రక్షణ దళాల్లో ఒకటైన నావికాదళంపై వలపు వల(హానీ ట్రాప్) విసిరి కీలకమైన రహస్యాలను చోరీ చేస్తున్న ఉదంతంపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) దృష్టి సారించింది. పాకిస్థాన్ ఏజెంట్లు ఫేస్‌బుక్‌లో యువతుల పేరుతో నేవీ ఉద్యోగులను పరిచయం చేసుకొని.. క్రమంగా వారిని ట్రాప్ చేసి రహస్యాలు రాబడుతున్నట్లు తెలుసుకున్న ఇంటెలిజెన్స్ వర్గాలు ఆపరేషన్ డాల్ఫిన్ నోస్ పేరిట ప్రత్యేక దర్యాప్తు చేపట్టి ఏడుగురు నేవీ సిబ్బందిని అరెస్టు చేయడం కలకలం రేపింది. దరిమిలా నేవీలో స్మార్ట్ ఫోన్లు, సోషల్ మీడియా వినియోగాన్ని నిషేధించారు. ఈ వ్యవహారంలో ఇంకా చాలా మంది పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో పూర్తిస్థాయి దర్యాప్తుకు ఎన్‌ఐఏను రంగంలోకి దించుతున్నారు. ఆ సంస్థ అధికారులు రెండు మూడు రోజుల్లో తూర్పు నావికాదళ కేంద్రానికి వచ్చి విచారణ జరుపుతారని సమాచారం.
సాక్షి, విశాఖపట్నం: భారత నౌకాదళ సమాచారాన్ని శత్రుదేశం పాకిస్థాన్‌కు చేరవేస్తున్న ఏడుగురు ఇండియన్ సెయిలర్స్‌ని ఈ నెల 20న అరెస్టు చేసిన కేంద్ర నిఘా వర్గాలు లోతైన విచారణ చేపడుతున్నాయి. దేశ భద్రతకు సంబంధించిన విషయం కావడంతో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(ఎన్‌ఐఏ) ఈ కేసుని సీరియస్‌గా తీసుకుంది. ఆపరేషన్ డాలి్ఫన్ నోస్‌లో వెల్లడైన నిజాల నిగ్గు తేల్చేందుకు రెండు మూడు రోజుల్లో ఎన్‌ఐఏ బృందం విశాఖ రానుంది. తూర్పు నౌకాదళంలో అధికారుల బృందాలతో మాట్లాడి మరిన్ని ఆధారాలు సంపాదించేందుకు ఎన్‌ఐఏ ప్రయతి్నంచనుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు ఈ సంఘటనతో అప్రమత్తమైన నౌకాదళం ఇకపై షిప్‌లలో స్మార్ట్‌ఫోన్ల వినియోగాన్ని బంద్ చేసినట్లు ఆదేశాలు జారీ చేసింది.
వలపు వలలో చిక్కుకుని..
భారత నౌకాదళ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు శత్రుదేశం పాకిస్థాన్ దృష్టి సారించింది. 2017లో నౌకాదళంలో సెయిలర్స్‌గా చేరిన వారిని ఇందుకోసం టార్గెట్ చేసుకుని వలపు వల విసిరింది. ఆర్మీ జవాన్లపై ఈ ఏడాది జనవరిలో విసిరిన ఫేస్‌బుక్ వల మాదిరిగానే... వీరిపైనా అలానే అ్రస్తాన్ని సంధించింది. ఈ వలలో విశాఖ ప్రధాన కేంద్రంగా ఉన్న తూర్పు నౌకాదళానికి చెందిన ముగ్గురు సెయిలర్స్, ముంబయికి చెందిన ఇద్దరు, కర్వార్‌కు చెందిన మరో ఇద్దరు సెయిలర్స్ చిక్కుకున్నారు. ఈ వ్యవహారంపై ఎన్‌ఐఏ, ఏపీ ఇంటెలిజెన్స్, సెంట్రల్ ఇంటెలిజెన్స్, నేవీ ఇంటెలిజెన్స్ సంయుక్తంగా ‘ఆపరేషన్ డాల్ఫిన్ నోస్’ మొదలుపెట్టాయి. డిసెంబర్ 20న ఏడుగురు సెయిలర్స్‌తోపాటు ఒక హవాలా బ్రోకర్‌ని అరెస్ట్ చేసి రిమాండ్‌కి తరలించారు. ప్రస్తుతం వీరంతా రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో ఉన్నారు.
మరికొందరి ప్రమేయంపైనా అనుమానాలు
పాకిస్థాన్ ఇంటర్ సరీ్వస్ ఇంటెలిజెన్స్(ఐఎస్‌ఐ) చట్రంలో కేవలం ఏడుగురు సెయిలర్స్ మాత్రమే కాకుండా మరికొందరు కూడా చిక్కుకున్నారని నిఘా వర్గాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ‘ఆపరేషన్ డాలి్ఫన్ నోస్’ నిర్వహించిన సమయంలోనే ఇంకొందరు సెయిలర్స్ పాత్ర ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమైనా.. కేవలం ఏడుగురి నుంచి మాత్రమే సమగ్ర సమాచారం పాక్‌కు చేరిందని భావించడంతో వారిపైనే దృష్టి సారించి అదుపులోకి తీసుకున్నారు. అయితే మరికొందరు సెయిలర్స్ కూడా పాక్ హనీట్రాప్‌లో చిక్కుకొని నౌకలు, సబ్ మెరైన్స్ కదలికలను ఎప్పటికప్పుడు చేరవేశారనే కోణంలో నిఘా వర్గాలు విచారణ ముమ్మరం చేశాయి.
స్మార్ట్‌ఫోన్ల వినియోగం బంద్
కీలక సమాచారాన్ని పాకిస్థాన్‌కు చేరవేస్తున్న సంఘటన వెలుగు చూడటంతో నౌకాదళం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. మరికొంత మంది ఇంటి దొంగలు ఉన్నారన్న అనుమానాలను నిఘావర్గాలు వెల్లడించడంతో అప్రమత్తమైంది. ఇకపై నౌకల్లో, సబ్‌మెరైన్లలో ఉన్నప్పుడు ఏ ఒక్క అధికారిగానీ, కెపె్టన్, సెయిలర్స్.. ఏ స్థాయి ఉద్యోగి కూడా స్మార్ట్ ఫోన్ వినియోగించరాదని ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా వాట్సప్, ట్విటర్, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగాం, టెలిగ్రామ్, టిక్‌టాక్, హైక్ మొదలైన సోషల్ మీడియా యాప్స్‌ని పూర్తిగా నౌకల్లో నిషేధిస్తున్నట్లు ఆదేశించింది. ఈ ఆదేశాలు కఠినంగా అమలు చెయ్యాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు.
విశాఖకు ఎన్‌ఐఏ బృందాలు
మరోవైపు ఇప్పటికే అరెస్టైన ఏడుగురు సెయిలర్స్ నుంచి నిజాలు రాబట్టేందుకు ఎన్‌ఐఏ బృందం ప్రయతి్నస్తోంది. అరెస్టైన సెయిలర్స్ సన్నీకుమార్, ఎస్.కుమార్‌శర్మ, ఎస్.దాస్, అకుమా, అశోక్‌కుమార్, వి.కుమార్, సోమనాథ్‌కు విజయవాడ ఎన్‌ఐఎ కోర్టు జనవరి 3 వరకూ రిమాండ్ విధించింది. వీరిచ్చిన సమాచారం మేరకు తూర్పు నౌకాదళంలో విచారణకు ఎన్‌ఐఎ బృందం రెండు మూడు రోజుల్లో రానుంది. 2018 అక్టోబర్ నుంచి పాకిస్థాన్‌కు ఈ సెయిలర్స్ సమచారం అందించడం ప్రారంభించారు. ముఖ్యంగా యుద్ధనౌకలు, సబ్‌మెరైన్‌ల కదలికలపై సమాచారం ఎప్పటికప్పుడు చేరవేశారు.
ఏ యుద్ధ నౌక ఎక్కడ ఉంది..? వివిధ జలాంతర్గాముల ప్రస్తుత స్థితి ఏమిటి.. ఇలా కీలకమైన సమాచారం చేరవేశారు. అయితే ఏయే నౌకలు, సబ్‌మెరైన్ల సమాచారం అందించారు., ఏయే సమయాల్లో అందించారు.. ఆ సమయంలో ఆయా నౌకలు, జలాంతర్గాములు ఎక్కడ ఉన్నాయి.. ఏ ఆపరేష న్‌లో ఉన్నాయి.. సెయిలర్స్ ఇచ్చిన సమాచారం వల్ల నౌకాదళానికి, దేశ భద్రతకు ఏ మేరకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది.. ఇలా పూర్తి సమాచారాన్ని సేకరించే దిశగా ఎన్‌ఐఏ బృందం ప్రయతి్నంచనుంది. ఈ విచారణకు సంబంధించి ఇప్పటికే తూర్పు నౌకాదళానికి సమాచారం ఇచ్చినట్లు నిఘా వర్గాల విశ్వసనీయ సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment