కోవూరు చెరువులో ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులురెడ్డి అనుచరులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. 600 ఎకరాల విస్తీర్ణంలోని చెరువు మట్టిని పెద్దఎత్తున కొల్లగొట్టారు. చిన్న, సన్నకారు రైతులు మట్టిని అడిగినా ఇవ్వకుండా అధికారపార్టీ నాయకుల పొలాలకు తరలించుకున్నారు. ఎమ్మెల్యే సైతం తన పొలానికి చెరువు మట్టిని తరలించుకున్నట్లు స్థానికులు ఆరోపించారు.
కలువాయి మండలంలో రెండో విడతల కింద వెరుబొట్లపల్లి, తిరుమలపాడు, పర్లకొండ, తెలుగురాయపురం, చవటపల్లి చెరువులకు రూ.22.50 లక్షలు మంజూరయ్యాయి. ఈ చెరువుల్లో గతంలో పూడికతీసిన చోట మేకప్ వేసి దానిని కొత్తగా చేసినట్లు రికార్డులు సృష్టించారు. పూడిక తీసిన చోట మట్టిని తమకు అనుకూలమైన వారు మాత్రమే తోలుకునేలా కాంట్రాక్టర్లు షరతులు విధించారు.
ఠ ఉదయగిరి నియోజకవర్గ పరిధిలో కొండాపురం, కలిగిరి, వరికుంటపాడు మండలాల పరిధిలో ఎమ్మెల్యే బంధువులు, అనుచరులు నీరు-చెట్టు పనుల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యాదులందాయి. గతంలో చేపట్టిన పనుల్లో టీడీపీ నేతలు పైపైన పనులు చేసి పెద్దఎత్తున నిధులు కాజేసేందుకు పధకం రచించారు. అందులో భాగంగా పాతగుంతలకన్నింటికీ కొత్తగా బిల్లులు పెట్టినట్లు సమాచారం. ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోనే మొత్తం రూ.కోటి వరకు అవినీతి జరిగిందని అంచనా.
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: టీడీపీ సర్కారు చేపట్టిన నీరు-చెట్టు పథకం ఆ పార్టీ నాయకులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ప్రభుత్వ నిధులు స్వాహా చేయటంలో తమకు మించిన వారు లేరని నిరూపించుకుంటున్నారు. గతంలో ఉపాధిహామీ కింద చెరువుల్లో పూడికతీసిన గుంతలకు ఇప్పుడు తవ్వినట్లు బిల్లులు చేసుకుంటున్నారు. అదేవిధంగా కాలువల్లో పూడికతీయకనే.. గుర్రపుడెక్కలు తొలగించకనే తమ్ముళ్లు నిధులు ఆరగిస్తున్నారు. అవినీతి అక్రమాలను అడ్డుకోవాల్సిన అధికారులు కొందరు చూసీచూడనట్లు వ్యవహరిస్తుంటే... మరికొందరు వారితో కుమ్ముక్కై జేబులు నింపుకునే పనిలో పడ్డారు. ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ.. భూగర్భజలాల అభివృద్ధి కోసం ‘నీరు-చెట్టు’ పథకాన్ని ప్రారంభించింది. మొదటి విడతలో జిల్లాలో రూ.40.01 కోట్లతో 5,202 పనులను చేపట్టింది. జిల్లావ్యాప్తంగా ఉన్న చెరువులు, కాలువలను పూడికతీసి ఆ మట్టిన రైతుల వ్యవసాయ భూములకు తరలించాల్సి ఉంది.ఆ పనులన్నింటినీ టీడీపీ నేతలే చేస్తున్నారు. జిల్లాలో చేపట్టిన పనుల్లో జరుగుతున్న అవినీతి అక్రమాలపై ఉన్నతాధికారులకు రహస్య నివేదిక పంపినట్లు విశ్వసనీయ సమాచారం. ఆ నివేదికలోని అంశాలు మచ్చుకొన్ని...
అక్కడ తమ్ముళ్ల ఇష్టారాజ్యం
టీడీపీ నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న కోవూరు, వెంకటగిరి, ఉదయగిరి నియోజకవర్గాల్లో తమ్ముళ్ల ఇష్టారాజ్యంగా పనులు జరుగుతున్నాయి. కొడవలూరు మండలంలో రూ.25 లక్షల నిధులు దుర్వినియోగం జరిగినట్లు సమాచారం. చెరువులు లేనిచోట కాలువలు పూడికతీశారు. అదికూడా తూతూమంత్రంగానే. బుచ్చిరెడ్డిపాళెం మండలంలో కోవూరు, జొన్నవాడ కాలువలను 30 అడుగుల లోతు పూడికతీయా ల్సి ఉండగా... పైపైనే మట్టి, గుర్రడెక్కలను తొలగించి అసంపూర్తిగా వదిలేశారు.
ప్రస్తుతం భారీవర్షం కురిస్తే ఈ కాలువలకు గండిపడే ప్రమాదం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. వెంకటగిరి పరిధిలో పోలిశెట్టిగుంట, వెంకటగిరి చెరువు పనులు ఇదే తరహాలో జరుగుతున్నాయి. డక్కిలి మండలపరిధిలో టీడీపీ నాయకుడు తన ఐదెకరాల పొలం కోసం చాపలపల్లి చెరువును కలుజును ధ్వంసం చేశారు. దీంతో ఎస్సీ, ఎస్టీ రైతులకు సంబంధించిన 30 ఎకరాల సాగు ప్రశ్నార్థకంగా మారింది.
ప్రజలను మభ్యపెట్టి అక్రమాలు
వెంకటాచలం మండలంలో ఎక్కడ పడితే అక్కడ చెరువులను తవ్వి గ్రావెల్‌ను తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. కృష్ణపట్నం రైల్వేలైను బ్రిడ్జి దాని అనుసంధానం నిర్మాణాలకు స్థానికంగా ఉన్న చెరువుల నుంచి మట్టిని తరలించి తమ్ముళ్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. అనుమతులను ఒకచోట తీసుకొని మరోచోట గ్రావెల్ తరలిస్తున్నారు.
నాయుడుపాళెం చెరువును ముద్దుగుంట చెరువు పేరుతో అనుమతులు తీసుకుని రైల్యేలైను పనులకు గ్రావెల్ తరలిస్తున్నట్లు సమాచారం. చవటపాళెం, కంటేపల్లి, కాకుటూరు కంటేపల్లి, ఇడిమేపల్లి ఆన, లింకు కాలువ, వీరన్న కనుపూరు చెరువు 1,2 తూముల పూడికపనులు, అనికేపల్లి చెరువు కలు జు మరమ్మతు పనులుకు నిధులు మంజూరయ్యాయి. ఈ పనుల్లో తమ్ముళ్లు పెద్దఎత్తున అవినీతికి తెరతీశారు. పొదలకూరు చెరువు నుంచి మట్టిని ఇటుకబట్టీలకు, రియల్‌వెంచర్లకు తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. సూళ్లూరుపేట పరిధిలో ఇనుపూరు, వెలగల పొన్నూరు, కేసీఎన్ గుంట, కోరిడి చెరువుల్లో మట్టిని తీసి అమ్ముకుంటున్నారు. అదేవిధంగా నెర్రికాలువ నుంచి కుదిరికి వెళ్లే సప్లైఛానల్ పనులు జరిగిన ట్లు రికార్డులు సృష్టించారు. అయితే అక్కడ అస్సలు పనులే జరగలేదని స్థానికులు చెబుతున్నారు. ఇకపోతే ఓజిలి, నాయుడుపేట, పెళ్లకూరు పరిధిలోని చెరువుల్లో మట్టిని రియల్ వెంచర్లు, ఇటుకబట్టీలకు తరలించి సొమ్ముచేసుకుంటున్నారు. తడ పరిధిలో కొండూరు, కారూ రు, తడ చెరువుల నుంచి పరిశ్రమలు, భవన నిర్మాణాలకు సరఫరా చేసి జేబులు నింపుకుంటున్నారు.
కావలి పరిధిలో ముసునూరు చెరువు నుంచి మట్టిని తీసి టీడీపీ నేత దాబా నిర్మాణానికి వినియోగించుకున్నారు. జలదంకి పరిధిలో జమ్మలపాళెం చెరువు మట్టిని రియల్ వెంచర్లు, కల్యాణమండపం నిర్మాణానికి తరలించుకుంటున్నారు. బొగోలు మండలంలో కోవూరుపల్లి చెరువు నుంచి 50 వేల క్యుబిక్‌మీటర్లు మాత్రమే మట్టిని తీయాల్సి ఉండగా... టీడీపీ నాయకుడు ఇప్పటికే 5 లక్షల క్యుబిక్ మీటర్లు తవ్వి అమ్ముకున్నట్లు సమాచారం. సంగం మండలంలో జంగాలకండ్రిగ, చెన్నవరప్పాడు, కొరిమెర్ల, తలుపూరుపాడు పరిధిలోని చెరువుల్లో పాతగుంతలను చూపించి అందిన కాడికి దోచుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
పాత పనులు..కొత్త బిల్లులు
Published Thu, Jul 30 2015 1:33 AM | Last Updated on Sun, Sep 3 2017 6:24 AM
Advertisement