
సాక్షి, మెదక్ : అధికారుల అలసత్వంపై నిరసన తెలుపుతూ ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్‌చల్ చేశాడు. ఈ ఘటనతో జిల్లాలోని నర్సాపూర్‌లో బుధవారం కలకలం రేగింది. రేషన్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం లేకపోవడంతో రైతుబంధు పథకం రాలేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తన సమస్యల్ని అనేకమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని యువకుడు ఆరోపించాడు. సమస్య పరిష్కారం కాకపోతే తనకు చావే శరణ్యమని అంటున్నాడు. యువకుడిని మండలంలోని ఆత్మకూరు తండాకు చెందిన రవిగా గుర్తించారు. కాగా, సమస్యలు పరిష్కరిస్తామని నర్సాపూర్ ఎస్సై వెంకటరాజు గౌడ్ హామి ఇచ్చినప్పటికీ యువకుడు కిందకి దిగి రావడానికి ససేమిరా ఒప్పుకోవడం లేదని సమాచారం.