Damodar Joshi
-
అమరుడా.. జోహార్
నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: సమైక్యాంధ్ర సాధన కోసం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరిగే ధర్నాకు వెళ్లి గుండెపోటుతో తుదిశ్వాస విడిచిన ఏపీఎన్జీఓ నాయకుడు దామోదర జోషి భౌతికకాయాన్ని మంగళవారం తెల్లవారుజామున నగరంలో ని అయ్యప్పగుడి సమీపంలోని ఆయన స్వగృహానికి తీసుకొచ్చారు. జోషి మృతితో కుటుంబ సభ్యులతో పాటు జిల్లా ప్రజానీకం శోకసంద్రంలో మునిగింది. ఎన్జీఓ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రబాబు ఆధ్వర్యంలో భౌతికకాయాన్ని ఢిల్లీ నుంచి విమానంలో చెన్నైకి, అక్కడి నుంచి నగరానికి తీసుకొచ్చారు. జోషి పార్థివదేహాన్ని చూడగానే కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు. పార్థివదేహంపై భార్య మేరీవరం, కుమార్తె లాస్య, కుమారుడు సంతోష్ పడి బోరున విలపించారు. వీరిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. ‘ఇక మాకు ఎవరు అండ? పెద్ద దిక్కు లేకుండా బిడ్డల జీవి తాలను ఎలా చక్కదిద్దాలంటూ’ మృతుడి భార్య రోదించడం పలువురిని కం ట తడి పెట్టించింది. భౌతికకాయాన్ని సందర్శించిన పలువురు నివాళులర్పిం చి జోషితో తమ అనుబంధాన్ని గుర్తు తెచ్చుకుని కన్నీటి పర్యంతమయ్యారు. జోషి మరణం కలచివేసింది: కాకాణి వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి సమన్వయకర్త కాకాణి గోపర్ధనరెడ్డి జోషి భౌతికకాయానికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. కాకాణి మాట్లాడుతూ సమైక్య ఉద్యమంలో చురుకుగా పని చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడన్నారు. జెడ్పీ చైర్మన్‌గా ఉన్నప్పుడు తనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు తెచ్చుకున్నారు. జోషి మరణం ఉద్యమాలకు తీరని లోటన్నారు. జోషి పేదల పక్షపాతి : ఎమ్మెల్సీ విఠపు జోషికి ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం నివాళులర్పించారు. విఠపు మాట్లాడుతూ జోషి కష్టజీవని, పేదల పక్ష పాతన్నారు. అక్షరాస్యత ఉద్యమం నుంచే ఆయనతో తనకున్న సంబంధాన్ని గుర్తు చేసుకున్నారు. వారి కుటుంబానికి సానుభూతి తెలిపారు. జోషి భౌతికకాయాన్ని సందర్శించిన సమైక్య ఉద్యమ నేత ఆనం జయకుమార్‌రెడ్డి నివాళులర్పించారు. జోషి ఆశయ సాధనకోసం అందరం కృషి చేయాలని సూచించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్, నగర కార్యదర్శి మాదాల వెంకటేశ్వర్లు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. తమ పార్టీతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకుని ఆయన భౌతికకాయంపై ఎర్రజెండా కప్పారు. వైఎస్సార్సీపీ స్థానిక నేత శివాచారి మాట్లాడుతూ తమ ఆప్తమిత్రుడు జోషి అని, ఆయన లేని లోటు తీర్చలేనిదన్నారు. జోషి మృతదేహానికి నివాళులర్పించిన జెడ్పీ సీఈఓ జితేంద్ర మాట్లాడుతూ తమ శాఖ ఉద్యోగి