వచ్చే ఐదేళ్లూ తెలంగాణ ముళ్ల కిరీటమే : దామోదర రాజనర్సింహ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర నాయకత్వ బాధ్యతలు వచ్చే ఐదేళ్లూ ముళ్ల కిరీటమేనని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ వ్యాఖ్యానించారు. ఫిబ్రవరిలో ప్రత్యేక రాష్ట్రం రావడం ఖాయమని పేర్కొన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో తెలంగాణ ఉద్యోగుల సంఘం డైరీ-2014 ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఇందులో డిప్యూటీ సీఎంతో పాటు జేఏసీ చైర్మన్ కోదండరాం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి, టీఆర్‌ఎస్ శాసనసభా పక్ష నాయకుడు ఈటెల రాజేందర్, రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రాజనర్సింహ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రానికి నాయకత్వం వహించేవారు రాజకీయాలకోసం కాకుం డా కలసికట్టుగా, ఐక్యంగా, దార్శనికతతో పనిచేయాల్సి ఉందన్నారు. వ్యవసాయం, విద్యుత్, సాగునీరు, ఉద్యోగాలు, గ్రామీణ ప్రాంతాల్లో వృత్తుల నైపుణ్యం పెంచే పథకాలను ప్రాథమ్యాలుగా పెట్టుకుని శ్రమించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. దానిని బట్టే ఎలాంటి తెలంగాణను నిర్మించుకుంటామనేది ఆధారపడి ఉంటుందన్నారు. సీమాంధ్ర నేతలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై ఆశతో ఆ ప్రాంత ప్రజలను వంచిస్తున్నారని దామోదర ఆరోపించారు.
ఒక నాయకుడు తన వ్యక్తిగత ఇమేజీని పెంచుకోవడానికి వింతవింత వాదనలతో ధిక్కార స్వరం వినిపిస్తున్నారని సీఎం కిరణ్‌ను ఉద్దేశించి విమర్శించారు. ఎవరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా వచ్చే ఫిబ్రవరి మొదటివారంలోనే తెలంగాణ ఏర్పాటు చేసేందుకు సోనియాగాంధీ స్థిర నిశ్చయంతో ఉన్నారని దామోదర తెలిపారు. తెలంగాణ ఏర్పాటుకు బీజేపీ కట్టుబడి ఉందని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. సీమాంధ్ర ఎంపీలు వ్యతిరేకించినా తెలంగాణ బిల్లును నెగ్గించే బాధ్యతను తీసుకుంటామన్నారు. టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నాయకుడు ఈటెల రాజేందర్ మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని, సభా సాంప్రదాయాలను సీఎం కిరణ్ అవమానిస్తున్నారని మండిపడ్డారు. జేఏసీ చైర్మన్ ఎం.కోదండరాం మాట్లాడుతూ.. తెలంగాణ ఎట్లా వస్తుందో చూస్తానంటున్న టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు ఇంకా ఏం మిగిలిందని చూడటానికి..? అని ప్రశ్నించారు. సీమాంధ్ర కుట్రలను భగ్నం చేయడానికి, ఆంక్షల్లేకుండా బిల్లులో సవరణల కోసం ఒత్తిడి చేయడానికి జనవరి 7న దీక్ష హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద చేయనున్నట్టుగా చెప్పారు. రాజ్యసభ సభ్యుడు రాపోలు ఆనందభాస్కర్ మాట్లాడుతూ.. అణచివేత, వివక్షకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాలు, బలిదానాల అమరత్వాన్ని గుర్తించిన సోనియాగాంధీని తెలంగాణ ప్రజలు మర్చిపోరన్నారు.
విభజన నిర్ణయం తీసుకున్న తర్వాత మళ్లీ ఆపాలంటూ రాష్ట్రపతిని కలవడమే రాజ్యాంగాధిపతిని అవమానించడమని జేఏసీ కో-చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య అన్నారు. కార్యక్రమంలో టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సి.విఠల్, దేవీప్రసాద్, వి.శ్రీనివాస్‌గౌడ్ ఇంటర్ బోర్డు జేఏసీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, అద్దంకి దయాకర్, రసమయి బాలకిషన్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్, వివిధ తెలంగాణ సంఘాల డైరీలను, కేలండర్లను రాజనర్సింహ, నేతలు ఆవిష్కరించారు.