎస్పీలు, ఎనిమిది మంది సర్కిల్ ఇన్స్‌పెక్టర్లు, 10 మంది ఎస్‌ఐలు, వందలాది మంది ఇతర పోలీసు సిబ్బంది.కలెక్టరేట్ ప్రాంగణం లోపల ముళ్లకంచె. ఉదయం తొమ్మిది గంటలకే పోలీసు యంత్రాంగం హడావుడి. అంతలోనే జిల్లా నలుమూలల నుంచి అఖిలపక్షం నేతృత్వంలో కలెక్టర్ కేవీ రమణకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టేందుకు తరలివచ్చిన నాయకులు, ప్రజలు. ఈ కలెక్టర్‌ను సాగనంపండి అంటూ నేతలు, ప్రజల నినాదాలతో హోరెత్తించారు. ఆందోళన కారులను అరెస్టు చేసేందుకు పోలీసుల బలప్రయోగం చేశారు. ఆందోళనకారులు ప్రతిఘటించడంతో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది.
సాక్షి ప్రతినిధి/సెవెన్‌రోడ్స్, కడప : గత కొంతకాలంగా జిల్లా కలెక్టర్ కేవీ రమణ వైఖరికి నిరసనగా అఖిలపక్షం నేతృత్వంలో వివిధ రూపాల్లో ఆందోళన నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా సోమవారం కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రజానీకం, నాయకులు తరలివచ్చారు. కలెక్టరేట్ ఎదుట టెంట్లు ఏర్పాటు చేసుకొని శాంతియుతంగా ఆందోళన చేపట్టారు. ఒక దశలో ‘మాకు అన్యాయం చేస్తుంటే మీ ప్రసంగాలు వినేందుకా! మేము వచ్చింది.
కలెక్టర్ ఆఫీసులో ఉంటే ఎలా ఇక్కడే కూర్చుండేది, అక్కడికే పోదాం పదండి. ఆయనతోనే తేల్చుకుందామని’ బద్వేల్ మహిళలు ఆవేశంతో ఊగిపోయారు. వారిని శాంతింపజేసేందుకు పలువురు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. అర్థం చేసుకోండి, ఆందోళనను కొనసాగిద్దాం, ఓపిక పట్టండి అంటూ ప్రజాప్రతినిధులు సముదాయించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రజావ్యతిరేక వైఖరిపై ప్రజాసంఘాలు, ప్రజలు, ప్రజాప్రతినిధులు తీవ్రస్థాయిలో ఆగ్రహావే శాలు వ్యక్తం చేశారు.
ప్రజల్ని కాదని ఏకపక్షంగా వ్యవహరించడం ఎంతమాత్రం సరైంది కాదని నాయకులు మండిపడ్డారు. తన ఇంటి వ్యవహారం అనుకుంటున్నాడా? ప్రజాస్వామ్యంలో ప్రజాధనంతో విధులు నిర్వర్తిస్తున్నారా? అంటూ నిలదీశారు. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే కుదరదు. కలెక్టర్‌కు రాజకీయాలు అవసరమా? అలా అయితే ఉద్యోగాన్ని వదిలేసి రాజకీయాల్లోకి రా?అంటూ పలువురు సవాల్ విసిరారు. కలెక్టర్ వైఖరికి నిరసనగా ఆందోళన కారులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
బాబుకు సవతి బిడ్డలం..అందుకే వివక్ష
జిల్లా ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. తొమ్మిది మంది ఎమ్మెల్యేలు, ఇరువురు ఎంపీలు, జడ్పీ ఛెర్మైన్ ఇతర స్థానిక సంస్థల ప్రతినిధులుగా వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల్ని గెలించారు. గెలిచిన మేము, గెలిపించిన మీరు ముఖ్యమంత్రి చంద్రబాబుకు సవతి బిడ్డలం అయ్యామని ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్‌రెడ్డి పేర్కొన్నారు. అందుకే జిల్లా పట్ల వివక్ష ప్రదర్శిస్తున్నారని తెలిపారు. కరువు బండను కలెక్టర్ రూపంలో జిల్లా నెత్తిన వేశారని విమర్శించారు. గ్రూప్-1 ద్వారా ఉద్యోగ బాధ్యతలు చేపట్టి డక్కామక్కీలు తిని సస్పెండ్ అయి, పదోన్నతుల ద్వారా కలెక్టర్‌గా జిల్లాకు కేవీ రమణ వచ్చారన్నారు.
ప్రజలు, ప్రజాసంఘాలు, ప్రజాప్రతినిధులు ఆందోళన చేస్తుంటే దున్నపోతు మీద వాన కురిసినట్లుగా వ్యవహరిస్తున్నారే తప్పా ప్రజాస్వామ్య విలువలు పెంపొందించే చర్యలు చేపట్టడం లేదని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు.బద్వేల్ ఆస్పత్రిని తరలించవద్దని ప్రజలు వాపోతున్నా, ప్రజాభిప్రాయం మేరకు ఎమ్మెల్యేగా ఆందోళన చేపట్టినా ఏకపక్షంగా తరలించారని ఎమ్మెల్యే జయరాములు తెలిపారు.
ప్రస్తుతం వందేళ్లుగా నిర్వహిస్తున్న చ ర్చిలో 60 అడుగులు దారి ఇవ్వాలని హుకుం జారీ చేస్తున్నారని పేర్కొన్నారు. అనంతరం కలెక్టరేట్ ముట్టడికి సిద్ధమైన ఎమ్మెల్యేలను, ఆందోళనకారులను అరెస్టు చేసి రిమ్స్ పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈక్రమంలో పలువురు మహిళలకు, కమ్యూనిస్టు కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఎమ్మెల్యేలను వ్యక్తిగత పూచీకత్తుపై పోలీసులు విడుదల చేశారు.
అభివృద్ధిని అడ్డుకుంటున్నారు
కలెక్టర్ కేవీ రమణ చర్యలు గమనిస్తే జిల్లా అభివృద్ధిని అడ్డుకునేవిగా ఉన్నాయి. బద్వేలు సీఎస్‌ఐ చర్చి విషయంలో క్రైస్తవులపై చిన్నచూపు చూడటం ఏమాత్రం తగదు. కొంతమంది నాయకుల పనులు చేయడం మినహా జిల్లా ప్రజల సమస్యల గురించి ఆయన పట్టించుకోవడం లేదు. కలెక్టర్‌కు ఇక్కడ పనిచేసే అర్హత ఇక ఏమాత్రం లేదు.
- దేవగుడి చంద్రమౌళీశ్వరరెడ్డి, కార్యదర్శి, జిల్లా రైతుసంఘం
కలెక్టర్ చర్యలు గర్హనీయం
బద్వేలు సీఎస్‌ఐ చర్చి విషయంలో కలెక్టర్ చర్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. ప్రజలు ఎంత వ్యతిరేకిస్తున్నప్పటికీ సీమాంక్ ఆస్పత్రికి డాక్టర్లను మార్చారు. అధికార పార్టీ నేతల మాటలు వింటూ చర్చి వాళ్లను వేధిస్తున్నారు. ఇంకా కలెక్టర్‌గా ఆయన కొనసాగడం సిగ్గుచేటు.
- కె.జయశ్రీ, కన్వీనర్,మానవ హక్కుల వేదిక
కలెక్టర్‌ను వెళ్లగొడతాం
ప్రజా వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న జిల్లా కలెక్టర్ కేవీ రమణ వైఖరి సహించరానిది. జిల్లాలో పనిచేసే అర్హత ఆయనకు ఏమాత్రం లేదు. ఇలాంటి కలెక్టర్‌ను జిల్లా నుంచి వెళ్లగొట్టాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం తాము ఎటువంటి పోరాటాలకైనా వెనుకాడబోము.
- జయరాములు, ఎమ్మెల్యే, బద్వేలు
కలెక్టర్ క్షమాపణ చెప్పాలి
బద్వేలు పట్టణంలోని సీఎస్‌ఐ చర్చి, ఆస్పత్రి, దుకాణాల తొలగింపు విషయాల్లో జోక్యం చేసుకోనని, ఇప్పటిదాకా జరిగిన తప్పులపై కలెక్టర్ కేవీ రమణ క్షమాపణ చెబితే ఈ ఆందోళన విరమిస్తాం. లేదంటే ఆయన్ను జిల్లా నుంచి సాగనంపే వరకు పోరాడుతాం.
- కె.ఆంజనేయులు,జిల్లా కార్యదర్శి, సీపీఎం
ఫ్యాక్షన్‌ను ప్రోత్సహిస్తున్న కలెక్టర్
జిల్లాలో ఫ్యాక్షన్ పోయి ఫ్యాషనిజం వచ్చింది. కానీ కలెక్టర్ వైఖరి ఫ్యాక్షన్‌కు దారి తీసే విధంగా ఉంది. ఆయనకు ఎస్పీ నవీన్‌గులాఠీ కూడా జత కలిశారు. అవసరం లేని 15 చోట్ల ఇసుక రీచ్‌లకు అనుమతించడం ద్వారా అధికార పార్టీ నేతల దోపిడీకి కలెక్టర్ సహకరిస్తున్నారు. జిల్లా కరువుతో అల్లాడుతున్నా సహాయక చర్యల విషయం ఆయనకు పట్టదు. ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డికి సైతం ఒంటిమిట్ట కోదండరామస్వామి కల్యాణోత్సవం రోజు అవమానం జరగడానికి కలెక్టరే కారణం. ఆయన్ను జిల్లా నుంచి సాగనంపకపోతే ఊరుకోం.
- ఆదినారాయణరెడ్డి,ఎమ్మెల్యే, జమ్మలమడుగు
సీఎస్‌తో విచారణ జరపాలి
కలెక్టర్ వ్యవహారాలపై రాష్ట్ర చీఫ్ సెక్రటరీతో విచారణ జరిపించాలి. కలెక్టర్ రమణ క్రైస్తవ-ముస్లింల మధ్య తగువులు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. బూట్లతో చర్చిలోకి వెళ్లినందుకు అభ్యంతరం చెప్పిన వారిపై కక్షగట్టడం ఆయన స్థాయికి తగదు. ఒక విద్యార్థి పట్ల అసభ్యంగా వ్యవహరించిన టీచర్‌ను వెనకేసుకు రావడం ఆయన వైఖరిని స్పష్టం చేస్తోంది. ఇలాంటి కలెక్టర్‌ను కొనసాగించడం ప్రభుత్వానికి తగదు.
- జి.ఈశ్వరయ్య,జిల్లా కార్యదర్శి, సీపీఐ
కలెక్టర్‌ను బదిలీ చేయకపోతే సహాయ నిరాకరణ
జిల్లా ప్రజలు తనకు ఓట్లు, సీట్లు ఇవ్వలేదని కక్షగట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఇక్కడి ప్రజలను కాల్చుకు తినాలంటూ కలెక్టర్ కేవీ రమణను ఇక్కడికి పంపారు. జిల్లాలో నెలకొన్న కరువును కలెక్టర్ పట్టించుకోకపోవడం కాదు...కలెక్టరే ఒక కరువు బండ. గతంలో ప్రతి కలెక్టర్ జిల్లాకు ఎంతో కొంత మేలు చేశారు. దొడ్డిదారిన పదోన్నతి పొంది వచ్చిన కేవీ రమణ ప్రజా ప్రతినిధుల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవడం లేదు. జిల్లా ప్రజల గురించి చెడుగా మాట్లాడటం ఆయనకు తగదు. బద్వేలు ఆస్పత్రిని మార్చవద్దని, అవసరమైతే ప్రసూతి ఆస్పత్రి కూడా అక్కడే పెట్టాలంటూ ప్రజలు కోరినా ఆయన పట్టించుకోవడం లేదు. కలెక్టర్‌ను తక్షణమే బదిలీ చేయకపోతే జిల్లా ప్రజలు సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టాల్సి వస్తుంది.
- రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, ఎమ్మెల్యే, ప్రొద్దుటూరు
కలెక్టర్‌ను రీకాల్ చేయాలి
సక్రమంగా పనిచేయడం లేదన్న ఆరోపణలపై ఇటీవల కొందరు జిల్లా అధికారులను కలెక్టర్ కేవీ రమణ ప్రభుత్వానికి సరెండర్ చేశారు. అధికార పార్టీలోని కొందరు నేతల పనులను తప్ప ప్రజల సమస్యలను ఏమాత్రం పట్టించుకోని కలెక్టర్‌ను ప్రభుత్వం తక్షణమే రీకాల్ చేయాలి.
- ఎస్‌ఏ సత్తార్, కార్యదర్శి, జిల్లా కాంగ్రెస్ కమిటీ
అరెస్టులు అప్రజాస్వామికం
ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా తమ సమస్యలపై ఆందోళనలు నిర్వహించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. కలెక్టర్‌ను బదిలీ చేయాలంటూ అఖిలపక్షం నేతృత్వంలో ఆందోళన నిర్వహిస్తున్న ప్రజాప్రతినిధులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం పూర్తిగా అప్రజాస్వామికం. జిల్లాలో నిరంకుశ పాలన కొనసాగుతోంది. బద్వేలులో బ్రిటీషు కాలంలో నిర్మించిన ఆస్పత్రిని అర్ధంతరంగా మార్చాల్సిన పని లేదు. ఇందువల్ల 28 గ్రామాల ప్రజలకు తీవ్ర అసౌకర్య పరిస్థితులు ఏర్పడతాయి. బద్వేలు మున్సిపల్ కౌన్సిల్ సైతం ఆస్పత్రిని మార్చరాదంటూ తీర్మానించినప్పటికీ కలెక్టర్ ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదు. 13 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని నారాయణ కళాశాల యాజమాన్యానికి అప్పగించడానికేనన్న గుసగుసలు ప్రజల్లో వినబడుతున్నాయి.
- ఎస్.రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే, మైదుకూరు
ఈ కలెక్టర్‌ను సాగనంపండి
Published Tue, Apr 7 2015 3:26 AM | Last Updated on Tue, Aug 14 2018 11:24 AM
Advertisement
Advertisement