‘న్యూస్‌లైన్’తో విశాఖ సినీ తేజాల మాటామంతీ
విశాఖ నగరానికి సినిమా పరిశ్రమకు అవినాభావ సంబంధం ఉంది. ఈ అందాల తీరం షూటింగ్‌లకు నుకూలమన్న విషయం తెలిసిందే. అలాగే ఎంతోమంది నటీనటులు, దర్శకులు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, విలన్లు, నిర్మాతలు మన నగరం నుండి వెళ్లి తెలుగు చిత్ర పరిశ్రమను సుసంపన్నం చేశారు. వీరిలో కొంతమంది తమ న్యూ ఇయర్ కమిట్‌మెంట్స్‌ను ‘న్యూస్‌లైన్’కు వివరించారు.
లవ్ స్టోరీతో వస్తున్నా...
నర్సీపట్నం ప్రాంతానికి చెందిన దర్శకుడు పూరి జగన్నాథ్ నితిన్ హీరోగా నటిస్తున్న హార్ట్ ఎటాక్ చిత్రం షూటింగ్‌లో బిజీబిజీగా ఉన్నారు. ఈ చిత్రం చాలా వరకు పూర్తి కావచ్చింది. మంచి యూత్ ఫుల్ లవ్‌స్టోరీగా నిలుస్తుందని ఆయన చెప్పారు. జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి నెలలో హార్ట్ ఎటాక్‌ను విడుదల చేయనున్నామన్నారు. ఇప్పుడాయన బ్యాంకాక్‌లో షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం తన దృష్టి ఈ చిత్రంపైనే ఉందని, మిగతా ప్రాజెక్టుల వివరాలు తర్వాత వెల్లడిస్తానన్నారు. ప్రేక్షకులకు ఆయన నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్పారు. ఈ ఏడాది ఎన్నో చిత్రాలు విజయవంతమై పరిశ్రమలో అందరూ ఆనందంగా ఉండాలని కోరుతున్నానన్నారు.
ఈ ఏడాది కూడా విశాఖలో షూటింగ్...
ఈ ఏడాది కూడా విశాఖలోనే తన తదుపరి చిత్ర షూటింగ్ జరుగుతుందని ప్రముఖ దర్శకుడు సునీల్‌కుమార్ రెడ్డి చెప్పారు. ఆయనకు ఈ నగరమంటే సెంటిమెంట్. హీరో, గంగపుత్రులు, రొమాంటిక్ క్రైమ్ కథ.. ఇలా తాను డెరైక్ట్ చేసిన సినిమాలు విశాఖలోనే తీశారు. తన సొంత బ్యానర్ శ్రావ్య ఫిలిమ్స్‌పై యూత్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రం రూపొందిస్తున్నానని, జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి తొలి వారంలో షూటింగ్ ప్రారంభిస్తానని చెప్పారు. ఇద్దరు పెద్ద హీరోలతో సినిమాలు చేయడానికి చర్చలు సాగుతున్నాయన్నారు. ప్రజలందరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెబుతూ సామాజిక దృక్పథంతో సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలని కోరారు.
మరింత కామెడీ పండిస్తా...
విశాఖ నుండి వెళ్లిన కొద్ది కామెడియన్లలో ప్రస్తుత జనరేషన్‌లో బాగా పాపులర్ అయిన నటుడు సుమన్ శెట్టి. పూర్ణామార్కెట్ ప్రాంతానికి చెందిన ఈ నటుడు కామెడీ పండించడంలో తనదంటూ ఓ ముద్ర వేశాడు. కొత్త సంవత్సరంలో మరి న్ని మంచి చిత్రాల్లో నటిస్తున్నానని, బెస్ట్ కామెడీ పండి స్తానని చెప్పాడు. ఈ ఏడాది ఓ స్త్రీ ప్రేమకధ, రింగ్‌టోన్, తనీష్ హీరోగా చేస్తున్న తమిళ, తెలుగు చిత్రాలు, వరుణ్ సందేశ్ నటిస్తున్న నాతో వస్తావా చిత్రంలో నటిస్తున్నాడు.
ఈ ఏడాది నాకు చాలా ప్రత్యేకం
స్టార్ మేకర్ సత్యానంద్ అంటే తెలియని వారుండరు. సుమారు 70మంది హీరోలను, 12మంది క్యారెక్టర్ నటులను, ఎనిమిదిమంది దర్శకులను, ఎందరో టీవీ ఆర్టిస్టులను అందించిన ఘనత ఆయనది. ఈ సంవత్సరం తనకు చాలా ప్రత్యేకమని సత్యానంద్ చెప్పారు. కారణం ఇరవై ఏళ్ల సినీ ప్రస్థానంలో తాను తొలిసారిగా నటిస్తున్న బిల్లారంగ చిత్రం ఈ ఏడాది విడుదలవుతోంది. దర్శకుడు సునీల్‌కుమార్‌రెడ్డి తీస్తున్న కొత్త చిత్రంలో కూడా సత్యానంద్ నటించబోతున్నారు. ఈ ఏడాది తన దృష్టి అంతా యాక్టింగ్‌పైనేనని చెప్పారు. నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్, చిరు మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌ల చిత్రాలు ఈ ఏడాది రిలీజవుతున్నాయి. వీరిద్దరూ సత్యానంద్ స్కూలు నుండి వచ్చిన వారే. ఈ ఏడాది విశాఖ నుండి మరింతమంది చిత్ర పరిశ్రమకు చేరాలని కోరుతున్నానన్నారు.