ఆన్‌లైన్‌లో నిమ్స్ సేవలు!
సాక్షి, హైదరాబాద్: మందులు, వ్యాధి నిర్ధారణ పరికరాల కొనుగోళ్లతోపాటు రోగులకు అందుతున్న వైద్యసేవలపై వస్తున్న ఆరోపణలకు శాశ్వతంగా చెక్‌పెట్టాలని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్ (నిమ్స్) నిర్ణయించింది. అవుట్‌పేషెంట్ల వివరాలతోపాటు ఇన్‌పేషెంట్ల వివరాలు, వారికి అందిస్తున్న సేవలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలు... వాటి ఫలితాలు ఇలా అన్నీ ఆన్‌లైన్‌లో పొందుపర్చనున్నారు. పాలనలో పారదర్శకత కోసం ప్రభు త్వ ఆస్పత్రుల చరిత్రలోనే తొలిసారిగా నిమ్స్ ట్రామా కేర్‌లోని ఐదో అంతస్తులో రూ.13 కోట్లతో ఏర్పాటు చేసిన ‘హాస్పిటల్ ఇన్‌ఫర్మేషన్ సిస్టమ్’ను వైద్య ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీలు అజయ్ సహాని, ఎల్వీ సుబ్రమణ్యం ఆదివారం ప్రారంభించారు. ఈ సాంకేతిక సేవలు మరో ఆరు మాసాల్లో అందుబాటులోకి రానున్నాయి. త్వరలోనే ఈ విధానాన్ని అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అమలుపరుస్తామని అజయ్‌సహాని, ఎల్వీ సుబ్రమణ్యం తెలిపారు. కార్యక్రమంలో నిమ్స్ డెరైక్టర్ డాక్టర్ నరేంద్రనాథ్, శరత్, గోపీనాథ్, హరినాథ్‌బాబు, శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ విధానం వివరాలు...
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థైన ‘సిడాక్’ పర్యవేక్షణలో దీన్ని రూపొందిస్తుండగా, ఇందుకయ్యే ఖర్చంతా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది.
రోగి ఆస్పత్రిలో చేరినప్పటి నుంచి అతనికి చేసిన పరీక్షలు, ఇచ్చిన మందులు, అందించిన సేవలు, ఖర్చు వగైరా వివరాలన్నీ ఎప్పటికప్పుడు ఆన్‌లైన్‌లో పొందుపరుస్తారు.
సీనియర్ వైద్యులు తమ వద్ద ఉన్న కంప్యూటర్‌లో రోగనిర్ధారణ రిపోర్టులు చూసి, రోగికి అందించాల్సిన సేవలపై తమ మొబైల్‌ఫోన్ ద్వారా జూనియర్ ైవె ద్యులకు సూచించే అవకాశం అందుబాటులోకి రానుంది.
సుదూర ప్రాంతంలో ఉన్న వ్యక్తులు కూడా నిమ్స్‌లో చికిత్సపొందుతున్న తమవారికి ఎలాంటి వైద్యసేవలు అందుతున్నాయో అక్కడి నుండే తెలుసుకునే అవకాశం ఉంది.
ఆసుపత్రిలో పనిచేస్తున్న ఉద్యోగుల సమాచారం, ఎక్కడెక్కడ ఏ ఉద్యోగి పనిచేస్తున్నాడనే అంశాలను కూడా తెలుసుకోవచ్చు.