ఇద్దరే పాత్రధారులు.. కానీ ప్రజల మధ్య కదలాడే ఎన్నో పాత్రలను పోషించారు. యోగి, జోగి వేరు వేరు వ్యక్తులు కారు.. ఒకే మనసుకు రెండు వైపులా ఉన్న బొమ్మ, బొరుసులు. మానసిక సంఘర్షణను, తర్క వితర్కాలను, ఆవేశాలను ఆలోచనలను ప్రేక్షకుల ముందుంచి వారి హృదయాల్లో అగ్గి రాజేశారు
విశాఖపట్నం-కల్చరల్: ప్రఖ్యాత రచయిత, సినీ నటు డు తనికెళ్ల భరణి తొలినాళ్లలో రాసిన వీధి నాటకం.. కొక్కొరొకో. మొద్దు నిద్రలో జోగుతున్న ప్రజానీకాన్ని మేల్కొలిపే చైతన్యనాదమది. కళాభారతి ఆడిటోరియం లో శుక్రవారం రాత్రి ఎస్.ఎం.బాషా దర్శకత్వంలో ఈ నాటికను ప్రదర్శించారు. రంగసాయి నాలుగో వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్‌కు చెందిన మిత్రా క్రియేషన్స్ అందించిన ఈ ప్రదర్శన ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది.
చదివిన చదువు నిరుపయోగం కాగా దేశంలోని మేధావితనం గొడ్డుపోతోంది. ప్రభుత్వం దేశంలోని వనరులను, మేధావులను ఉపయోగించుకోవడం లేదు. అందుకే వారు వలసపోతున్నారు. కొందరు కడుపు నిండక నిరాశావాదం వైపు, కడుపు మండాక అరాచకం వైపు పయనిస్తున్నారు. మేధస్సు అణుశక్తి కన్నా గొప్పది. అది తుప్పుపట్టిపోతోంది.. అంటూ జాగృతం చేసే ఇతివృత్తంతో ప్రదర్శించిన నాటిక ప్రేక్షక హృదయాలను కదిలించింది.
మొద్దు నిద్దుర నుండి జాగృతం వైపునకు నడిపించే ప్రభాత గీతం అంటూ సాగిన పాత్రధారుల మాటలు సభికుల మనస్సులను కదలించాయి. మేధావులకు, దగాపడిన తమ్ముళ్లకు జరుగుతున్న అన్యాయాలను పూసగుచ్చినట్టు వివరించి అందుకు బాధ్యులైన వారిపై తిరుగబాటుకు అప్రమత్తం కావాలని రచయిత తనికెళ్ల భరణి ఈ నాటిక ద్వారా సమాజానికి సూచించారు. ఈ నాటికలో యోగి పాత్రను సురభి సంతోష్, జోగి పాత్రను రాఘవేంద్రరావు అద్భుతంగా పోషించారు.
తనికెళ్లకు ఆత్మీయ సత్కారం
రంగసాయి నాటక సమాజం నాలుగో వార్షికోత్సవం సందర్భంగా తనికెళ్ల భరణిని బాదంగీర్ సాయి, మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్, ఎస్.విజయకుమార్, సినీ నటి పూర్ణిమలు ఆత్మీయంగా సత్కరించారు. తొలుత నట శిక్షకుడు సత్యానంద్ భరణిని దుశ్శాలువాతో కప్పి పుష్పమాలను అలంకరించారు. కార్యక్రమంలో సినీ నటుడు గొల్లపూడి మారుతీరావు, మొక్కల మోహన్, విశాఖ నాటక పరిషత్ గౌరవ అధ్యక్షుడు పి.ఎస్.నాయుడు, పాత్రికేయుడు వి.వి.రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు.
మేల్కొలిపే చైతన్య నాదం.. కొక్కొరొకో
Published Sat, Aug 2 2014 2:38 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM
Advertisement
Advertisement