కర్నూలు
(అగ్రికల్చర్): షరతుల్లేని రుణమాఫీ చేయాలనే డిమాండ్‌తో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ బుధవారం జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేప ట్టేందుకు పిలుపునిచ్చింది. రుణమాఫీ విషయంలో ప్రభుత్వ విధానాన్ని నిరసిస్తూ నగరంలో కార్పొరేషన్ ఎదుట, అన్ని మండల కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు చేపట్టేందుకు పార్టీ నిర్ణయించింది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో అధికా రంలోకి రావడమే ధ్యేయంగా అన్ని రకాల వ్యవసాయ, డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించిన చంద్రబాబు.. అధికారంలోకి రాగానే హామీలకు నీళ్లొదలడం పట్ల సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
రైతు రుణమాఫీకి రోజుకో ప్రకటన.. పూటకో నిబంధన మారుస్తూ అడ్డగోలు కోత విధుస్తుండటంతో రైతులు గుర్రుమంటున్నారు. 2013 డిసెంబర్ చివరి వరకు రుణాలు తీసుకున్న 5.24 లక్షల మంది రైతుల వివరాలను బ్యాంకర్లు ప్రభుత్వానికి నివేదించారు. వీటిని ఆధార్, ఇతరత్రా నిబంధనల పేరిట కోత విధిస్తుండటంతో రుణమాఫీ కొందరికే పరిమితమవుతోంది.
ఈ విషయంలోనూ స్పష్టత లేకపోవడంతో రైతులపై జనవరి 1 నుంచి అక్టోబర్ వరకు రూ.261 కోట్ల వడ్డీ భారం పడుతోంది. ఇక ఎన్నికల ముందు డ్వాక్రా రుణాల మాఫీకి బాబు స్పష్టమైన హామీ ఇచ్చినా.. అధికారంలోకి రాగానే తూట్లు పొడిచారు. రివాల్వింగ్ ఫండ్ కింద సంఘానికి రూ.లక్ష ఇస్తున్నట్లు ప్రకటించి చేతులు దులిపేసుకున్నారు. ఈ మొత్తం ఎప్పటికి విడుదలవుతుందో కూడా తెలియని పరిస్థితి.
రైతులు, డ్వాక్రా మహిళల నమ్మకాన్ని వమ్ము చేసిన ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు బుధవారం వైఎస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఆందోళనలను విజయవంతం చేయాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్‌రెడ్డి పిలుపునిచ్చారు. అదేవిధంగా కర్నూలులో నగరపాలక సంస్థ ఎదుట చేపట్టనున్న ఆందోళనకు రైతులు, డ్వాక్రా మహిళలు పెద్ద ఎత్తున తరలిరావాలని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి కోరారు.
రండి.. ప్రభుత్వాన్ని నిలదీద్దాం
Published Wed, Nov 5 2014 3:26 AM | Last Updated on Sat, Sep 29 2018 6:00 PM
Advertisement