నెల్లూరు రూరల్ మండలం గొల్లకందుకూరు గ్రామానికి చెందిన కొండా వెంకట్రామిరెడ్డి అనే రైతుకు 1.60 ఎకరాల భూమి ఉంది. అందులో పంట సాగు చేసుకునేందుకు బంగారు నగలు తాకట్టుపెట్టి రూ.72 వేలు తీసుకున్నారు. అయితే ఇతనికి సెంటు భూమి మాత్రమే ఉందంటూ.. రూ.761 రుణాన్ని జమచేసినట్లు పత్రంలో చూపించారు.
అదే గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే రైతుకు రెండెకరాల పొలం ఉంది. పంట సాగు చేసుకునేందుకు బ్యాంకు నుంచి రూ.22.400 రుణం పొందారు. అయితే ఇతనికి 9 సెంట్లు మాత్రమే పొలం ఉందని రూ. 200 జమచేస్తున్నట్లు చూపించారు. ఇదిలా ఉంటే రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, పాసుపుస్తకం ఉండి.. రుణమాఫీకి అర్హత ఉన్న పెంచలయ్యపేరు జాబితాలోనే లేకుండా చేశారు.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: ‘పచ్చ’ బండారం బయటపడింది. రుణ విముక్తిపత్రం పేరుతో.. రుణ ఉపశమన పత్రాన్ని రైతులకు అందజేస్తున్నారు. అందులోనూ రైతుల వివరాలు తప్పుల తడకగా ముద్రించి ఉన్నారు. పత్రాన్ని అందుకున్న రైతులు ఆందోళన చెందుతున్నారు. రైతుల జీవితాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆడుకుంటున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అధికారం చేపట్టాక మొదటి సంతకాన్నే నీరుగార్చారని, ఆ సంతకానికి విలువలేకుండా చేసిన ఘనత చంద్రబాబుకే దక్కిందని విమర్శస్తున్నారు. హామీలను అమలు చేయలేక రకరకాల విచారణల పేరుతో వాయిదా వేస్తూ వచ్చిన టీడీపీ ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ ఒత్తిడి తెచ్చింది. అందులో భాగంగానే ఇటీవల మహాధర్నా చేపట్టింది. దిగొచ్చిన బాబు హడావుడిగా రుణమాఫీ విధాన ప్రకటన చేశారు. రూ.50వేల లోపు ఉన్న రుణాలన్నీ ఒకటేసారి మాఫీ చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే అమల్లోకి వచ్చేసరికి ఆ హామీని నీరుగార్చారు. రూ.50 వేల లోపు ఉన్న రైతులకు ఒకరికి రూ.10వేలు, ఇంకొకరికి రూ.9వేలు, మరొకరికి రూ.6వేల చొప్పున జమచేస్తున్నామని ప్రకటించారు. మిగిలిన మొత్తం నాలుగేళ్లలో మాఫీ చేస్తామని ప్రభుత్వం జారీ చేసిన పత్రాల్లో ముద్రించారు.
అయితే దీనిపై కొందరు రైతులు అధికారులను నిలదీయగా.. వారు తెల్లమొహం వేయటం కనిపించింది. ప్రభుత్వం గురువారం పంపిణీ చేసిన పత్రాల్లో పైన ‘రుణ విముక్తి పత్రం’ అని ఉంది. అయితే లోపల అంతా రుణ ఉపశమన పత్రం అని ఉంది. పత్రాన్ని చదివిన రైతులు గందరగోళానికి గురవ్వటం కనిపించింది. ఇదంతా బాబు కనికట్టు విద్య అంటూ రైతులు గుసగుసలాడుకుంటూ వెళ్లటం కనిపించింది.
రైతు సాధికారత సదస్సులు వెలవెల
రుణ విముక్తి పత్రాలను పంపిణీ చేయడంతో పాటు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి తెలుసుకుని పరిష్కరించేందుకు ప్రభుత్వం సాధికారత సదస్సులను ప్రారంభించింది. జిల్లాలో గురువారం ప్రారంభించిన ఈ సదస్సులకు రైతుల నుంచి స్పందన కరువైంది. జిల్లాలో ఎక్కడా రైతు సాధికారత సదస్సు విజయవంతమైన దాఖలాలు కనిపించలేదు. ప్రభుత్వం ఇచ్చే పత్రాల కోసం సదస్సులకు రావటం కనిపించింది. పత్రాలు తీసుకున్న రైతులు సదస్సు మధ్యలోనే లేచి వెళ్లిపోయారు. మొత్తంగా చూస్తే ‘రైతు సాధికారత సదస్సు’కు రైతుల నుంచి స్పందన కరువైంది.
‘పచ్చ’మోసం
Published Fri, Dec 12 2014 2:19 AM | Last Updated on Sat, Sep 2 2017 6:00 PM
Advertisement