
మహిళా రుణాలేవీ?
ప్రశ్నార్థకంగా మారిన వడ్డీలేని రుణాలు
సాక్షి, హైదరాబాద్: మహిళా సంఘాలకు ఇచ్చే వడ్డీ లేని రుణాల విషయంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు మౌనముద్ర దాల్చాయి. ఈ పథకం అమలు అవుతుందో లేదో తెలియక బ్యాంకులు మాత్రం మహిళల నుంచి మొత్తం వడ్డీని వసూలు చేస్తున్నాయి. రాష్ట్ర విభజనకు ముందు నుంచే ప్రభుత్వం నుంచి వడ్డీ చెల్లింపులు ఆగిపోయాయి. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ వరకు దాదాపు రూ.600 కోట్లు మహిళా సంఘాలకు చెల్లించాల్సి ఉంది. ఇందులో తెలంగాణ ప్రభుత్వం రూ.225 కోట్లు, ఆంధ్ర ప్రభుత్వం రూ. 375 కోట్లను ఇరు రాష్ట్రాల్లోని దాదాపు తొమ్మిది లక్షలకుపైగా సంఘాల్లోని సభ్యులకు చెల్లించాల్సి ఉన్నా.. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. వడ్డీ లేని రుణాల పథకం కింద 2012 నుంచి మహిళలు కేవలం అసలు చెల్లిస్తే చాలని, వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేదని అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మహిళా సంఘాలు చెల్లించాల్సిన వడ్డీని ముందుగానే ప్రభుత్వం బ్యాంకుల్లో జమ చేస్తుందని, అందువల్ల మహిళా సంఘాలు తాము తీసుకున్న అసలు చెల్లిస్తే చాలని స్పష్టం చేసింది. అయినప్పటికీ బ్యాంకులు మహిళల నుంచి వడ్డీని వసూలు చేస్తున్నాయి. ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తే.. ఆ మొత్తాన్ని బ్యాంకులు తిరిగి మహిళా సంఘాల అకౌంట్లలో జమ చేస్తూ వస్తున్నాయి. వారు తీసుకున్న రుణ మొత్తాలకు ప్రతినెలా దాదాపు రూ. 100 కోట్ల నుంచి రూ.110 కోట్లు వడ్డీ కింద చెల్లించాల్సి వస్తోంది. మహిళా సంఘాలు ఠంచన్‌గా అసలుతోపాటు, వడ్డీ చెల్లిస్తున్నాయి. తెలంగాణలో దాదాపు 4.5 లక్షల సంఘాలు ఉంటే.. ఆంధ్రా ప్రాంతంలో 6.5 లక్షల సంఘాలు ఉన్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోని మహిళా సంఘాలు జూలై 20వ తేదీనాటికి చెల్లించాల్సిన బకాయిల మొత్తం రూ. 16వేలకోట్లకు పైగా ఉంది.