ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న అకడమిక్ గైడెన్స్ అధికారి ఎస్‌ఎస్‌ఎన్.రాజు
నెల్లిమర్ల: పట్టణంలోని మిమ్స్ సమీపంలో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే బీసీ బాలికల గురుకుల పాఠశాలలో ఏర్పాటు చేస్తున్న జూనియర్ కళాశాలను ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ’గా గుర్తించినట్లు ఆ విద్యాసంస్థల అకడమిక్ గైడెన్స్ అధికారి ఎస్‌ఎస్‌ఎన్.రాజు తెలిపారు. పట్టణంలోని బీసీ బా లికలు, మత్స్యకార బాలుర పాఠశాలలను మంగళవారం ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలికల జూనియర్ కళాశాలలో ప్రవేశాలకు సంబంధించిన ప్రకటన ఇప్పటికే విడుదల చేశామన్నారు. వచ్చేనెల 1నుంచి తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇంటర్ తరగతులతో పాటు ఎంసెట్, నీట్, ఐఐటీ, జేఈఈ తదితర ప్రవేశ పరీక్షలకు కోచింగ్ ఇస్తామని చెప్పారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు సంబంధించి సింహాచలంలో బీసీ బాలుర గురుకుల జూనియర్ కళాశాలను ప్రారంభించినట్లు ఎస్‌ఎస్‌ఎన్ రాజు తెలిపారు.
మూడు జిల్లాలకు చెందిన ఇంటర్ విద్యార్థులు ఆ కళాశాలలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. తమ సొసైటీ ఆధ్వర్యంలో నడిచే 12 కళాశాలలతో పాటు జిల్లాకు ఒకటి చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 13 ప్రభుత్వ జూనియర్ కళాశాలలను సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీగా గుర్తించామన్నారు. అన్ని పాఠశాలల్లో ఈ నెల 15న 5వ తరగతి విద్యార్థులకు ఫ్రెషర్స్ డే వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
అలాగే ఏపీ గురుకులాలతో కలిసి అకడమిక్ మీట్ కార్యక్రమాన్ని వచ్చేనెలలో నిర్వహిస్తామని రాజు చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. బీసీ గురుకులాల జిల్లా కన్వీనర్ రఘునాధ్, బాలుర పాఠశాల ప్రిన్సిపాల్ రామినాయుడు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment