మంగళవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రులు, అధికారులు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం రైతులకు, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇప్పిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఆయన అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో 207వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రైతుల తరఫున కట్టాల్సిన వడ్డీ డబ్బుల్ని బ్యాంకులకు చెల్లించకపోవడంతో రైతులు, డ్వాక్రా సభ్యులు మరింత అప్పుల ఊబిలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఆ పరిస్థితి ఉండదని స్పష్టం చేశారు. సున్నా వడ్డీ కింద లబ్ధిదారుల తరఫున చెల్లించాల్సిన వడ్డీ డబ్బుల్ని ప్రభుత్వమే చెల్లిస్తుందని బ్యాంకర్లకు భరోసా ఇచ్చారు. రుణాల వసూళ్ల విషయంలో రైతులు, డ్వాక్రా మహిళలను వేధింపులకు గురి చేయొద్దని బ్యాంకర్లకు సూచించారు. గత ఐదేళ్లలో నాలుగేళ్లు కరువు రావడంతో రైతులు పూర్తిగా దెబ్బతిన్నారని, రుణభారంతో కుంగిపోయారని, ఇలాంటి పరిస్థితుల్లో వారిలో మానసిక స్థైర్యాన్ని పెంచకపోతే పరిణామాలు ప్రమాదకరంగా మారతాయన్నారు.
ఈ విషయాన్ని గమనించే వారిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి, నిలదొక్కుకునేలా చూసేందుకు నవరత్నాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. రైతులను ఆదుకోవాలనే ఆలోచనతోనే మే నెలలో రైతు భరోసా కింద ప్రతి రైతు కుటుంబానికి రూ.12,500 నేరుగా ఇవ్వబోతున్నట్లు బ్యాంకర్లకు తెలిపారు. రాష్ట్రంలో ఒక్కో రైతు వద్ద సగటున 1.25 ఎకరాలు మాత్రమే భూమి ఉందని, ఇలాంటి రైతులందరికీ పెట్టుబడి వ్యయంలో దాదాపుగా 70 శాతాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించే ఉద్దేశంతోనే రైతు భరోసాను అమలు చేస్తున్నామన్నారు. రైతులకు ఇస్తున్న ఈ సొమ్మును, ఇంతకుముందు వారికి ఉన్న అప్పులకు జమ చేసే వీలే ఉండకూడదని బ్యాంకర్లకు గట్టిగా చెప్పారు. రైతు భరోసా కింద గానీ, నవరత్నాల్లో భాగంగా అమలు చేయబోతున్న మరే సంక్షేమ పథకాల్లో గానీ లబ్ధిదారులకు ప్రభుత్వం ఇచ్చే నగదును జమ చేసుకోవడానికి వీల్లేని విధంగా ఖాతాలను తెరవాలని స్పష్టం చేశారు.
ప్రతీ పైసా నేరుగా అందాలి
అలాగే రాష్ట్రంలో అక్షరాస్యత కూడా చాలా తక్కువగా ఉందని, జాతీయ స్థాయిలో నిరక్షరాస్యత 26 శాతం ఉంటే మన రాష్ట్రంలో 33 శాతం ఉందన్నారు. ఈ పరిస్థితులు మార్చి ప్రతి ఇంటా చదువుల దీపాలు వెలిగించేందుకే ‘అమ్మ ఒడి’ కింద పిల్లలను బడికి పంపే తల్లులకు ఏడాదికి రూ.15 వేలు ఇస్తున్నామన్నారు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పేదరికాన్ని, సామాజిక వెనుకబాటును దృష్టిలో ఉంచుకుని వారికి కూడా నేరుగా చేతికి డబ్బు అందించే పథకాలను ప్రవేశపెడుతున్నామని తెలిపారు. నవరత్నాల్లోని ఈ పథకాలన్నింటి ద్వారా తాము అందించబోయే ప్రతి పైసా వారికే నేరుగా అందించేలా చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను ఆదేశించారు.
నిజంగా ఈ రుణ మొత్తం ఇస్తున్నారా?
ఎస్‌ఎల్‌బీసీ నివేదికలో ఏటేటా వ్యవసాయ రుణాలు, డ్వాక్రా రుణాలు పెరుగుతున్నట్టు చూపిస్తుండటంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సందేహం వ్యక్తం చేశారు. ఈ డబ్బు అంతా రైతులకు నిజంగా ఇస్తున్నారా? లేదా పాత రుణాలను రీషెడ్యూల్ చేయడం వల్ల పెరుగుతున్నాయా అంటూ బ్యాంకర్లను ప్రశ్నించారు. కొత్త అప్పులు ఇవ్వకుండా పాత అప్పులనే వడ్డీలతో కలిపి చూపడం వల్ల ఈ అంకెలు పెరుగుతున్నాయని బ్యాంకర్లు అంగీకరించారు. దీనివల్ల రైతులు, డ్వాక్రా మహిళలు ఆర్థికంగా బలపడకుండా మరింత అప్పుల పాలైనట్లు ఎస్‌ఎల్‌బీసీ సమావేశంలో తేలింది. గత ప్రభుత్వం సున్నా వడ్డీ కోసం చెల్లించాల్సిన తన వాటాను చెల్లించిందా అని సీఎం ఆరా తీయగా బ్యాంకర్ల నుంచి లేదన్న సమాధానం వచ్చింది. రైతులకు సున్నా వడ్డీ లభించకపోవడం, రుణమాఫీ రూ.87,612 కోట్లు చేస్తానని చెప్పి చివరకు రూ.15 వేల కోట్లు కూడా చేయకపోవడంతో రైతులు పూర్తిగా అప్పులు పాలైన విషయాన్ని పాదయాత్రలో స్వయంగా చూసినట్లు సీఎం తెలిపారు. రూ.87,612 కోట్ల రుణాల మీద ఏటా రైతులు రూ.7 వేల నుంచి 8 వేల కోట్ల వడ్డీలు కడితే చంద్రబాబు ప్రభుత్వం ఏటా సగటున రూ.3 వేల కోట్లు కూడా రుణమాఫీకి విడుదల చేయలేదని, దీనివల్ల రైతాంగం పూర్తిగా దెబ్బతిందని అన్నారు.
శనగ రైతులకు ప్రభుత్వ అండ
రాయలసీమలో ఎక్కువగా శనగ రైతులు మద్దతు ధర సమస్యను ఎదుర్కొంటున్నారని సీఎం వైఎస్ జగన్ చెప్పారు. చేతికొచ్చిన పంటకు తగు మద్దతు ధర రానప్పుడు కలిగే రుణ భారం నుంచి ఉపశమనం కల్పిస్తామన్నారు. ప్రస్తుతం ధర పడిపోయినందున సరకుపై రైతులకు రుణాలు ఇచ్చిన బ్యాంకులు సరకు వేలంను ఆరు నెలల పాటు వాయిదా వేయాలని బ్యాంకర్లను కోరారు. అప్పటికీ ధర రాకపోతే శనగ రైతులకు క్వింటాల్‌కు రూ.1700 ప్రభుత్వమే చెల్లించే ఆలోచన చేసి ఆదుకుంటుందని ప్రకటించారు. బ్యాంకర్ల సమావేశంలో మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, పిల్లి సుభాష్ చంద్ర బోస్, కన్నబాబు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం, ఎస్‌ఎల్‌బీసీ అధ్యక్షుడు జె.పకీరస్వామి, భారతీయ రిజర్వు బ్యాంకు ప్రాంతీయ డైరెక్టర్ శుభ్రత్ దాస్, నాబార్డ్ చీఫ్ జనరల్ మేనేజర్ ఎస్.శెల్వరాజ్ పాల్గొన్నారు.
2019-20 పంట రుణాల లక్ష్యం.. రూ.1,15,000 కోట్లు
గత ప్రభుత్వం చేసిన వ్యవసాయ రుణాల మాఫీ వాగ్దానం వల్ల రైతులకు లాభం జరగకపోగా వారు మరింతగా అప్పులు పాలయ్యారని స్పష్టమైంది. 2014, మార్చి 31 నాటికి రూ.87,612 కోట్లు ఉన్న వ్యవసాయ రుణాలు 2019, మార్చి 31 నాటికి అంటే ఐదేళ్ల తర్వాత రూ.1,49,264 కోట్లకు పెరిగాయి. అలాగే డ్వాక్రా మహిళల రుణాలు పూర్తిగా మాఫీ చేస్తానని ఒక్క రూపాయి కూడా మాఫీ చేయకపోవడంతో 2014, మార్చి 31న రూ.14,204 కోట్లు ఉంటే, 2019, మార్చి 31న అవి రూ.27,451 కోట్లకు పెరిగాయి. 2018–19లో మొత్తంగా రూ.1,01,564 కోట్లు వ్యవసాయ రుణాలుగా ఇవ్వాలని ఎస్‌ఎల్‌బీసీ నిర్ణయిస్తే రూ.1,06,560 కోట్లు రైతులకు అందించామని, 2019–20లో రూ.1,15,000 కోట్లు వ్యవసాయానికి ఇవ్వాలని సంకల్పిస్తున్నామని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ తన లక్ష్యాన్ని ముఖ్యమంత్రి ముందు ఉంచింది. ఇందులో స్పల్పకాలిక పంట రుణాల కింద రూ.84,000 కోట్లు, టర్మ్ రుణాలు రూ.24,000 కోట్లు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. స్వల్పకాలిక పంట రుణాల లక్ష్యంలో రూ.8,400 కోట్లు కౌలు రైతులకు ఇవ్వాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఇతర రంగాల రుణాలను కూడా కలుపుకుంటే 2019–20 సంవత్సరానికి మొత్తం రూ.2,29,200 కోట్ల రుణాలను ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment