చేవెళ్ల, న్యూస్‌లైన్: వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవడంలేదని, ఒంటరిగానే పోటీ చేస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు అంజన్‌కుమార్‌గౌడ్ స్పష్టం చేశారు. మండల కేంద్రం లోని బస్‌స్టేషన్ వద్ద శనివారం నమోః చాయ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని రెండు లోక్‌సభ, 14 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒంటరిగానే పోటీచేస్తామని పునరుద్ఘాటించారు. అభ్యర్థుల ఎంపికకు పార్టీ నాయకత్వం కసరత్తు ముమ్మరం చేసిందని, ఈనెల రెండో వారంలోగా జాబితా విడుదలవుతుం దని తెలిపారు. ప్రస్తుత సరళి, ప్రజల్లో చైతన్యం, మనోగతాన్ని చూస్తే బీజేపీ అత్యధిక స్థానాల్లో గెలుస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు.
కొంతమంది రాజకీయ లబ్ధి, వ్యక్తిగత స్వార్థంతోనే పార్టీలు మారుతున్నారే తప్ప తెలంగాణకోసం కాదన్నారు. గుజరాత్‌ను ప్రపంచదేశాలు పొగిడేలా అభివృద్ధి చేసిన నరేంద్రమోడీ ప్రధానమంత్రి కావాలని దేశ ప్రజలంతా ముక్తకంఠంతో నినదిస్తున్నారని పేర్కొన్నారు. అవినీతి కాంగ్రెస్‌పార్టీని అధికారం నుంచి కూకటివేళ్లతో పెకిలించి వేస్తేనే ఈ దేశ ప్రగతి సాధ్యమవుతుందన్నారు. టీ అమ్మడం నేరంకాదని, దేశాన్ని అమ్మడమే నేరమనే నినాదంతోనే ఎన్నికలకు వెళ్తున్నట్లు వివరిం చారు.
తాను చేవెళ్ల లోక్‌సభ టికెట్‌ను ఆశిస్తున్నానని, ఈ విషయాన్ని రాష్ట్ర నాయకత్వానికి తెలియజేసినట్లు చెప్పారు. టికెట్ ఎవరికిచ్చినా అభ్యంతరంలేదని, గెలిపించడానికి శాయశక్తులా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గసభ్యులు కంజర్ల ప్రకాష్, అత్తెల్లి విఠల్‌రెడ్డి, చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ ఇన్‌చార్జి ప్రభాకర్‌రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ జంగారెడ్డి, మండల అధ్యక్షుడు ఎ.శ్రీనివాస్, మాజీ అధ్యక్షుడు ఆంజనేయులుగౌడ్, సీనియర్ నాయకులు కుంచం శ్రీనివాస్, దేవర ఎల్లారెడ్డి, గోపాల్‌రెడ్డి, ఎత్భార్‌పల్లి శేఖర్‌రెడ్డి, అనంతరెడ్డి పాల్గొన్నారు.
ఏ పార్టీతోనూ పొత్తు ఉండదు
Published Sat, Mar 1 2014 11:38 PM | Last Updated on Wed, Aug 15 2018 2:14 PM
Advertisement
Advertisement