పుట్టపర్తి: అనంతపురం జిల్లా పుట్టపర్తి మండలం పెద్దకమ్మవారిపల్లికి చెందిన తెలుగు యువత నాయకుడు సుభచంద్రపై పోలీసులు బుధవారం నిర్భయ కేసు నమోదు చేశారు. మండలం కర్ణాటక నాగేపల్లికి చెందిన సాయమ్మ అనే మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పుట్టపర్తి రూరల్ ఎస్సై రాఘవరెడ్డి వెల్లడించారు. సుభచంద్రకు... శ్రీనివాసులు, సాయమ్మ దంపతుల మధ్య గ్రామంలోని సాయి ప్రశాంతి పాఠశాల విషయంలో లావాదేవీలున్నాయి. దీంతో సుభచంద్ర తరచూ సాయమ్మ ఇంటికి వెళ్లేవాడు.
అలాగే మంగళవారం మధ్య కూడా వెళ్లాడు. ఆ సమయంలో సాయమ్మ ఒంటరిగా ఇంట్లో ఉంది. దీంతో ఆమెపై లైంగికదాడికి యత్నించేందుకు... బెదిరించాడు. దాంతో ఆమె తిరగబడింది. కొట్టేందుకు కట్టె తీసుకుంది. అతడు పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. సుభచంద్ర పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. కాగా సుభచంద్ర ఇటీవలే సీఎం చంద్రబాబు కుమారుడు లోకేష్ను కలిసి తనకు పుట్టపర్తి అర్బన్ డెవలప్మెంట్ అథారటీ (పుడా) చైర్మన్ పదవి ఇవ్వాలని కోరినట్లు సమాచారం.