సర్కారు స్కూళ్లకు ‘కార్పొరేట్‌’ లుక్కు..! | New Look To Government schools in AP | Sakshi
Sakshi News home page

సర్కారు స్కూళ్లకు ‘కార్పొరేట్‌’ లుక్కు..!

Published Sun, Jun 28 2020 3:52 AM | Last Updated on Sun, Jun 28 2020 8:37 AM

New Look To Government schools in AP - Sakshi

విజయవాడలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో నాడు–నేడు కార్యక్రమం కింద ఏర్పాటు చేసే సామగ్రిని పరిశీలిస్తున్న విద్యా శాఖ మంత్రి సురేష్‌

సాక్షి, అమరావతి: కార్పొరేట్‌ స్కూళ్లను తలదన్నేలా ప్రభుత్వ స్కూళ్లను రూపుదిద్దేందుకు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మనబడి, నాడు–నేడు’ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. 9 రకాల సదుపాయాలను ప్రభుత్వ స్కూళ్లలో ఏర్పాటు చేయించేలా సీఎం ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. మొత్తం 44,512 ప్రభుత్వ స్కూళ్లలో మొదటి దశ కింద 15,715 స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నారు. తొమ్మిది రకాల పనుల్లో వినియోగించే పరికరాల నాణ్యత విషయంలో పేరున్న ప్రముఖ సంస్థల బ్రాండెడ్‌ రకాలను వినియోగిస్తున్నారు. ఆయా కంపెనీల వివిధ పరికరాలు, వస్తువులతో శనివారం విజయవాడలోని సర్వశిక్ష అభియాన్‌ కార్యాలయంలో ప్రత్యేక స్టాల్స్‌ను విద్యాశాఖ ఏర్పాటు చేసింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌ వీటిని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్య సలహాదారు ఎ. మురళి, కమిషనర్‌ వాడ్రేవు చినవీరభద్రుడు, ఏపీఈడబ్ల్యూడీఐడీపీ ఎండీ బాలకృష్ణ, ఆంగ్ల మాధ్యమం ప్రత్యేకాధికారిణి కె.వెట్రిసెల్వి,  ఎస్‌ఎస్‌ఏ ఏఎస్పీడీ ఆర్‌.మధుసూదన్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు, వివిధ జిల్లాల ఏపీఓలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్‌ మీడియాతో మాట్లాడారు. 
నాడు – నేడులో భాగంగా స్కూళ్లకు ఇచ్చే బెంచీలను పరిశీలిస్తున్న మంత్రి సురేష్, అధికారులు    

► స్కూల్‌ పేరెంట్సు కమిటీలతోనే ఈ పనులన్నీ జరిపిస్తున్నాం. నాణ్యమైన బ్రాండెడ్‌ పరికరాలను ప్రొక్యూర్‌ చేస్తున్నామని, జ్యుడీషియరీ ప్రివ్యూ అనంతరం వీటిని టెండర్ల ద్వారా సమకూరుస్తున్నామన్నారు. 
► ప్రతి పనికి సంబంధించిన ప్రతి పైసా ఖర్చును ఎప్పటికప్పుడు ‘మనబడి, నాడు నేడు’ ప్రత్యేక పోర్టల్‌ ద్వారా ప్రజలందరికీ అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. 
► స్కూళ్లు తెరిచే నాటికి పనులన్నీ పూర్తి చేయిస్తాం. స్కూళ్ల భద్రత కోసం ప్రత్యేకంగా వాచ్‌మెన్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తాం.
► పనులకు ఎక్కడా ఇబ్బంది రాకుండా బిల్లులు అప్‌లోడ్‌ కాగానే గ్రీన్‌చానల్‌లో చెల్లింపులు జరుగుతాయి. అవన్నీ పారదర్శకంగా డ్యాష్‌బోర్డులో కనిపించేలా చేశాం.
► ఈ పనులకు సంబంధించి ఏమైనా సమస్యలు, ఒత్తిళ్లు ఉంటే  ప్రభుత్వానికి తెలియచేయడానికి టోల్‌ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేస్తాం. వాటిని వెంటనే పరిష్కరిస్తాం. 
► 2018 డీఎస్సీకి సంబంధించి కోర్టు కేసులు పరిష్కారమైన వాటికి వెంటనే నియామకాలు చేపడుతున్నాం. తక్కిన వ్యాజ్యాలను త్వరగా పరిష్కారమయ్యేలా చేస్తున్నాం. అవి అయిన వెంటనే కొత్త డీఎస్సీకి సంబంధించి ఖాళీల సంఖ్యను సిద్ధం చేసి చర్యలు తీసుకుంటాం.
► పదో తరగతి పరీక్షల విద్యార్థులకు త్వరలో గ్రేడింగ్‌లు ప్రకటిస్తాం. డిగ్రీ తదితర ఉన్నత విద్యాకోర్సుల పరీక్షలు, ఇతర అంశాలకు సంబంధించి ఇప్పటికే యూనివర్సిటీల వీసీలతో చర్చించి సీఎంకు విన్నవించాం. వీటిపై కేంద్రం, యూజీసీ ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆ ప్రకారం ముందుకు వెళ్తాం.

విద్యార్థుల సందేహాల నివృత్తికి టోల్‌ఫ్రీ నంబర్‌
కోవిడ్‌–19, లాక్‌డౌన్‌ నేపథ్యంలో స్కూళ్లు మూతపడి ఇంటిదగ్గరే ఉంటున్న విద్యార్థులకు ప్రభుత్వం ఆన్‌లైన్‌ ద్వారానే కాకుండా దూరదర్శన్‌ సప్తగిరి చానెల్, ఆకాశవాణిల ద్వారా వీడియో, ఆడియో పాఠ్యాంశాలను వినిపిస్తోంది. వాటి ఆధారంగా వర్క్‌బుక్కులలో హోమ్‌వర్కులు చేసేలా చర్యలు తీసుకుంది. వాటిని పరిశీలించి సందేహాలు తీర్చేందుకు విద్యార్థులకు అందుబాటులో ఉండేందుకు వారానికొక రోజు స్కూలులో టీచర్లు ఉండేలా కూడా ఏర్పాట్లు చేసింది. తాజాగా విద్యార్థులు తమ సందేహాలను ఇంట్లో ఉంటూనే నిపుణులైన టీచర్ల ద్వారా నివృత్తి చేసుకొనేలా టోల్‌ ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశామని ప్రభుత్వ స్కూళ్ల ఆంగ్ల మాధ్యమ ప్రత్యేకాధికారిణి కె.వెట్రిసెల్వి తెలిపారు. మొబైల్‌ ఫోన్‌ ద్వారా విద్యార్థులు ‘1800123123124’ టోల్‌ఫ్రీ నంబర్‌కు కాల్‌ చేయాలి. ఆ తర్వాత ఏ తరగతి చదువుతున్నారో అడిగే నెంబర్‌ను నొక్కాలన్నారు. ఆ వెంటనే సంబంధిత తరగతి సబ్జెక్టు నిపుణులకు ఆ కాల్‌ వెళ్తుందని, ఆ నిపుణుడు లైన్లోకి వచ్చి సదరు విద్యార్థికి ఉన్న సందేహాలను నివృత్తి చేస్తారని వివరించారు. శనివారం సమగ్రశిక్ష అభియాన్‌ కార్యాలయంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో మంత్రి సురేష్‌ ఈ టోల్‌ఫ్రీ నంబర్‌ను ఆవిష్కరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement