నరసాపురం కోడలి నజరానా | Nirmala Sitharaman adopts two villages in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

నరసాపురం కోడలి నజరానా

Published Sat, Nov 8 2014 1:27 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

నరసాపురం కోడలి నజరానా - Sakshi

నరసాపురం కోడలి నజరానా

* రెండు తీర గ్రామాలను దత్తత తీసుకున్న కేంద్ర మంత్రి
* పెదమైనివానిలంక, తూర్పుతాళ్లు
* గ్రామాల్ని అభివృద్ధి చేస్తానన్న నిర్మలా సీతారామన్

 
నరసాపురం అర్బన్ : నరసాపురం మండలంలోని రెండు తీర గ్రామాలను దత్తత తీసుకుంటున్నట్టు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన నరసాపురం ప్రాంత వాసులకు ఆనందం పంచింది. సముద్రాన్ని ఆనుకుని ఉన్న పెదమైనవానిలంక, తూర్పుతాళ్లు గ్రామాలను దత్తత తీసుకుని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని విజయవాడలో శుక్రవారం జరిగిన ఏబీవీపీ రాష్ట్రస్థాయి విద్యార్థినుల సమ్మేళనంలో నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు.

ఈనెల 15, 16, 17 తేదీల్లో తాను ఆ గ్రామాల్లో పర్యటించి అక్కడి సమస్యలు తెలుసుకుంటానని, అనంతరం దత్తతకు సంబంధించిన విధి విధానాలు, చేపట్టబోయే అభివృద్ధి పనులపై స్పష్టత ఇస్తానని మంత్రి పేర్కొన్నారు. నిర్మలాసీతారామన్ నరసాపురం కోడలు. కేబినెట్ హోదాలో రాష్ట్ర ప్రభుత్వ మీడియా సల హాదారుగా పనిస్తున్న డాక్టర్ పరకాల ప్రభాకర్ భార్య. పట్టణానికి చెందిన ప్రభాకర్ తండ్రి దివంగత శేషావతారం కాంగ్రెస్ హయూంలో రాష్ట్ర మంత్రిగా వ్యవహరించారు.

జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. ప్రస్తుతం తమిళనాడు నుంచి రాజ్యసభకు నిర్మలాీ సతారామన్ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, ఒక విధంగా తన మెట్టింటి గడ్డపై గల మమకారంతోనే గ్రామాల దత్తతనిర్ణయం తీసుకున్నారని బీజేపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోదీకి సన్నిహితురాలిగా పేరున్న నిర్మలా సీతారామన్ కేంద్రంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిధులు భారీగా వచ్చి తీరగ్రామాలు అభివృద్ధి చెందుతాయని, దీర్ఘకాలిక సమస్యలకు మోక్షం కలుగుతుందని ఈ ప్రాంత ప్రజలు ఆశిస్తున్నారు.

ఆ గ్రామాల్లో ఎన్నో సమస్యలు
మంత్రి దత్తత తీసుకుంటున్నట్టుగా ప్రకటించిన గ్రామాల్లో ఎన్నో సమస్యలు తిష్టవేసుకుని ఉన్నాయి. అవకాశాలు ఉన్నా.. అభివృద్ధి లేక రైతులు, ముఖ్యంగా మత్స్యకారులు అవస్థలు పడుతున్నారు. సరైన రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రక్షణ ఏర్పాట్లు లేకపోవడంతో ప్రకృతి విపత్తుల బారినపడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

ముఖ్యంగా పెదమైనవానిలంక గ్రామం సముద్ర కోతకు గురవుతోంది. గడచిన పదేళ్లలో సముద్రం కిలోమీటరు వరకూ ముందుకు చొచ్చుకొచ్చింది. ప్రజలు చూస్తుండగానే పాత ఊరు సముద్ర గర్భంలో కలసిపోయింది. సముద్ర కోతను నివారించడానికి తీరం వెంబడి రక్షణ చర్యలు చేపడతామన్న నేతల హామీలు నెరవేరలేదు. ఈ గ్రామానికి వెళ్లాలంటే తూర్పుతాళ్లు నుంచి వెళ్లే దారిలో 70 తూముపై నిర్మించిన మట్టిరోడ్డే ఇప్పటికీ గతి.

ఇది కూడా శిథిలమవుతోంది. గ్రామంలో 3 వేల జనాభా ఉండగా, అందరూ మత్స్యకారులే. వేటే ఆధారంగా జీవిస్తున్నారు. ఇక తూర్పుతాళ్లు గ్రామానిదీ అదే పరిస్థితి. ఈ గ్రామంలో ఉప్పు, కాయకూరల సాగు ఎక్కువ. దాదాపు 3 వేల ఎకరాల్లో ఉప్పు పంట సాగవుతోంది. ఉప్పు సాగు చేసేవారంతా మత్స్యకారులే. భూములు లీజుకు తీసుకుని ఉప్పు పండిస్తారు. ఉప్పును నిల్వ చేసుకోవడానికి గిడ్డంగులు, ఇతర సదుపాయాలు లేవు. అందువల్ల వర్షాలు పడతే పండించిన ఉప్పంతా కళ్లముందే కరిగిపోతుంది. సాగు నిమిత్తం చేసిన అప్పులు తీర్చలేక విలవిల్లాడుతుంటారు.
 
రవాణా సౌకర్యాలు లేక ప్రమాదాలు
ఈ గ్రామాల్లో సరైన రవాణా సౌకర్యాలు లేవు. ఇప్పటికీ పడవలపై, తెప్పలపై ప్రయాణాలు సాగుతాయి. తరచూ జరుగుతున్న ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. 2010 జనవరి 31న బియ్యపుతిప్ప గ్రామంలో నల్లీక్రీక్ వద్ద పడవబోల్తా పడి 11మంది ప్రాణాలు కోల్పోయారు. 1984లో బియ్యపుతిప్ప రేవుకు దగ్గరలోనే ఉన్న గుడిమూల రేవులో మర్రితిప్ప గ్రామానికి చెందిన పెళ్లిబృందం అంతర్వేదికి పడవ కట్టించుకుని వెళ్తుండగా.. బోల్తాపడి 18మంది మృతి చెందారు.

ఇక ప్రకృతి విపత్తుల సంగతి సరేసరి. 2004 డిసెంబర్ 26న సునామీ ప్రళయానికి పెదమైనవానిలంక, చినమైనవానిలంక, సర్దుకొడప గ్రామాలకు చెందిన 8 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది నిరాశ్రయులయ్యారు. కేంద్ర మంత్రి ఈ గ్రామాలను దత్తత తీసుకోవడం ద్వారా అయినా తీర గ్రామాల్లో తిష్టవేసిన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందో లేదో చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement