సాక్షి, నిజామాబాద్ : నాలుగు నెలల వ్యవధిలోనే జిల్లాకు మూడో ఎస్‌పీ రాబోతున్నారు. విక్రమ్ జిత్ దుగ్గల్ తర్వాత జిల్లా ఎస్‌పీగా వచ్చిన కేవీ మోహన్‌రావు ఆదివారం బదిలీ అయ్యారు. ఆయనను హైదరాబాద్‌లోని ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం ఎస్‌పీగా బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ సౌత్‌జోన్ డీసీపీగా పనిచేస్తున్న తరుణ్‌జోషిని జిల్లా ఎస్‌పీగా నియమించింది.
నాలుగు నెలల్లోపే..
మోహన్‌రావు ఈ ఏడాది జూలై 3న జిల్లా ఎస్‌పీగా నియమితులయ్యారు. రెండు రోజుల్లో గ్రామ పంచాయతీల ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందన్న తరుణంలో ఆయన జిల్లాకు వచ్చారు. ఎలాంటి వివాదాలకు తావివ్వకుండా విధులు నిర్వర్తించారు. పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా చూశారు. వినాయక చవితి ఉత్సవాలు, రంజాన్, దసరా, బక్రీద్ వంటి పండగల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజావాణి, డయల్ యువర్ ఎస్‌పీ వంటి ప్రజా సంబంధ కార్యక్రమాలను కొనసాగించారు. గత నెలలో కొందరు కానిస్టేబుళ్లకు పదోన్నతులు ఇస్తూ ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పోలీసు పరిపాలనపై పూర్తి స్థాయిలో పట్టు సాధించే తరుణంలోనే ఆయనను ప్రభుత్వం బదిలీ చేసింది. బదిలీ అనంతరం ఆయన ‘న్యూస్‌లైన్’తో మాట్లాడారు. జిల్లావాసులు ఎంతో మంచివారని పేర్కొన్నారు. విధి నిర్వహణలో తనకు సహకరించిన ప్రజలు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. మోహన్‌రావు 2004లో కామారెడ్డి డీఎస్పీగా పనిచేశారు.
డాక్టర్.. పోలీసు
జిల్లా ఎస్‌పీగా నియమితులైన తరుణ్ జోషి డెంటిస్టు. 2004 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఈ యువ అధికారి ఎక్కువ కాలం తెలంగాణ జిల్లాల్లోనే పనిచేశారు. రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో కూడా కొద్ది రోజులు విధులు నిర్వర్తిం చారు. కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో అదన పు ఎస్‌పీగా, ఆదిలాబాద్ అదనపు ఎస్‌పీగా పనిచేశారు. వరంగల్ జిల్లా ఓఎస్‌డీగా, విశాఖ పట్నం డిప్యూటీ కమిషనర్ (లా అండ్ ఆర్డర్) గా విధులు నిర్వర్తించారు. 2010 ఆగస్టులో కడ ప జిల్లా ఎస్‌పీగా వెళ్లారు. అనంతరం హైదరాబాద్ సెంట్రల్ జోన్ డీసీపీగా పనిచేశారు. ప్రస్తుతం సౌత్‌జోన్ డీసీపీగా పనిచేస్తున్న ఆయనను ప్రభుత్వం నిజామాబాద్ ఎస్‌పీగా బదిలీ చేసింది. విధి నిర్వహణలో నిష్పక్షపాతంగా, నిక్కచ్చిగా వ్యవహరిస్తారని ఆయనకు పేరుం ది. రాజకీయ ఒత్తిళ్లు, నేతల మధ్య ఆధిపత్య పోరు ఉన్న జిల్లాలో ఆయన పనితీరు ఎలా ఉంటుందోనని ప్రజల్లో ఆసక్తి నెలకొంది.
ఎస్‌పీ బదిలీ
Published Mon, Oct 28 2013 3:58 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM