
ఇంటెలిజెంట్ ట్రాఫిక్ సిస్టమ్ ద్వారా రహదారులపై వాహనాల రద్దీని గుర్తిస్తున్న దృశ్యం
క్షణాల్లో నిర్ణయం.. చకచకా ట్రాఫిక్ నియంత్రణ.. రద్దీని ముందే పసిగట్టి ఏ వైపు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలో.. ఎటువైపు మళ్లించాలో ఆదేశిస్తుంది. ట్రాఫిక్ నిర్వహణకు మానవ సిబ్బంది అవసరం లేదనే రోజు మరెంతో దూరంలో లేదు. చిత్రాలు, గణాంకాల విశ్లేషణతో ఆధునిక కంప్యూటర్ వ్యవస్థలే వాహన రద్దీని నియంత్రిస్తాయి. అమెరికా, యూరప్ దేశాల్లో వాడుకలో ఉన్న ‘ఇంటెలిజెంట్ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (ఐటీఎంఎస్)’ విజయవాడ వాహన చోదకులకు అతి త్వరలో అందుబాటులోకి రానుంది. ఆధునిక పరిజ్ఞానంతో నగర ట్రాఫిక్ వ్యవస్థను నిర్వహించే ఐటీఎంఎస్ వల్ల నగరంలో ఇక ట్రాఫిక్ జామ్‌లకు చెక్ పడనుంది. ఈ నేపథ్యంలో ఐటీఎంఎస్ పనితీరుపై ‘సాక్షి’ అందిస్తోన్న ప్రత్యేక కథనం..
సాక్షి, అమరావతిబ్యూరో: విజయవాడలో ట్రాఫిక్ నిర్వహణ మొత్తం పోలీసు సిబ్బంది మీదే ఆధారపడింది. సుమారు 63కు పైగా జంక్షన్లలో సిగ్నల్ లైట్లున్నా పనిచేస్తున్నవి కొన్నే. ట్రాఫిక్ అధికారులు, సిబ్బంది ఎంత శ్రమిస్తున్నా నిత్యం అనేక కూడళ్లలో ట్రాఫిక్ జామ్‌తో వాహనదారులు నలిగిపోతున్నారు. ఫలితంగా రోజూ పనిగంటలు, పెద్ద ఎత్తున ఇంధనం వృథా అవుతోంది. రాజధానిలో విజయవాడ ప్రాంతం భాగంగా మారిన తరుణంలో దేశ విదేశాల నుంచి ప్రముఖుల రాకపోకలు అనూహ్యంగా పెరిగాయి. అమరావతికి సింహ ద్వారమైన గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడ, గుంటూరు, తుళ్లూరు తదితర ప్రాంతాలకు రాకపోకలు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. ఇక విమానాశ్రయం నుంచి విజయవాడకు అధికార, అనధికార ప్రముఖులు, వారి కాన్వాయ్‌ల సంచారం, ఇతరత్రా రద్దీ గతంలో కంటే నాలుగు రెట్లు పెరిగినట్లు ట్రాఫిక్ వర్గాల అంచనా. ప్రస్తుతం అన్ని రకాలు కలిపి నగరంలో 11 లక్షలకుపైగా వాహనాలున్నాయి.
పనిచేస్తుంది ఇలా..
సాంకేతికతతో ట్రాఫిక్‌ను అత్యంత సమర్థతతో నిర్వహించడమే ఐటీఎంఎస్ లక్ష్యం. సంక్షిష్టమైన టెక్నాలజీ సాయంతో ఇది పనిచేసే విధానాన్ని సులభంగానే అర్ధం చేసుకోవచ్చు. నగర కూడళ్ల మొత్తాన్ని క్లోజ్డ్ సర్క్యూట్ కెమెరాలు, ఆధునిక తరం సిగ్నల్ దీపాలు, బ్యారికేడ్లు, సూచన, హెచ్చరిక బోర్డులు, ధ్వని వ్యవస్థ తదితరాలు ఇమిడి ఉంటాయి. ఒక కేంద్రీకృత వ్యవస్థ అనుక్షణం నగర ట్రాఫిక్‌ను పర్యవేక్షిస్తుంటుంది. ఎక్కడైనా జంక్షన్‌లో ఒకవైపు ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉంటే.. ఆ దారిలో గ్రీన్ లైట్లు ఎక్కువ సేపు వెలుగుతాయి. రద్దీ ఉన్న రోడ్ల నుంచి లేని రహదార్ల వైపు మళ్లిస్తాయి. ఏ రహదారిలో రద్దీ ఎలా ఉందో, ఎలా వెళ్తే సులభంగా గమ్యం చేరుకోవచ్చో పౌరుల సెల్‌ఫోన్లకు ఎస్‌ఎంఎస్‌లు పంపే వ్యవస్థ ఐటీఎంఎస్ సొంతం. నగరంలో ప్రవేశించే ట్రాఫిక్ వల్ల ఎటువైపు ఒత్తిడి ఏర్పడుతుందో ముందే ఊహించి అందుకు అనుగుణంగా ట్రాఫిక్‌ను నిర్వహిస్తుంది. ఇప్పటిదాకా ట్రాఫిక్ కూడళ్లలో నిలబడి గంటలసేపు విధులు నిర్వహించే పోలీసులు ఈ వ్యవస్థ ఏర్పాటయ్యాక ఇక కూడళ్లలో నిలబడితే చాలు.
ఐటీఎంఎస్ ఉపయోగాలు..
ఇంటెలిజెంట్ ట్రాఫిక్ వ్యవస్థ వల్ల నగరంలోని రహదారులను మెరుగ్గా వినియోగించుకోవచ్చు. అలాగే ప్రయాణ సమయం కూడా ఆదా అవుతుంది. రోడ్డు ప్రమాదాల శాతం కూడా తగ్గుతుంది. ట్రాఫిక్ కూడళ్ల వద్ద నిరీక్షణ 45 శాతం తగ్గే అవకాశం ఉంది. సాఫీ ట్రాఫిక్ వల్ల పర్యావరణానికీ మంచిది. ఇంధన వినియోగం 20 శాతం పొదుపు అవుతుంది. అయితే ఈ పథకానికి భారీ కసరత్తే అవసరం. నగరంలో రోడ్లు, వాటి విస్తీర్ణం, వాటి వాహన సామర్థ్యం, లింక్‌రోడ్లు, మలుపులు, ప్రస్తుత వాహనాలు.. ఇలా అనేక అంశాలను క్రోడీకరించి సాంకేతిక సంస్థలు సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్‌లను రూపొందిస్తాయి. రాబోయే పది, ఇరవై ఏళ్ల అవసరాలనూ ఇక్కడ దృష్టిలో ఉంచుకుంటారు. న్యూయార్క్, టోక్యో, సింగపూర్ వంటి అంతర్జాతీయ నగరాల్లో ఇది విజయవంతంగా నడుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment