
సమైక్యం తప్ప ప్రత్యామ్నాయం లేదు: భూమన
సమైక్య రాష్ట్రం తప్ప మరో ప్రత్యామ్నాయం లేనే లేదన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, తిరుపతి ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ నేత భూమన కరుణాకరరెడ్డి.
సమైక్య రాష్ట్రం తప్ప మరో ప్రత్యామ్నాయం లేనే లేదన్నారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, తిరుపతి ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ నేత భూమన కరుణాకరరెడ్డి. తిరుపతి సత్యనారాయణపురం సర్కిల్‌లో చేపట్టిన మహాధర్నాలో ఆయన మాట్లాడారు. ఎగసి పడుతున్న సమైక్య సెగలను చూశాకయినా విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ తన నిర్ణయాన్ని పునరాలోచించాలని డిమాండ్ చేశారు.
మహాధర్నాకు మహిళలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. కేంద్రం తీరుకు వ్యతిరేకంగా ఆందోళనకారులు చేసిన నినాదాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. కేంద్రం, కాంగ్రెస్ పార్టీ వెంటనే తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకొని రాష్ట్రాన్ని సమైక్యంగా కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ప్రజల్లో ఉన్న ప్రాభవాన్ని తగ్గించేందుకే దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డిపై కాంగ్రె స్, టీడీపీ నాయకులు నిందలు వేస్తున్నారని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి శనివారం దుయ్యబట్టారు. వేలాది మంది పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ కోరుతూ 2001 ముందే కేంద్రానికి వైఎస్ లేఖ రాసినట్లు అసత్యాలు పలుకుతున్నారని చెప్పారు. ప్రజల్లో వైఎస్‌కున్న అభిమానాన్ని తగ్గించాలనే దురుద్దేశంతో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఈ కుట్ర పన్నారని ఆరోపించారు.