సమైక్య పోరులో మరణించడం ఆవేదన కలిగించిందన్నారు. జోషి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. పాస్టర్లు జోషి ఆత్మ శాంతికి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అయ్యప్పగుడి సెంటర్లో స్థానిక మైనార్టీ మిత్రులు జోషి ప్లెక్సీని ఏర్పాటు చేశారు. జోషి స్ఫూర్తితో సమైక్యరాష్ట్రాన్ని ఉంచాలని కోరుతూ టైర్లు కాల్చి నిరసన తెలిపారు. జోషి భౌతికకాయానికి నివాళులర్పించిన వారిలో జెడ్పీ , పంచాయతీరాజ్ యూనియన్ నాయకులు ఎన్.విజయకుమార్, భీమిరెడ్డి, ఇంజనీర్లు వెంకయ్య, మున్వర్, ఖాదర్‌మస్తాన్, ఎంపీడీఓలు వాణి, హేమలత, వసుమతి, చిలకపాటి శ్రీనివాసులు, సుజిత్, భరణి, వివిధ పక్షాల నేతలు షాహినాబేగం, కటికాల వెంకటేశ్వర్లు, కేఎన్ఆర్ పాఠశాలలోని ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఉన్నారు. అనంతరం భారీ ప్రదర్శనగా జోషి భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం దర్గామిట్టలోని ఎన్జీవో భవన్‌కు తరలించారు. -
నింగికేగిన ఉద్యమ జోషి
ఉద్యమజ్యోతి నింగికేగింది. ‘పోరాడితే పోయేదేం లేదు విభజన ముప్పు తప్ప’ అనే స్ఫూర్తితో పోరాడిన ఎన్జీఓ నేత దామోదరజోషి గుండె ఆగింది. సమైక్యమే ఊపిరిగా ఉద్యమించారాయన. రాష్ట్రం విడిపోతే ఎదురయ్యే అనర్థాలు ఆయన మనసులో కల్లోలం రేపాయి. ఎలాగైనా సమైక్య రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే అకుంఠిత దీక్షతో ఢిల్లీ నడివీధిలో సీమాంధ్రుల వాణిని ఎలుగెత్తి చాటేందుకు సహచరులతో కలిసి వెళ్లారు. సమైక్య సమరంలో చివరకు గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. నెల్లూరు (టౌన్), న్యూస్‌లైన్: సమైక్య సమరంలో వీర మరణం చెందిన దామోదర జోషిది ఉద్యమ కుటుంబం. జోషి సోదరులు ప్రజా ఉద్యమాల్లో చు రుగ్గా పాల్గొన్నారు. ఎంతో మందికి సాయం చేశారు. సహచర ఉద్యోగుల తో పాటు స్థానికులతో శభాష్ అనిపిం చుకునేలా నడుచుకున్నారు. నెల్లూరు సమీపంలోని కనుపర్తిపాడుకు చెందిన దామోదరజోషి నెల్లూరులో కుటుంబం తో ఉంటున్నారు. మనుబోలు ఎంపీడీఓ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వర్తింస్తున్నారు. సమై క్య ఉద్యమంలో భాగంగా పంచాయతీరాజ్ తరపున ఢిల్లీ ఆందోళనకు వెళ్లి సోమవారం గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. జోషి మృతితో జిల్లా ప్రజానీకంతో పాటు ఉద్యోగులు దిగ్భ్రాంతికి గురయ్యారు. జిల్లా వ్యాప్తంగా సమైక్య రాష్ట్ర సాధన కోసం అసువులు బాసిన జోషికి పలు మండల కార్యాలయాల్లో ఎక్కడికక్కడే శ్రద్ధాంజలి ఘటించారు. కుప్పకూలిన కుటుంబ సభ్యులు జోషి మరణ వార్త తెలుసుకున్న కుటుం బసభ్యులు ఒక్కసారిగా కుప్పకూలారు. జోషి భార్య మేరి స్థానిక కేఎన్ఆర్ మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలలో ఉపాధ్యాయురాలు. వారికి ఒక కుమార్తె లాస్య, కుమారుడు సంతోష్ ఉన్నారు. కుమార్తె బీటెక్ పూర్తి చేసుకుని సూళ్లూరుపేటలో డ్వామాలో ఔట్సోర్సింగ్ కింద ఉద్యోగం చేస్తున్నారు. కుమారుడు బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నారు. భర్త మరణ వార్తను విన్న భార్య మేరి ఒక్కసారిగా కేఎన్ఆర్ పాఠశాలలో కుప్పకూలారు. సహచర ఉపాధ్యాయులు ఆమెను అయ్యప్పగుడి సమీపంలో ఉన్న టీచర్స్ కాలనీలోని సొంత నివాసానికి తీసుకొచ్చారు. స్నేహితులు, బంధువులు అనునయిస్తున్నప్పటికీ ఆమెను ఓదార్చడం కష్టమైంది. కుమార్తె, కుమారుడు ఓమూల కూర్చొని కుమిలి, కుమిలి ఏడవడం చూసి ప్రతిఒక్కరూ కంటతడి పెట్టారు. విద్యార్థి దశ నుంచే ఉద్యమాల వైపు.. హైస్కూల్ స్థాయిలోనే ఎస్ఎఫ్ఐ వైపు జోషి ఆకర్షితుడయ్యారు. ఐటీఐ చదువుతూ విద్యార్థి సమస్యలపై ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉద్యమించారు. ఉద్యోగం వచ్చాక కూడా 1990లో జన విజ్ఞాన వేదిక తరపున రాత్రి బడుల్లో అక్షరాస్యత కార్యక్రమంలో పని చేశారు. సోదరులు షార్‌లో, ఎంప్లాయ్మెంట్ కార్యాలయాల్లో పనిచేస్తూ ఉద్యోగుల సంక్షేమం కోసం ఉద్యమించారు. ఉద్యోగ ప్రస్థానం టైపిస్టు స్థాయి నుంచి సీనియర్ అసిస్టెంట్‌గా , సూపరింటెండెంట్‌గా పనిచేస్తూనే సర్వీసులోనే మరణించారు. పొదలకూరు, నెల్లూరు పంచాయతీరాజ్, జెడ్పీ కార్యాలయం, మనుబోలు ఎంపీడీఓ కార్యాలయంలో విధులు నిర్వర్తించారు. జోషి మృతికి ఎంపీ మేకపాటి సంతాపం ఎన్జీఓ నేత దామోదరజోషి మృతికి వైఎస్సార్సీపీ సీజీసీ సభ్యుడు, నెల్లూరు పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఢిల్లీ నుంచి ఎంపీ ‘న్యూస్‌లైన్’తో సోమవారం ఫోన్లో మాట్లాడారు. ఢిల్లీలో సమైక్య పోరులో పాల్గొంటూ ప్రాణాలు కోల్పోవడం ఉద్యమానికి తీరనిలోట న్నారు. జిల్లాలో సమైక్య ఉద్యమంలో కీలకంగా వ్యవహరించారని తెలిపారు. జోషి ఆశయ సాధనకు అందరూ చిత్తశుద్ధితో కృషి చేయాలని ఆయన కోరారు. మృతుడి కుటుంబ సభ్యులకు మేకపాటి ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
న్యూఢిల్లీలో ఏపీఎన్జీవో నేత గుండెపోటుతో మృతి
సమైక్యాంధ్రకు మద్దతుగా ఏపీఎన్జీవోలు సోమవారం రాంలీలా మైదానంలో చేపట్టిన ధర్నాలో అపశృతి చోటు చేసుకుంది.నెల్లూరు జిల్లా ఏపీఎన్జీవో ఉపాధ్యక్షుడు దామోదర్ జోషికి తీవ్ర గుండె పోటు వచ్చింది. దాంతో ఆయన సహచరులు వెంటనే స్పందించి దామోదర్ జోషిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఆయన మార్గమధ్యంలోనే మరణించారు. దామోదర్ జోషి మృతికి ఏపీఎన్జీవోలు రాంలీలా మైదానంలో సంతాపం తెలిపారు. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తు ఏపీఎన్జీవోలు దేశ రాజధానిలోని రాంలీలా మైదానంలో సోమవారం మహాధర్నా చేపట్టారు.అందులోభాగంగా సీమాంధ్రలోని పలు జిల్లా నుంచి మొత్తం మూడు రైళ్లలో వేలాది మంది ఏపీఎన్జీవోలు న్యూఢిల్లీ తరలివెళ్లారు.అలా వెళ్లిన దామోదర్ జోషి మృతి చెందడంతో అటు రాంలీలా మైదానం ఇటు నెల్లూరు జిల్లాలో విషాదం నెలకొంది.