అమరుడా.. జోహార్ | NGO leader Damodar Joshi passes away | Sakshi
Sakshi News home page

అమరుడా.. జోహార్

Published Wed, Feb 19 2014 3:11 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM

NGO leader  Damodar Joshi  passes away

నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర సాధన కోసం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగే ధర్నాకు వెళ్లి గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన ఏపీఎన్‌జీఓ నాయకుడు దామోదర జోషి భౌతికకాయాన్ని మంగళవారం తెల్లవారుజామున నగరంలో ని అయ్యప్పగుడి సమీపంలోని ఆయన స్వగృహానికి తీసుకొచ్చారు. జోషి మృతితో కుటుంబ సభ్యులతో పాటు జిల్లా ప్రజానీకం శోకసంద్రంలో మునిగింది.
 
 ఎన్‌జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రబాబు ఆధ్వర్యంలో భౌతికకాయాన్ని ఢిల్లీ నుంచి విమానంలో చెన్నైకి, అక్కడి నుంచి నగరానికి తీసుకొచ్చారు.  జోషి పార్థివదేహాన్ని చూడగానే కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. పార్థివదేహంపై భార్య మేరీవరం, కుమార్తె లాస్య, కుమారుడు సంతోష్ పడి బోరున విలపించారు. వీరిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. ‘ఇక మాకు ఎవరు అండ? పెద్ద దిక్కు లేకుండా బిడ్డల జీవి తాలను ఎలా చక్కదిద్దాలంటూ’ మృతుడి భార్య రోదించడం పలువురిని కం ట తడి పెట్టించింది. భౌతికకాయాన్ని సందర్శించిన పలువురు నివాళులర్పిం చి జోషితో తమ అనుబంధాన్ని గుర్తు తెచ్చుకుని కన్నీటి పర్యంతమయ్యారు.
 
 జోషి మరణం కలచివేసింది: కాకాణి
 వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి సమన్వయకర్త కాకాణి గోపర్ధనరెడ్డి జోషి భౌతికకాయానికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. కాకాణి మాట్లాడుతూ సమైక్య ఉద్యమంలో చురుకుగా పని చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడన్నారు. జెడ్పీ చైర్మన్‌గా ఉన్నప్పుడు తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు తెచ్చుకున్నారు. జోషి మరణం ఉద్యమాలకు తీరని లోటన్నారు.
 
 జోషి పేదల పక్షపాతి : ఎమ్మెల్సీ విఠపు
 జోషికి ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం నివాళులర్పించారు. విఠపు మాట్లాడుతూ జోషి కష్టజీవని, పేదల పక్ష పాతన్నారు. అక్షరాస్యత ఉద్యమం నుంచే ఆయనతో తనకున్న సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబానికి సానుభూతి తెలిపారు.
 
  జోషి భౌతికకాయాన్ని సందర్శించిన సమైక్య ఉద్యమ నేత  ఆనం జయకుమార్‌రెడ్డి నివాళులర్పించారు. జోషి ఆశయ సాధనకోసం అందరం కృషి చేయాలని సూచించారు.
 
  సీపీఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్, నగర కార్యదర్శి మాదాల వెంకటేశ్వర్లు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. తమ పార్టీతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని ఆయన భౌతికకాయంపై ఎర్రజెండా కప్పారు.
 
   వైఎస్సార్‌సీపీ స్థానిక నేత శివాచారి మాట్లాడుతూ తమ ఆప్తమిత్రుడు జోషి అని, ఆయన లేని లోటు తీర్చలేనిదన్నారు.
 
  జోషి మృతదేహానికి నివాళులర్పించిన జెడ్పీ సీఈఓ జితేంద్ర మాట్లాడుతూ తమ శాఖ ఉద్యోగి సమైక్య పోరులో మరణించడం ఆవేదన కలిగించిందన్నారు. జోషి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
 
   పాస్టర్‌లు జోషి ఆత్మ శాంతికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.  అయ్యప్పగుడి సెంటర్‌లో స్థానిక మైనార్టీ మిత్రులు జోషి ప్లెక్సీని ఏర్పాటు చేశారు. జోషి స్ఫూర్తితో సమైక్యరాష్ట్రాన్ని ఉంచాలని కోరుతూ టైర్లు కాల్చి నిరసన తెలిపారు.
 
  జోషి భౌతికకాయానికి నివాళులర్పించిన వారిలో జెడ్పీ , పంచాయతీరాజ్ యూనియన్ నాయకులు ఎన్.విజయకుమార్, భీమిరెడ్డి, ఇంజనీర్లు వెంకయ్య, మున్వర్, ఖాదర్‌మస్తాన్, ఎంపీడీఓలు వాణి, హేమలత, వసుమతి, చిలకపాటి శ్రీనివాసులు, సుజిత్, భరణి, వివిధ పక్షాల నేతలు షాహినాబేగం, కటికాల వెంకటేశ్వర్లు, కేఎన్‌ఆర్ పాఠశాలలోని ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఉన్నారు. అనంతరం భారీ ప్రదర్శనగా జోషి భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం దర్గామిట్టలోని ఎన్‌జీవో భవన్‌కు తరలించారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement