‘మొడియం’కు మొండిచేయి
జంగారెడ్డిగూడెం : చంద్రబాబు క్యాబినెట్‌లో చోటు దక్కించుకున్న 17 మంది మంత్రులకు బుధవారం శాఖలు కేటాయించడంతో పోలవ రం ఎమ్మెల్యే మొడియం శ్రీనివాసరావుకు ఇక మంత్రి పదవి రానట్టేనని తేలిపోయింది. మొదటిసారి గెలుపొందిన శ్రీనివాసరావుకు గిరిజన సంక్షేమ శాఖ కేటాయిస్తారని అతని అనుచరులు చెబుతూ వచ్చారు. శ్రీనివాస్‌కూడా మంత్రి పదవి కోసం ముమ్మర ప్రయత్నాలు చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు ప్రమాణ స్వీకారం రోజైన ఈ నెల 8 మధ్యాహ్నం వరకు మంత్రుల జాబితాల్లో శ్రీనివాసరావు ఉండొచ్చనే చర్చ సాగుతూనే ఉంది. మంత్రి వర్గంలో ఆయన పేరు లేదు. మంత్రి వర్గ విస్తరణలో శ్రీనివాసరావుకు మంత్రి పదవి దక్కుతుందని అతని అనుచరులు ధీమా వ్యక్తం చేశారు.
జిల్లాకు రెండు మంత్రి పదవులను కేటాయించడంతో మరొకరికి అవకాశంలేదనే సంకేతాలు పార్టీ ఇచ్చినా ఈనెల 20 లోపు శ్రీనివాసరావు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ప్రమాణం స్వీకారం చేస్తారని అతని అనుచరులు ఆశపడ్డారు. బుధవారం మంత్రులకు శాఖలు కేటాయింపులో గుంటూరు జిల్లా పత్తిపాడు నియోజవర్గంనుంచి గెలుపొందిన రావెల కిషోర్‌బాబుకు గిరిజన, సాంఘిక సంక్షేమ శాఖను కేటాయించారు. దీంతో మొడియంకు మొండిచెయ్యే అని పార్టీలో చర్చసాగుతోంది. అవశేష ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నికైన ఏకైక ఎస్టీ శాసన సభ్యుడిగా ఎన్నికైన మొడియంకు గిరిజనసంక్షేమ శాఖ తప్పనిసరిగా దక్కుతుందని భావించిన అతని అనుయాయులు ఆ శాఖ వేరొకరికి కేటాయిచటంతో తీవ్ర నిరాశకు గురయ్యారు. శ్రీనివాసరావును శాసనసభ ఎస్టీ కమిటీ చైర్మన్‌గా నియమించే అవకాశం ఉందని అతని అనుయాయులు ఊరట చెందుతున్నారు.