సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో కొత్త సాఫ్ట్‌వేర్ రూపకల్పన
Published Sat, Aug 17 2013 12:40 AM | Last Updated on Wed, Mar 28 2018 10:56 AM
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: భూముల రిజిస్ట్రేషన్లు, యాజమాన్య హక్కుల బదలాయింపు ప్రక్రియను ప్రభుత్వం సరళతరం చేస్తోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించడం ద్వారా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖలను అనుసంధానం చేస్తోంది. ఈ మేరకు కొత్త సాఫ్ట్‌వేర్‌ను రూపొందిస్తున్నరెవెన్యూ శాఖ.. అతి త్వరలోనే ఈ విధానాన్ని ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే జిల్లాలో ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న ఈ విధానంపై జాయింట్ కలెక్టర్-1 చంపాలాల్ ‘సాక్షి ప్రతినిధి’తో ముచ్చటించారు. వివరాలు ఆయన మాటల్లోనే..
వెబ్‌ల్యాండ్ సాఫ్ట్‌వేర్
ఇకపై మ్యుటేషన్ల జారీ ప్రక్రియలో జాప్యం జరగదు. స్థిర, చరాస్తుల రిజిస్ట్రేషన్ పూర్తయిన మరుక్షణమే ఆ వివరాలన్నీ ఆన్‌లైన్‌లో తహసీల్దార్ కార్యాలయానికి చేరుతాయి. ఆ వివరాలను పహాణీలోని సమాచారంతో సరి పోల్చుకున్న వెంటనే మ్యుటేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. తక్షణమే కొత్త యజమాని వివరాలు పహాణీలో నమోదవుతాయి. తహసీల్దార్ కార్యాల యం చుట్టూ తిరగాల్సి ఉండదు. ఈ మేరకు ఇప్పటికే ‘వెబ్‌ల్యాండ్’ సాఫ్ట్‌వేర్‌ను భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్‌ఏ) డిజైన్ చేశారు. ప్రధాన సర్వర్ కూడా అక్కడే ఉంటుంది. కొత్త సాఫ్ట్‌వేర్‌ను జిల్లావ్యాప్తంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్లు, తహసీల్దార్ ఆఫీసులకు ఇటీవల అనుసంధానం చేశాం. ఈ విధానం అమలులో కొన్ని సాంకేతిక సమస్యలు పరిష్కరించాలి. వీటిని అధిగమించేం దు కు సమయం పట్టవచ్చు. ముఖ్యంగా పహాణీల్లో అక్షర దోషాలుంటే సాఫ్ట్‌వేర్ అనుమతించదు. ఈ క్రమంలో రికార్డుల్లో తప్పొప్పులను పరిశీలించి, సవరించాలని రెవెన్యూ యంత్రాంగాన్ని ఆదేశిం చాం. ఈ సవరణ పూర్తికాగానే కొత్త విధానాన్ని లాంఛనంగా ప్రారంభిస్తాం.
సర్కారు స్థలాల పరిరక్షణ
నగర శివారు విలువైన ప్రభుత్వ స్థలాల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాం. కోట్ల విలువైన భూ ములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు చేపడుతున్నాం. ప్రభుత్వ భూముల గుర్తింపునకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించాం. ఈ నెల ఒకటో తేదీ నుంచి చేపట్టిన ఈ డ్రైవ్ పంద్రాగస్టు నాటికి ముగిసింది. తహసీల్దార్ల నుంచి స్థలాల సమాచారాన్ని సేకరిస్తున్నాం. వివరాలు అందగానే వాటి పరిరక్షణకు నడుంబిగిస్తాం. విలువైన భూములు అక్రమార్కుల చెరలోకి వెళ్లకుండా ప్రభుత్వం ఇప్పటికే రూ.2 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో స్థలాల చుట్టూ ప్రహరీలు, హద్దురాళ్లు, ముళ్ల కంచెలు నిర్మిస్తాం. ఈ బాధ్యతల ను రెండు ఏజెన్సీలకు అప్పగించే యోచనలో ఉన్నాం. జిల్లా గృహ నిర్మాణ శాఖ, సాంఘిక సంక్షేమ (ఇంజనీరింగ్) విభాగాలకు ఈ పనులను కట్టబెట్టనున్నాం.
Advertisement