‘చంద్రబాబు పార్టీ పెడితే డిపాజిట్లు కూడా రావు’
గుంటూరు : రాష్ట్రంలో రైతులు పడుతున్న ఇబ్బందులు, వారు పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక ప్రభుత్వం చేతిలో దారుణమైన మోసానికి గురవుతున్నవారికి అండగా ఉండేందుకే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రైతు దీక్ష చేపట్టారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని తెలిపారు. ఆయన మంగళవారం రైతుదీక్ష ప్రాంగణంలో మాట్లాడుతూ ...దున్నపోతు ప్రభుత్వాన్ని నిద్ర లేపేందుకే వైస్ జగన్ దీక్షకు పూనుకున్నారని అన్నారు.
రైతు దీక్ష చేస్తే ప్రభుత్వానికి కదలిక వచ్చి గతంలో టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం 5వేల కోట్లతో స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. దొంగ వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన దొంగ ముఖ్యమంత్రి ఇప్పటికైనా కళ్లు తెరిచి రైతులకు న్యాయం చేస్తారని వైఎస్ జగన్ ...రెండురోజుల పాటు దీక్ష చేపట్టారన్నారు.
అలాంటి జగన్‌పై తన మంత్రులు, చెంచాలు, పకోడి గాళ్లను పెట్టించి చంద్రబాబు నాయుడు తిట్టించే కార్యక్రమం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రభుత్వానికి సిగ్గు,శరం ఉంటే ఇప్పటికైనా రైతులకు న్యాయం చేయాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అవాకులు, చవాకులు పేలితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కొడాలి నాని హెచ్చరించారు. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయి...తెలంగాణ సీఎం కేసీఆర్‌కు భయపడి పారిపోయి వచ్చిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి టీడీపీని చంద్రబాబు ఆక్రమించుకుంటే, కాంగ్రెస్ విధానాలు నచ్చక ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేసి సొంతంగా పార్టీ పెట్టి వైఎస్ జగన్ ప్రతిపక్ష నేత అయ్యారన్నారు.
టీడీపీని నందమూరి కుటుంబానికి ఇచ్చేసి, చంద్రబాబు నాయుడు సొంతంగా పార్టీ పెడితే డిపాజిట్లు కూడా రావని ఎమ్మెల్యే కొడాలి నాని ఎద్దేవా చేశారు. జయంతికి, వర్థంతికి తేడా తెలియని వ్యక్తిని తీసుకు వచ్చి మంత్రిని చేశారని, ఆ మంత్రి నీటి సమస్యను పరిష్క్రరించడం కాదు, సృష్టిస్తారని చెప్పడం బాధాకరమన్నారు. టీడీపీ నేతలతో పాటు కొంతమంది అధికారులు ఓవరాక్షన్ చేస్తున్నారని, జగన్ సీఎం అయితే చంద్రబాబు ఇక్కడ నుంచి పారిపోతారని, అలాంటి అధికారులు ఆత్మపరిశీలన చేసుకొని, ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాలని అన్నారు.