చంద్రబాబు వక్రబుద్ధి మానుకోవాలి
చంద్రబాబు వక్రబుద్ధి మానుకోవాలి
Published Wed, Aug 3 2016 12:56 AM | Last Updated on Sat, Aug 18 2018 6:18 PM
గుడివాడ :
ప్రత్యేక హోదా రాష్ట్ర ప్రజల ఆకాంక్షని, ఇప్పటికైనా చంద్రబాబు వక్రబుద్ధి మానుకోవాలని కృష్ణాజిల్లా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) హితవు పలికారు. ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, విపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం రాష్ట్ర బంద్ విజయవంతమైందని చెప్పారు. వ్యాపార, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ ఉద్యోగులు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించి హోదా కావాలని తమ వాణిని బంద్ ద్వారా వినిపించారన్నారు. ప్రత్యేక హోదాపై ముఖ్యమంత్రి దద్దమ్మ చంద్రబాబు తన డ్రామాలు మానుకోవాలని సూచించారు. కేసుల నుంచి బయటపడేందుకు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టుపెట్టి మోదీ కాళ్లమీద పడ్డాడని ఎద్దేవా చేశారు.
హోదా ఆకాంక్ష లేదని చెప్పడానికే..
పోలీసులతో నాలుగు బస్సులు బలవంతంగా నడిపించి రాష్ట్రంలో ప్రత్యేక హోదా ఆకాంక్ష లేదని చెప్పడానికి చంద్రబాబు వక్రబుద్ధితో వ్యవహరిస్తున్నాడని నాని మండిపడ్డారు. రాజకీయాలతో ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు నేడు రాష్ట్ర ప్రజలకు తన స్వప్రయోజనాలకోసం వెన్నుపోటు పొడుస్తున్నాడని విమర్శించారు. ప్రత్యేక హోదా అవసరంలేదు ప్రత్యేక ప్యాకేజీ కావాలని కేంద్రాన్ని అడిగిన చంద్రబాబు.. ఆడబ్బు వస్తే తండ్రీ కొడుకులు దోచుకోవచ్చని అనుకున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌కు పట్టిన గతే చంద్రబాబుకు పడుతుందన్నారు. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు రాష్ట్ర ప్రజల ఆకాంక్షను కేంద్రానికి చెప్పాలని సూచించారు. విభజన చట్టంలో ఉన్న హామీలను కేంద్రం నెరవేర్చాలని కోరారు. ఈసమావేశంలో పార్టీ నేతలు పాలేటి చంటి, దుక్కిపాటి శశిభూషణ్, గొర్ల శ్రీను పాల్గొన్నారు.
Advertisement