కొయ్యలగూడెం : పశ్చిమగోదావరి జిల్లా కొయ్యలగూడెం మండలం బయ్యనగూడెం సమీపంలో స్టేట్ హైవేపై ఆదివారం వేకువజామున చోటుచేసుకున్న ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. బయ్యనగూడెం గ్రామానికి సమీపంలో ఇటుకల బట్టీ వద్ద కలప లోడుతో ఆగివున్న లారీని జంగారెడ్డిగూడెం వైపు వెళ్తున్న వ్యాన్ వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తిరువూరు మండలం అంజనాపురం గ్రామానికి చెందిన మట్టా నాగరత్నం (75), చిట్యాల గ్రామానికి చెందిన బజ్జూరి లక్ష్మీదేవి (65), ఖమ్మం జిల్లా కళ్లూరు మండలం తాళ్లూరు గ్రామానికి చెందిన వనిగళ్ల కొండయ్య (50) ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రికి తరలించిన కొద్దిసేపటికే మట్టా నాగరత్నం కుమార్తె వెంకట నర్సమ్మ (50) ప్రాణాలు విడిచింది.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. తిరువూరు మండలం అంజనాపురానికి చెందిన మట్టా రాము, అతని భార్య కల్యాణి తమ కుమార్తెకు నామకరణం, అన్నప్రాసన చేయించేందుకు ఈనెల 13న బాడుగకు కుదుర్చుకున్న వ్యాన్‌లో అన్నవరం బయలుదేరారు. తమవెంట పరిసర గ్రామాలకు చెందిన 16 మంది బంధుగణ ంతో తరలివెళ్లారు. తమ కుమార్తెకు అన్నవరంలో క్షితాక్షి అను నామకరణం, అన్నప్రాసన చేయించారు. అక్కడి నుంచి సింహాచలం, మధ్యలో మరికొన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకుని శనివారం అర్ధరాత్రి ఇంటికి తిరుగు ప్రయాణమయ్యారు. వారు ప్రయాణిస్తున్న వ్యాన్ ఆదివారం వేకువజామున కొయ్యలగూడెం చేరుకోగా, అక్కడ అందరూ టీ తాగారు. అనంతరం ఇళ్లకు తిరుగుముఖం పట్టారు. 10 నిమిషాల వ్యవధిలోనే ఈ ఘోర ప్రమాదం జరిగింది.
క్షతగాత్రులు వివరాలివీ...
ఈ ప్రమాదంలో గాయపడినవారిలో మట్టా కల్యాణి, ఆమె భర్త రాంబాబు (రాము), కల్యాణి తల్లి వెలిగల సావిత్రి, తండ్రి కొండయ్య, అవనిగడ్డ సావిత్రి, బొజ్జారి ధనలక్ష్మి, బొజ్జారి వేణు, మరీదు వీరరాఘవులు, మట్టా లక్ష్మణ్, బొజ్జారి దిలీప్‌సాయి, మట్టా స్రవంతి, బొజ్జారి వేణుగోపాల్, మట్టా స్వాతి, మట్టా తపస్వి, బొజ్జారి పూజిత, పరిగెల వీరభద్రరావు ఉన్నారు. వీరంతా అంజనాపురం, చిట్యాల గ్రామాలకు చెందినవారు. క్షతగాత్రుల రోదనలతో ప్రమాద ప్రాంతం దద్దరిల్లింది. వారి ఆర్తనాదాలతో నిద్ర లేచిన స్థానికులు భయకంపితులయ్యారు. కొందరు ఘటనా స్థలానికి వెళ్లి వ్యాన్‌లోని వారిని బయటకు లాగారు. సీఐ కె.బాలరాజు, ఎస్సై ఎస్‌ఆర్‌ఆర్ గంగాధర్ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాలు చేపట్టారు.
ఎంత ప్రయత్నించినప్పటికీ లారీ, వ్యాన్ వేరుకాకపోవడంతో చేసేది లేక లారీని సుమారు అర కిలోమీటరు మేర వ్యాన్ సహా నడుపుకొంటూ వెళ్లారు. అనంతరం ట్రాక్టర్ సాయంతో వ్యాన్‌ను లాగారు. అనంతరం మృతదేహాలను, క్షతగాత్రులను బయటకు లాగి జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులను కొవ్వూరు ఎమ్మెల్యే కేఎస్ జవహర్ పరామర్శించారు. అత్యవసర వైద్యసేవలు అందించేవిధంగా వైద్యాధికారులతో చర్చించారు. క్షతగాత్రులలో కొందరిని మెరుగైన చికిత్స కోసం ఏలూరు, ఖమ్మం ఆసుపత్రులకు తరలించారు.
అలుముకున్న విషాదం
తిరువూరు : అన్నప్రాశన కార్యక్రమం కోసం పుణ్యక్షేత్రానికి వెళ్లి వస్తూ ప్రమాదంలో నలుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటన మండలంలోని చిట్టేల, ఆంజనేయపురం గ్రామాల్లో విషాదం నింపింది. ఖమ్మం జిల్లా కల్లూరు, తల్లాడ, తాళ్లూరు, తిరువూరు మండలం చిట్టేల, ఆంజనేయపురం గ్రామాల నుంచి వచ్చిన బంధువుల సమక్షంలో అన్నవరం వెళ్లిన వీరంతా తిరిగి వస్తూ ఈ ప్రమాదానికి గురయ్యారు. మరో 16 మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఆర్థిక స్తోమత అంతంతే...
కవలలైన మట్టా రాంబాబు, లక్ష్మణరావులు మైలవరంలో వస్త్ర వ్యాపారం నిర్వహిస్తూ తిరువూరులో కూడా దుకాణం ప్రారంభించే ప్రయత్నంలో ఉన్నారు. రాంబాబు కుమార్తె అన్నప్రాశన కార్యక్రమం అయిన తర్వాత తిరువూరులో వస్త్ర వ్యాపారం ప్రారంభించాలని నిర్ణయించి బంధువులను, కుటుంబసభ్యులను తమతోపాటు అన్నవరం తీసుకెళ్లారు. మృతులలో బజ్జూరి లక్ష్మీదేవి వృద్ధాప్యంలో కూడా చిట్టేలలో కూలి పనులు చేసి జీవిస్తున్నారు. రోడ్డుప్రమాదానికి గురైన కుటుంబాల ఆర్థిక స్తోమత అంతంతమాత్రమే.
మృతదేహాలు స్వగ్రామాలకు తరలింపు
రోడ్డుప్రమాదంలో చనిపోయిన బజ్జూరి లక్ష్మీదేవి, మట్టా నాగరత్నం, కొండలు, వెంకట నర్సమ్మ మృతదేహాలకు ఆదివారం పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం మృతదేహాలను వారి స్వగ్రామాలకు తరలించారు. తిరువూరు శాసనసభ్యుడు కే రక్షణనిధి ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబసభ్యులకు సంతాపం తెలియజేశారు.
నెత్తురోడిన రహదారి
Published Mon, Mar 16 2015 4:21 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
Advertisement
Advertisement