నంద్యాల టౌన్, న్యూస్‌లైన్: మునిసిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడే కొన్ని గంటల ముందే ఈ నెల 11వ తేదీ ఆదివారం సాయంత్రం నంద్యాల పురపాలక సంఘ కార్యాలయంలో పాత రికార్డుల గది అగ్నికి ఆహుతైంది. త్వరలో మునిసిపాలిటీకి కొత్త పాలకవర్గం ఏర్పడనుండగా గురువారం కీలకమైన మినిట్స్ బుక్ మాయమైంది. తమ అవినీతి, అక్రమాలు వెలుగులోకి రాకుండా జాగ్రత్త పడటానికి కొందరు టీడీపీ నాయకులు, మునిసిపాలిటీ సిబ్బంది ఇలాంటి కుట్రలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. కౌన్సిల్ ఉన్నప్పుడు ఏ పనులను చేపట్టాలన్నా.. అజెండాలో అంచనాలను, ప్రతిపాదనలను చేర్చాల్సి ఉంది. కౌన్సిల్ దీనిపై చర్చించి తీర్మానం చేశాక అమలులోకి తీసుకొని రావాల్సి ఉంది.
అయితే ప్రత్యేక అధికారి పాలనలో ఈ విధంగా అమలులో లేకపోవడంతో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. టీడీపీ నేతలకు, మాజీ కౌన్సిలర్లకు, కాంట్రాక్టర్లకు పనులను చేశారు. మూడున్నరేళ్లలో మున్సిపల్ సిబ్బంది చేసిన 1450 ప్రతిపాదనలను స్పెషల్ అధికారి గుడ్డిగా ఆమోదించారనే విమర్శలున్నాయి. మినిట్స్ బుక్‌ను పరిశీలిస్తే స్పెషల్ ఆఫీసర్ చేసిన తీర్మానాలు తెలుస్తాయి. త్వరలో ఏర్పడనున్న నూతన కౌన్సిల్ ఈ మినిట్స్ బుక్‌ను పరిశీలించి తీర్మానాలను సమీక్షిస్తే అవినీతి, అక్రమాలు బహిర్గతమయ్యే అవకాశం ఉంది. దీంతో ఈ బుక్‌ను మాయం చేసినట్లు తెలుస్తోంది.
జూనియర్, సీనియర్
అసిస్టెంట్లే కీలకం...
2013-14 సంవత్సరానికి చెందిన మినిట్స్ బుక్ మాయం వెనుక సీనియర్ అసిస్టెంట్ స్వామిదాసు, జూనియర్ అసిస్టెంట్ లక్ష్మినారాయణ కీలకమని తెలుస్తోంది. స్పెషల్ ఆఫీసర్ వద్దకు వెళ్లి సంతకాలను తీసుకొనే బాధ్యత లక్ష్మీనారాయణది. తిరిగి ఆ బుక్‌ను సీనియర్ అసిస్టెంట్ స్వామిదాసుకు అప్పగించేవారు.
తర్వాత ఆఫీసులోని ప్రధాన కార్యాలయంలో ఈ బుక్‌ను భద్రపరిచేవారు. అయితే మూడు నెలల క్రితం స్పెషల్ ఆఫీసర్ వద్ద సంతకాలను సేకరించే బాధ్యతలను సీనియర్ అసిస్టెంట్ స్వామిదాసుకు అప్పగించారు. అయినా లక్ష్మీనారాయణనే సంతకాలను తీసుకొచ్చేవారు. మినిట్స్ బుక్‌ను ఒక ప్రైవేటు వ్యక్తితో ఈయన రాయించారనే ఆరోపణలు ఉన్నాయి. వీరితో పాటు మరో ఇద్దరు సిబ్బంది కూడా మినిట్స్ బుక్ మాయం కావడానికి కారకులని మున్సిపల్ కార్యాలయంలో చర్చ సాగుతోంది.
సస్పెన్షన్‌కు రంగం సిద్ధం
మినిట్స్ బుక్ మాయం కావడంపై కమిషనర్ రామచంద్రారెడ్డి ఉన్నతాధికారులకు నివేదికను పంపించారు. ఆర్‌డీ మురళీకృష్ణగౌడ్ విచారణ జరుపుతున్నట్లు తెలిసింది. ప్రధాన కారకులైన లక్ష్మీనారాయణ, స్వామిదాసులపై వేటు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు వీరిపై టూటౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు అయ్యే అవకాశం ఉంది.
ఇంటి దొంగల పనే!
Published Fri, May 23 2014 1:50 AM | Last Updated on Wed, Aug 29 2018 6:13 PM
Advertisement
Advertisement