narsapur mandal
-
పాస్‌బుక్ కోసం... సెల్ టవర్ ఎక్కిన యువకుడు
సాక్షి, మెదక్ : అధికారుల అలసత్వంపై నిరసన తెలుపుతూ ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. ఈ ఘటనతో జిల్లాలోని నర్సాపూర్‌లో బుధవారం కలకలం రేగింది. రేషన్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం లేకపోవడంతో రైతుబంధు పథకం రాలేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తన సమస్యల్ని అనేకమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని యువకుడు ఆరోపించాడు. సమస్య పరిష్కారం కాకపోతే తనకు చావే శరణ్యమని అంటున్నాడు. యువకుడిని మండలంలోని ఆత్మకూరు తండాకు చెందిన రవిగా గుర్తించారు. కాగా, సమస్యలు పరిష్కరిస్తామని నర్సాపూర్ ఎస్సై వెంకటరాజు గౌడ్ హామి ఇచ్చినప్పటికీ యువకుడు కిందకి దిగి రావడానికి ససేమిరా ఒప్పుకోవడం లేదని సమాచారం. -
యువ వ్యవసాయాధికారుల దుర్మరణం
సాక్షి, భైంసా/భైంసారూరల్: చిన్న వయస్సులో ఏఈవో ఉద్యోగాలు వచ్చిన ఆ కుటుంబాల్లో రోడ్డు ప్రమాదం తీరని వేదన మిగిల్చింది. నర్సాపూర్ మండలంలో పనిచేస్తున్న ఇద్దరు యువ ఏఈ వోలు ఆదివారం సెలవు దినం కావడంతో భైంసా మండలంలోని పేండ్‌పెల్లి గ్రామంలో వింధుకు హాజరయ్యారు. విందు ముగించుకుని సాయం త్రం 6.30 గంటలకు ద్విచక్రవాహనంపై తిరుగు పయనమయ్యారు. టోల్‌ప్లాజాకు 200 మీటర్ల దూరంలోకి రాగానే ఇసుకలోడ్‌తో వెళ్తున్న ట్రాక్టర్ ట్రాలీని వెనుకవైపు నుంచి ఢీ కొట్టారు. ఘటనలో బండి నడుపుతున్న విక్రమ్ తలకు తీవ్రగాయంకాగా అక్షయ్‌కుమార్ రెండుకాళ్లు విరిగాయి. క్షతగాత్రులను ఆటో ట్రాలీలో భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. మెరుగైన వైద్యంకోసం అంబులెన్సులో నిజామాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో విక్రమ్(25)మృతి చెందాడు. నిజామాబాద్ ఆసుపత్రిలో అక్షయ్‌కుమార్(25) చికిత్స పొందుతుండగానే పరిస్థితి విషమించి మృతి చెందాడు. విషయం తెలుసుకున్న జిల్లా వ్యవసాయ అధికారి అమరేశ్‌కుమార్, మార్క్‌ఫెడ్ డీఎం కోటేశ్వర్రావు, ఏడీఏఅంజిప్రసాద్, ఏఓలు రాంచందర్‌నాయక్, సోమలింగారెడ్డి, టీఎన్జీఓస్ భైంసా ప్రధాన కార్యదర్శి నాగుల శ్రీహరి, జిల్లాలో పనిచేసే ఏఈఓలు అక్కడికి చేరుకున్నారు. ఆసుపత్రికి వచ్చిన కలెక్టర్... విషయం తెలుసుకున్న నిర్మల్ జిల్లా కలెక్టర్ ప్రశాంతి భైంసా ఏరియా ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రిలో మృతదేహాలను చూసి కుటుంబీకులను ఓదార్చారు. మృతుల కుటుంబాలకు రూ.5వేల చొప్పున ఆర్థికసాయం అందించారు. ప్రభుత్వం తరుపున ఆదుకుంటాం ముథోల్ ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ఉదయం 7గంటలకే భైంసా ఏరియా ఆసుపత్రికి చేరుకుని మృతుల కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం ఆదుకునేలా చర్యలు తీసుకుంటానన్నారు. దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో ఏఈవోలు మృతిచెందిన సంఘటన తనను కలిచివేస్తుందన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి అమరేశ్‌కుమార్ బాధిత కుటుంబీకులకు రూ. 10వేల చొప్పున ఆర్థికసాయం అందించారు. మృతుల కుటుంబ సభ్యులతో మాట్లాడుత్ను ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి ఒకే మండలంలో పనిచేసి... 2017 జనవరి 30న విక్రమ్, అక్షయ్‌కుమార్‌లు ఏఈఓలుగా ఉద్యోగంలో చేరారు. విక్రమ్ నర్సాపూర్ మండలం చాక్పెల్లి సెక్టార్లో, కునింటి అక్షయ్‌కుమార్ అదే మండలం రాంపూర్ సెక్టార్లో ఏఈఓగా విధులు నిర్వహిస్తుండేవారు. ఇద్దరు ఏఈఓలు మృతిచెందిన విషయం తెలుసుకున్న నర్సాపూర్ రైతులు తీవ్ర ఆవేదన చెందారు. ఇంటికి పెద్దకొడుకు అక్షయ్ కుభీర్ మండలం హల్దా గ్రామానికి చెందిన కునింటి హన్మండ్లు గంగాబాయి దంపతులకు ముగ్గురు సంతానం. వ్యవసాయం చేస్తూ ముగ్గుర్ని చదివించారు. పెద్దవాడైన అక్షయ్‌కుమార్ ఏఈఓగా ఉద్యోగం సాధించడంతో కష్టాలు కొంతమేర గట్టెక్కాయి. రెండవ కుమారుడు అజయ్‌కుమార్, మూడవ కుమారుడు విజయ్‌కుమార్ డిగ్రీ చదువుతున్నారు. వయస్సు పైబడ్డ తల్లిదండ్రులకు చేదోడుగా ఉంటాడనుకున్న పెద్ద కొడుకు ఇప్పుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. తమ ఆవేదన ఎవరికి చెప్పాలో తెలియక మృతుని సోదరులిద్దరు గుండెలు బాదుకుంటూ రోధించిన తీరు అందరిని కలిచివేసింది. భైంసా ఏరియా ఆసుపత్రి నుంచి మృతదేహాన్ని కుభీర్ మండలం హల్దా గ్రామానికి తరలించారు. ఇంటికి పెద్దదిక్కే విక్రమ్ మామడ మండలం గాయక్పెల్లికి చెందిన బలి రాం కళాబాయి దంపతులకు ఐదుగురు సంతానం. అందులో ముగ్గురు ఆడపిల్లలు కాగా ఇద్దరికి వివాహం జరిపించారు. ఇదే సమయంలో విక్రమ్‌కు ఏఈఓగా ఉద్యోగం వచ్చింది. నర్సాపూర్ మండలంలో ఏఈఓగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గతేడాది తల్లి కళాబాయి సైతం అనారోగ్యంతో మృతి చెందింది. కుటుంబానికి అన్నీతానై నడుపుతున్న ఏఈఓ విక్రమ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలియ గానే వారంతా నివ్వెరపోయారు. వారి బంధువులు భైంసా ఏరియా ఆసుపత్రికి వచ్చి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువెళ్లారు. -
నరసాపురం కోడలి నజరానా
* రెండు తీర గ్రామాలను దత్తత తీసుకున్న కేంద్ర మంత్రి * పెదమైనివానిలంక, తూర్పుతాళ్లు * గ్రామాల్ని అభివృద్ధి చేస్తానన్న నిర్మలా సీతారామన్ నరసాపురం అర్బన్ : నరసాపురం మండలంలోని రెండు తీర గ్రామాలను దత్తత తీసుకుంటున్నట్టు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన ప్రకటన నరసాపురం ప్రాంత వాసులకు ఆనందం పంచింది. సముద్రాన్ని ఆనుకుని ఉన్న పెదమైనవానిలంక, తూర్పుతాళ్లు గ్రామాలను దత్తత తీసుకుని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని విజయవాడలో శుక్రవారం జరిగిన ఏబీవీపీ రాష్ట్రస్థాయి విద్యార్థినుల సమ్మేళనంలో నిర్మలా సీతారామన్ ప్రకటన చేశారు. ఈనెల 15, 16, 17 తేదీల్లో తాను ఆ గ్రామాల్లో పర్యటించి అక్కడి సమస్యలు తెలుసుకుంటానని, అనంతరం దత్తతకు సంబంధించిన విధి విధానాలు, చేపట్టబోయే అభివృద్ధి పనులపై స్పష్టత ఇస్తానని మంత్రి పేర్కొన్నారు. నిర్మలాసీతారామన్ నరసాపురం కోడలు. కేబినెట్ హోదాలో రాష్ట్ర ప్రభుత్వ మీడియా సల హాదారుగా పనిస్తున్న డాక్టర్ పరకాల ప్రభాకర్ భార్య. పట్టణానికి చెందిన ప్రభాకర్ తండ్రి దివంగత శేషావతారం కాంగ్రెస్ హయూంలో రాష్ట్ర మంత్రిగా వ్యవహరించారు. జిల్లా రాజకీయాల్లో చక్రం తిప్పారు. ప్రస్తుతం తమిళనాడు నుంచి రాజ్యసభకు నిర్మలాీ సతారామన్ ప్రాతినిధ్యం వహిస్తున్నప్పటికీ, ఒక విధంగా తన మెట్టింటి గడ్డపై గల మమకారంతోనే గ్రామాల దత్తతనిర్ణయం తీసుకున్నారని బీజేపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నాయి. ప్రధాని నరేంద్రమోదీకి సన్నిహితురాలిగా పేరున్న నిర్మలా సీతారామన్ కేంద్రంలో కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిధులు భారీగా వచ్చి తీరగ్రామాలు అభివృద్ధి చెందుతాయని, దీర్ఘకాలిక సమస్యలకు మోక్షం కలుగుతుందని ఈ ప్రాంత ప్రజలు ఆశిస్తున్నారు. ఆ గ్రామాల్లో ఎన్నో సమస్యలు మంత్రి దత్తత తీసుకుంటున్నట్టుగా ప్రకటించిన గ్రామాల్లో ఎన్నో సమస్యలు తిష్టవేసుకుని ఉన్నాయి. అవకాశాలు ఉన్నా.. అభివృద్ధి లేక రైతులు, ముఖ్యంగా మత్స్యకారులు అవస్థలు పడుతున్నారు. సరైన రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రక్షణ ఏర్పాట్లు లేకపోవడంతో ప్రకృతి విపత్తుల బారినపడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ముఖ్యంగా పెదమైనవానిలంక గ్రామం సముద్ర కోతకు గురవుతోంది. గడచిన పదేళ్లలో సముద్రం కిలోమీటరు వరకూ ముందుకు చొచ్చుకొచ్చింది. ప్రజలు చూస్తుండగానే పాత ఊరు సముద్ర గర్భంలో కలసిపోయింది. సముద్ర కోతను నివారించడానికి తీరం వెంబడి రక్షణ చర్యలు చేపడతామన్న నేతల హామీలు నెరవేరలేదు. ఈ గ్రామానికి వెళ్లాలంటే తూర్పుతాళ్లు నుంచి వెళ్లే దారిలో 70 తూముపై నిర్మించిన మట్టిరోడ్డే ఇప్పటికీ గతి. ఇది కూడా శిథిలమవుతోంది. గ్రామంలో 3 వేల జనాభా ఉండగా, అందరూ మత్స్యకారులే. వేటే ఆధారంగా జీవిస్తున్నారు. ఇక తూర్పుతాళ్లు గ్రామానిదీ అదే పరిస్థితి. ఈ గ్రామంలో ఉప్పు, కాయకూరల సాగు ఎక్కువ. దాదాపు 3 వేల ఎకరాల్లో ఉప్పు పంట సాగవుతోంది. ఉప్పు సాగు చేసేవారంతా మత్స్యకారులే. భూములు లీజుకు తీసుకుని ఉప్పు పండిస్తారు. ఉప్పును నిల్వ చేసుకోవడానికి గిడ్డంగులు, ఇతర సదుపాయాలు లేవు. అందువల్ల వర్షాలు పడతే పండించిన ఉప్పంతా కళ్లముందే కరిగిపోతుంది. సాగు నిమిత్తం చేసిన అప్పులు తీర్చలేక విలవిల్లాడుతుంటారు. రవాణా సౌకర్యాలు లేక ప్రమాదాలు ఈ గ్రామాల్లో సరైన రవాణా సౌకర్యాలు లేవు. ఇప్పటికీ పడవలపై, తెప్పలపై ప్రయాణాలు సాగుతాయి. తరచూ జరుగుతున్న ప్రమాదాల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు. 2010 జనవరి 31న బియ్యపుతిప్ప గ్రామంలో నల్లీక్రీక్ వద్ద పడవబోల్తా పడి 11మంది ప్రాణాలు కోల్పోయారు. 1984లో బియ్యపుతిప్ప రేవుకు దగ్గరలోనే ఉన్న గుడిమూల రేవులో మర్రితిప్ప గ్రామానికి చెందిన పెళ్లిబృందం అంతర్వేదికి పడవ కట్టించుకుని వెళ్తుండగా.. బోల్తాపడి 18మంది మృతి చెందారు. ఇక ప్రకృతి విపత్తుల సంగతి సరేసరి. 2004 డిసెంబర్ 26న సునామీ ప్రళయానికి పెదమైనవానిలంక, చినమైనవానిలంక, సర్దుకొడప గ్రామాలకు చెందిన 8 మంది ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది నిరాశ్రయులయ్యారు. కేంద్ర మంత్రి ఈ గ్రామాలను దత్తత తీసుకోవడం ద్వారా అయినా తీర గ్రామాల్లో తిష్టవేసిన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందో లేదో చూడాలి.