భీమిలి తీరంలో లాలస కోసం వెదికా.. | undivided relationship with vishka beach, says Tanikella Bharani | Sakshi
Sakshi News home page

భీమిలి తీరంలో లాలస కోసం వెదికా..

Published Mon, Aug 18 2014 8:30 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

భీమిలి తీరంలో లాలస కోసం వెదికా.. - Sakshi

భీమిలి తీరంలో లాలస కోసం వెదికా..

విశాఖపట్నం: భక్తికి, అనురక్తికి  పెద్దగా లేదంటున్నారు ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు తనికెళ్ల భరణి. ప్రపంచంలో ప్రేమించని హృదయం లేదంటూ... కురుపాం టూంబ్ ను మరో తాజ్ మహల్ గా వర్ణించారు. ‘న్యూస్‌లైన్’ఇంటర్వ్యూలో తనికెళ్ల భరణి కలబోసుకున్న ఊసులు మీకోసం...
 
ప్రణయ గీతికలను ప్యాసాగా రాయడానికి గల కారణం?
భారతీయ తత్వచింతనలో ప్రణయం ఒక భాగం. భక్తికి ప్రేమకు పెద్దగా తేడా లేదు. ప్రేమ అనేది యూనివర్శల్. వ్యక్తం చేసే విధానంలో తేడా ఉన్నా భావజాలం ఒకటే. శ్రీశ్రీ తరువాత కవిత్వంలో ప్రేమ అనే దానికి స్థానం లేదు, ఒక్క సినిమాలో తప్ప. కవిత్వంలో ప్రేమ నశించినా.. జీవితంలో ప్రేమ లేకుండా ఉందా.. అంటే ఉందనే చెప్పాలి. ప్యాసా అంటే దాహం. ప్రేమ పిపాసి మధురానుభావాలను పేపర్ మీద పెడితే ఎలాఉంటుందో చెప్పే ప్రయత్నమే ప్యాసా..
 
ప్యాసాలో ‘బాల్యమున నీ పేరు జపించినాను..’ అనే వాక్యం ఉంది. అలాంటి అనుభవం మీ జీవితంలో...?
ఆ అనుభవాలు ప్రతి వ్యక్తికీ ఉన్నట్లే నా జీవితంలోనూ ఉన్నాయి. అలాంటి అనుభూతులను ఈ వయస్సులో చెప్పడం కరెక్టు కాదు కదా (నవ్వుతూ)...
 
విశాఖతో మీ జ్ఞాపకాలు...
ఈ నగరంతో నాకు విడదీయలేని అనుబంధం ఉంది. సముద్రం సినిమా సమయంలో విశాఖలో ఎక్కువ రోజులు షూటింగ్ జరిగింది. మీరు తప్పుగా అనుకోనంటే నాకు రెండో ఇల్లులాంటిది విశాఖ (నవ్వుతూ). మొదటిసారి అనుకుంటా 25 సంవత్సరాల వయస్సులో విశాఖ వచ్చాను, ఆ తరువాత ఓసారి విశాఖ మీదుగా అరకు వెళ్లాను. ఆ తరువాత రెగ్యులర్‌గా వస్తునే ఉన్నాను. మిథునం సినిమా ప్రొడ్యూసర్ విశాఖవాసి కావడంతో ఆ షూటింగ్ శ్రీకాకుళంలో జరిగినా విశాఖలోనే ఎక్కువ రోజులు ఉన్నాను.
 
భక్తిని, ప్యాసాతో రక్తిని మీ రచనల్లో చూపించారు. విరక్తిని కూడా కలిగిస్తారా?
దేని కోసమైనా వెయిట్ చేసేటపుడు భక్తి పుడుతుంది. దేనిపైన అయినా గాఢంగా ఇష్టం పెంచుకుంటే రక్తి కలుగుతుంది. జీవితంలో కోరుకున్నది దక్కదనిపిస్తే విరక్తి పుడుతుంది. విరక్తి నుంచి కవిత్వం పుట్టే అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రస్తుతం విరక్తి అనే దానికి నేను విముఖుడిని.  కానీ భవిష్యత్తులో కలిగే అవకాశం ఉందేమో ఇప్పుడే చెప్పలేను.
 
విశాఖ తీరంలో మీ జర్నీ స్టార్ట్ చేసి ఎక్కడ ఆపాలనుకుంటారు?
తీరంలో నా జర్నీ ప్రారంభిస్తే మళ్లీ తీరంలోనే ముగిస్తాను. ఎందుకంటే సముద్రం నిరంతర చైతన్యం. మన జీవితంలో ఏ విషయం అయినా బోర్ కొట్టొచ్చు, కానీ సముద్రం వైపు చూస్తుంటే ఎప్పుడూ కొత్తగానే కనిపిస్తుంది. ఏదో ఒక విషయం నేర్పుతూనే ఉంటుంది. అందుకే తీరంలో స్టార్ట్ అయిన ప్రయాణం తీరంలోనే ముగుస్తుంది. సముద్రాన్ని చూస్తే బోర్‌కే బోర్ కొడుతుంది.
 
మీకు ఇండస్ట్రీలో ఆడు మగాడ్రా బుజ్జీ అనిపించిన వ్యక్తి ఎవరు?
నాకు అలా అనిపించిన వ్యక్తి మా గురువు రాళ్లపల్లి... ఆయన నాకు లైఫ్ ఇచ్చారు. అతనే నాతో ‘ఆడు మగాడ్రా బుజ్జీ’ అనిపించుకోగలిగే వ్యక్తి..
 
వైజాగ్ నుంచి మీరు తీసుకెళ్లాలనుకుంటే.. దేన్ని తీసుకెళతారు?
నేను తీసుకెళ్లాలనుకునేది సముద్రం.. నాకు నచ్చేది, నేను మెచ్చేది కూడా అదే.. దాని తర్వాత నన్ను బాగా ఇన్‌స్పై ర్ చేసిన స్పాట్ మాత్రం కురుపాం టూంబ్.. ఎప్పుడో ఒకసారి చరిత్ర చదివి దాని గురించి తెలుసుకున్నాను. 20 ఏళ్ల క్రితం చూశాను. కురుపాం రాజు తన భార్య లక్ష్మీ నర్సాయ్యమ్మ స్మృతి చిహ్నంగా ఆ సమాధి నిర్మించాడని విన్నాం. దాని మీద ఆంగ్లంలో ఒక వాక్యం ఉంది. ‘ఇక్కడ నీ శరీరంతోపాటు నా మనస్సు కూడా సమాధి చేయబడింది’. ఈ ఒక్క వాక్యంతో దానికి తాజ్‌మహలంత విలువ వచ్చింది. లేకపోతే అది ఒక సమాధిగా మిగిలిపోయేది.
 
సముద్రం మూవీ సమయంలో భీమిలి బీచ్ చూడటానికి ప్రత్యేకంగా వెళ్లానని చెప్పారు. ఎందుకు?
యుక్త వయస్సులో చలం సాహిత్యం ఎక్కువగా చదివేవాడిని. అలా ఓసారి జీవితాదర్శం అనే నవల చదివి అందులో లాలస పాత్రకు ప్రభావితం అయ్యాను, షూటింగ్ జరుగుతుండగా  ఆ విషయం గుర్తుకొచ్చి... ఒక వ్యక్తిని తీసుకొని భీమిలి బీచ్‌కు వెళ్లి అక్కడున్న లైట్‌హౌస్ దగ్గర నిలబడి అలా చూస్తూ ఉండిపోయాను. విషయం ఏంటో అర్ధం కాక, అసలు ఎందుకు వచ్చానని అడిగాడతను. ‘జీవితాదర్శం నవలలో లాలస ఇక్కడికే వచ్చి స్నానం చేసేదట’ అని చెప్పాను. దానికి అతను నన్ను విచిత్రంగా చూడటంతోపాటు, ఇలా కూడా ఉంటారా సార్ అని అడిగాడు (నవ్వుతూ).

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement