నో బిల్
బద్వేలు: బిల్లుల కోసం ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది మార్చి నుంచి ఒక బిల్లు కూడా మంజూరు కాలేదు. ఈ బకాయిలు దాదాపు రూ.22 కోట్లు ఉన్నాయి. ఇవి అందేందుకు చాలా సమయం పడుతుందని గృహనిర్మాణ శాఖ సిబ్బంది పేర్కొంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో 12,263 ఇళ్లకు బిల్లులు అందాల్సి ఉంది. ఈ ఇళ్లన్నీ బేస్‌మట్టం, గోడలు, పైకప్పు వంటి వివిధ దశల్లో ఉన్నాయి.
వీటికి సంబంధించిన వివరాలు, ఫొటోలను ఆయా మండలాల్లో గృహనిర్మాణ శాఖ సిబ్బంది తమ వెబ్‌సైట్‌లో నమోదు చేయడంతో పాటు బిల్లుల కోసం ఎంబుక్‌లు కూడా అందజేశారు. గత నెల వరకు ఆయా నిర్మాణాల స్థాయి, ప్రగతిని కూడా నమోదు చేసి బిల్లులకు పంపారు. అయితే గత మార్చి 15 నుంచి బిల్లులు మంజూరు కావడం లేదు. ప్రస్తుతం హౌసింగ్ శాఖ వెబ్‌సైట్‌ను మూసివేశారు. దీంతో ప్రస్తుతం జరుగుతున్న ఇళ్ల నిర్మాణం, ప్రగతిని నమోదు చేసేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. దీంతో వీటికి కొలతలు నమోదు చేసి బిల్లులకూ పెట్టలేని పరిస్థితి నెలకొంది.
ప్రారంభం కాకుంటే రద్దే!
ప్రస్తుతం జిల్లాలో ప్రారంభం కాని ఇందిరమ్మ ఇళ్లు 18 వేలు ఉన్నాయి. వీటన్నింటినీ త్వరలో రద్దు చేసేందుకు టీడీపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవచ్చని ఆ శాఖ సిబ్బంది చెబుతున్నారు. దీంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల పరిశీలన కూడా చేపట్టేందుకు సిద్ధమవుతున్నట్లు వారు పేర్కొంటున్నారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఇళ్లను పరిశీలించాకే బిల్లులు చెల్లించేలా నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. వీటన్నింటికీ సంబంధించి త్వరలో గృహనిర్మాణ శాఖ అధికారులకు మార్గదర్శకాలు రానున్నట్లు తెలిసింది.
ఆర్థికభారంతో ఇక్కట్లు
తమకు ఎప్పటికి బిల్లులు అందుతాయో అని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం రావాల్సిన బిల్లులతో పాటు నిర్మాణంలో ఉన్న ఇళ్ల బకాయిలు మరింత పెరిగే అవకాశముంది. సిమెంట్, ఇనుము ధరలు ఆకాశన్నంటుతుండటం, కూలి రేట్లు పెరగడంతో లబ్ధిదారులు ఆర్థిక భారంతో ఇక్కట్లు పడుతున్నారు. బిల్లులు వస్తాయనే ఆశతో పనులు ప్రారంభించిన లబ్ధిదారులు పనులు ఆపేయలా లేక అప్పులు తెచ్చి పూర్తి చేయలా అని ఆలోచిస్తున్నారు. అప్పులు తెస్తే బిల్లులు ఎప్పుడు వస్తాయో, అప్పటి వరకు వడ్డీ కట్టాలంటే ఎలా.. ఇంకా కష్టాలు పెరుగుతాయని ఆలోచిస్తూ పలువురు నిర్మాణాలను ఆపేస్తున్నారు.
ప్రభుత్వం స్పందించాలి
ప్రస్తుతం ఇళ్లు కట్టుకోవాలంటే ఇబ్బందులు తప్పడం లేదు. సిమెంట్, ఇనుము, ఇసుక ధర పెరిగింది. కూలీలు దొరకడం లేదు. ప్రభుత్వం తక్షణమే బిల్లులు మంజూరు చేయాలి
- రామనారాయణరెడ్డి
బిల్లు రాకుంటే నిలిపేయాల్సిందే ...
బిల్డింగ్ ప్రగతిని నమోదు చేసి బిల్లు పెట్టామని అధికారులు చెబుతున్నా మాకు అందలేదు. బిల్లు రాకుంటే నిర్మాణం నిలిపేయాల్సిందే. వైఎస్ హయాంలో తక్షణమే బిల్లులు వచ్చేవి
-సుభాషిణీ, మేకవారిపల్లె