సాక్షి, అమరావతి: వాణిజ్య పన్నుల శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా 2018–19 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఖజానాకు రూ.84.11 కోట్ల ఆర్థిక నష్టం కలిగినట్టు కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక (కాగ్)లో వెల్లడించింది. రాష్ట్రంలో మొత్తం117 వాణిజ్య శాఖ కార్యాలయాలు ఉండగా.. 2018–19 సంవత్సరానికి గాను అందులో 37 కార్యాలయాల్లోని రికార్డులను కాగ్ పరిశీలించింది. చట్టాలను సరిగా అమలు చేయకపోవడం, నిబంధనలు పాటించకపోవడం వల్ల మొత్తం 448 కేసుల్లో రూ.84.11 కోట్ల వ్యాట్‌ను తక్కువగా మదింపు చేసినట్టు వెల్లడైంది.
180 కేసుల్లో వ్యాట్‌ను విధించకపోవడం లేదా తక్కువగా విధించడం ద్వారా ఖజానాకు రూ.65.29 కోట్ల నష్టం వాటిల్లింది. జరిమానాలు, వడ్డీలు విధించకపోవడం ద్వారా రూ.6.68 కోట్లు, ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ అధికంగా లేదా తప్పుగా క్లెయిమ్ చేయడం ద్వారా రూ.5 కోట్లు, సీఎస్‌టీ చట్టం కింద 67 కేసుల్లో పన్ను విధించకపోవడం వల్ల రూ.4 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు తేల్చింది.
నిబంధనలకు విరుద్ధంగా రాయితీల చెల్లింపులు
రాష్ట్ర పారిశ్రామిక విధానం 2015–20కి విరుద్ధంగా కొన్ని పరిశ్రమలకు పారిశ్రామిక రాయితీలను చెల్లించినట్టు కాగ్ నివేదికలో నిగ్గు తేలింది. నెల్లూరు జిల్లా పరిధిలోని మూడు ఐస్ ఫ్యాక్టరీలకు 2017 నుంచి 2019 మార్చి కాలానికి రూ.1.32 కోట్ల రాయితీలను నిబంధనలకు విరుద్ధంగా మంజూరు చేసినట్టు కాగ్ పేర్కొంది. తినడానికి ఉపయోగించే ఐస్‌ను కాకుండా నిల్వ, సంరక్షణ కోసం తయారు చేసే ఐస్ ఫ్యాక్టరీ అయినప్పటికీ ఆహార తయారీ ప్రోత్సహాక విధానం కింద వీటికి రాయితీలు చెల్లించినట్టు పేర్కొంది. మొత్తం మంజూరైన రూ.1.32 కోట్ల రాయితీ సక్రమం కాదని, ఇప్పటికే చెల్లించిన రూ.76.39 లక్షలు తిరిగి రాబట్టాలని కాగ్ ప్రభుత్వానికి సూచించింది.
రుణ భారంలో పీఎస్‌యూలు
గత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వరంగ సంస్థల పేరుతో భారీగా రుణాలను సమీకరించినట్టు కాగ్ పేర్కొంది. వరి ధాన్యం కొనుగోలు, పీడీఎస్ బియ్యం సేకరణ, మౌలిక వసతుల కల్పన పేరిట ప్రభుత్వరంగ సంస్థల పేరిట భారీగా రుణాలను సేకరించినట్టు తెలిపింది. 2016–17లో రాష్ట్ర పీఎస్‌యూల అప్పులు రూ.8,518.99 కోట్లుగా ఉంటే.. 2018–19 నాటికి రూ.30,530.91 కోట్లకు గణనీయంగా పెరిగిందని వ్యాఖ్యానించింది. రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఎస్‌బీఐ నుంచి రూ.19 వేల కోట్లను అప్పు తీసుకోగా, రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల ఈడబ్ల్యూఎస్ ఇళ్ల భూములు, మౌలిక వసతుల కల్పనకు ఏపీ పట్టణ మౌలిక సదుపాయాలు అభివృద్ధి సంస్థ రూ.3,951.59 కోట్ల రుణాలను తీసుకున్నట్టు పేర్కొంది.
చదవండి: ఏపీ: 18వ రోజుకు కర్ఫ్యూ.. ఆంక్షలు మరింత కఠినతరం
Cyclone Yaas: యాస్ తుపాను.. పలు రైళ్ల రద్దు
Comments
Please login to add a commentAdd a comment