సాక్షి ప్రతినిధి, కర్నూలు : కరువు జిల్లాపై ప్రభుత్వం కనికరం చూపలేదు. జిల్లా అభివృద్ధికి ప్రత్యేక నిధులు విడుదల చేయలేదు. కనీసం ఇచ్చిన హామీలు అమలు చేయడానికి ప్రయత్నమూ కనిపించలేదు. బుధవారం అసెంబ్లీలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రవేశపెట్టిన బడ్జెట్ జిల్లా వాసులను తీవ్ర నిరాశ పరిచింది.
స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు వరాల వర్షం కురిపించారు. కానీ.. జిల్లా ప్రజలకు సీఎం చంద్రబాబు ఇచ్చిన ఒక్క హామీపై కూడా బడ్జెట్‌లో ప్రస్తావన రాలేదు. ఓర్వకల్లు వద్ద పారిశ్రామికవాడను ఏర్పాటు చేసి వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తామని ఇచ్చిన హామీని మరిచారు. ఆదోని-ఎమ్మిగనూరు మధ్యలో టెక్స్‌టైల్, అపెరల్ పార్క్ ఏర్పాటు చేసి ప్రపంచ వ్యాప్తంగా ఇక్కడి నుంచే కొనుగోళ్లు చేయిస్తానని ప్రకటించి..నిధులు మంజూరు చేయలేదు.
త్రిపుల్ ఐటీ, నంద్యాలలో వ్యవసాయ కళాశాలలను డీమ్డ్ యూనివర్సిటీగా మార్పు.. విత్తన సాంకేతిక పరిజ్ఞానం పరిశోధనలకు మౌలిక వసతులు కల్పన.. ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు, నిమ్స్ తరహాలో రాయలసీమ ఇన్‌స్టిట్యూఫ్ ఆఫ్ మెడికల్ సైన్స్.. డోన్‌లో ధన్‌బాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూల్ ఆఫ్ మైనింగ్ తరహా సంస్థను ఏర్పాటు.. ఇలా ఎన్నో హామీలిచ్చినా.. ఒక్కటంటే ఒక్కదానికి కూడా నిధులు మంజూరు చేయలేదు.
హామీలకు ‘నీళ్లొదిలారు..’
స్వాతంత్య్రదిన వేడుకలో తెలుగుగంగ, ఎస్సార్బీసీ, కేసీ కెనాల్, హెచ్‌ఎల్సీ, హంద్రీనీవా, గాలేరునగరి, గోరుకల్లు వంటి ప్రాజెక్టులన్నింటికి నిధులు కేటాయించి పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకొస్తానని సీఎం హామీ ఇచ్చారు. అదే విధంగా గుండ్రేవుల, గురురాఘవేంద్ర రిజర్వాయర్లు తన కల అన్నారు. అవన్నీ కేవలం మాటలకే పరిమతమని తేలిపోయింది. శ్రీశైలం రైట్ బ్రాంచ్ కెనాల్ సర్కిల్-1, సర్కిల్-2, సర్కిల్-3 మొత్తానికి కలిపి రూ.145 కోట్లకుపైనే అవసరమని అధికారులు అంచనాలు పంపారు.
అయితే బడ్జెట్‌లో రూ.12.48 కోట్లే కేటాయించారు. గాజులదిన్నె ప్రాజెక్టుకు రూ.1.20 కోట్లు అవసరమైతే బడ్జెట్‌లో రూ.20 లక్షలు మాత్రమే కేటాయించారు. వరదరాజస్వామి ప్రాజెక్టుకు రూ.2.01 కోట్లు, కేసీ కెనాల్ ఆధునికీకరణ కోసం రూ.8.04 కోట్లు, గురురాఘవేంద్ర లిఫ్ట్‌ఇరిగేషన్‌కు రూ.15 కోట్లు కేటాయించారు. తుంగభద్ర లోలెవల్ కెనాల్‌కు రూ.8.22 కోట్లు, హైలెవల్ కెనాల్ స్టేజ్-1కి రూ.15 కోట్లు, స్టేజ్-2కి 2.20 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు. మొత్తంగా చూస్తే జిల్లాలోని రిజర్వాయర్లు, కాలువలకు కేటాయించింది తక్కుకవేనని నీటి పారుదలశాఖ అధికారులు చెపుతున్నారు.
వ్యవ‘సాయం’ కరువే..
టీడీపీ అధికారంలోకి వస్తే రైతు, డ్వాక్రా, చేనేత రుణాలన్నీ మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో వ్యవసాయానికి, రుణమాఫీకి కేవలం రూ.15 వేల కోట్లు మాత్రమే కేటాయించారు. డ్వాక్రా, చేనేత రుణాల మాఫీ ప్రస్తావనే రాలేదు. అదే విధంగా వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ అన్నారు. అది కూడా లేదు. కరువు రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్‌ను కేటాయించలేదు. ఇక గృహ నిర్మాణం, పలు సంక్షేమ పథకాలు, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన, పట్టణాభివృద్దికి తూతూ మంత్రంగా నిధులు విదిల్చారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్ అనుమానమే?
ఫీజు రీఎంబర్స్ మెంట్‌పై ఆధారపడి జిల్లాలోని సుమారు 90 వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రస్తుతం ప్రభుత్వంలో ఈ పథకాన్ని అమలు చేయడం ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. అందుకు బుధవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో కేటాయించిన నిధులే కారణం. విద్యార్థులకు మౌలిక వసతులు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా నిధుల కేటాయింపులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. రాయలసీమ యూనివర్సిటీ అభివృద్ధికి గతంలో రూ.100 కోట్లు ఇవ్వాల్సి ఉన్నా.. ఆ ప్రస్తావన లేదు.
వైద్యం.. దైవాధీనం
108 సర్వీసులు, ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలను పటిష్టం చేయాల్సి ఉంది. జిల్లాలోని పీహెచ్‌సీల్లో సుమారు సగానికిపైగా నిర్వహణలోపంతో అస్తవ్యస్తంగా మారాయి. అలాగే జిల్లాలో మారుమూల ప్రాంతాల్లో ఇప్పటికీ సరైన వైద్యసదుపాయాలు లేవు. 104 సేవలు పల్లె జనానికి అందటం లేదు. ఉన్న 108 సర్వీసులకు తోడు అదనంగా మరిన్ని వాహనాలను ప్రవేశపెట్టాల్సిన అవసరం ఉంది. కర్నూలులోని పెద్దాసుపత్రికి ఇప్పటికే రూ.100 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఆ ప్రస్తావన రాలేదు. ప్రభుత్వ వైద్యశాల ఆధునికీకరణ, మందుల కొనుగోలుకు నిధులు అంతంత మాత్రంగానే ఉంది.
రహదారులు బాగుపడేదెన్నడో..?
జిల్లాలో గ్రామీణ రోడ్లు అధ్వానంగా ఉంది. 25 ఏళ్ల క్రితం వేసినవి కంకరతేలి ప్రయాణం నరకంగా మారింది. సరిహద్దు గ్రామాలకు వెళ్లడానికి సైతం ఇప్పుడు అధికారులు భయపడుతున్నారు. అత్యవసర చికిత్స కోసం వెళ్లాలంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకోవాల్సిందే. రహదారుల అభివృద్ధికి బడ్జెట్‌లో కేటాయింపులు నామమాత్రంగా ఉన్నాయి. అదే విధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అభివృద్ధి కోసం కేటాయించిన నిధులు అంకెల గారడీని తలపిస్తోంది.
ప్చ్... హామీలకు రాం..రాం
Published Thu, Aug 21 2014 1:20 AM | Last Updated on Mon, Aug 27 2018 8:44 PM
Advertisement
Advertisement