మంగళంపాడు వద్ద అసంపూర్తిగా ఉన్న 8వ నంబర్ బ్రాంచ్ కెనాల్ (ఫైల్)
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హామీలిస్తుంటారు. ఆ తర్వాత పట్టించుకోరు. ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, అసెంబ్లీ అభ్యర్థి పరసా వెంకటరత్నయ్య కూడా ఇదే కోవలోకి వస్తారని ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఆయన అది చేస్తాం.. ఇది చేస్తామంటూ చెప్పి ఆ తర్వాత వాటి ఊసెత్తరని వాపోతున్నారు. 2014 సంవత్సరంలో టీడీపీ అధికారంలోకి వచ్చాక నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి శూన్యమనేది జగమెరిగిన సత్యం.
సాక్షి, సూళ్లూరుపేట (నెల్లూరు): పరసా వెంకటరత్నయ్య.. తెలుగుదేశం అసెంబ్లీ అభ్యర్థి. ఇప్పటికే ఆ పార్టీ నుంచి ఆయన ఐదుసార్లు టికెట్ తెచ్చుకుని మూడుసార్లు గెలిచారు. మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన హయాంలో ఇచ్చిన హామీలు నీటిమూటలుగా మిగిలిపోయాయి. 15 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నా ఆయన నియోజకవర్గానికి చేసింది శూన్యమని ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఆయన మంత్రిగా ఉన్న సమయంలో సూళ్లూరుపేట పట్టణాన్ని పట్టిపీడిస్తున్న మురుగునీటి సమస్యను తీర్చేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. జన్మభూమి కార్యక్రమంలో 70, 30 శాతం కింద ఓ కంపెనీ వారి సహకారంతో భూగర్భ డ్రెయినేజీ నిర్మిస్తానని ప్రకటించారు. తర్వాత పనులకు శ్రీకారం చుడుతూ స్థానిక వినాయకుడిగుడి సెంటర్‌లో శిలాఫలకాన్ని కూడా ఆవిష్కరించారు. ఈ పని ఆ తర్వాత ఏమైందో తెలియదు. శిలాఫలకం మాత్రం అలాగే మిగిలిపోయింది. ఆ తర్వాత దీని గురించి పరసా ఏనాడు మాట్లాడిన దాఖలాల్లేవు.
పూర్తి చేయించలేకపోయారు
కాంగ్రెస్ నాయకులు పసల పెంచలయ్య సూళ్లూరుపేట బస్టాండ్ సెంటర్ వద్ద తెలుగుగంగ బ్రాంచ్ కాలువలపై సుమారు వారంరోజుల పాటు ఆందోళన చేశారు. కాలువల నిర్మాణాలు చేపట్టాలని, రైతులకు అధికారికంగా సాగునీరివ్వాలని ఆయన 1999లో భారీఎత్తున పోరాటం చేశారు. ఈ పోరాటాన్ని దారి మళ్లించాలని హడావుడిగా మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, అప్పటి నీటిపారుదల శాఖా మంత్రి చిత్తూరు జిల్లా ఉబ్బలమడుగు వద్ద 8ఏ బ్రాంచ్ కెనాల్‌కు, సత్యవేడు మండలం వానెల్లూరు వద్ద 9 నంబర్ కెనాల్‌కు, శ్రీకాళహస్తి సమీపంలోని కన్నలి వద్ద ఏడో నంబర్ బ్రాంచ్ కెనాల్‌కు భూమి పూజ చేశారు. 1999 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గెలిచి పరసా మళ్లీ ఎమ్మెల్యే అయినా తెలుగుగంగ బ్రాంచ్ కాలువలను పూర్తి చేయించలేకపోయారు. ఆ ఎన్నికల్లో ప్రధానంగా బ్రాంచ్ కాలువలను పూర్తి చేయిస్తానని, నెర్రికాలువను ఆధునీకరిస్తానని చెప్పి నియోజకవర్గ ప్రజల్ని మోసం చేశారు. అటవీ శాఖ క్లియరెన్స్ తీసుకురాకపోవడంతో కెనాల్స్ పనులు ఇంకా అసంపూర్తిగా దర్శనమిస్తున్నాయి. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక జలయజ్ఞంలో ఏడో నంబర్ కాలువ పనులు ముందుకు సాగాయి. ఆయన మరణానంతరం ఎవరూ పట్టించుకోలేదు.
ఇంకా ఎన్నో..
తెలుగుదేశం పాలనలో పరసా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేకపోయారు. చేపలవేట విషయంలో పులికాట్‌లో సరిహద్దుల సమస్యను పరిష్కరించేందుకు పరసా కృషి చేయలేదు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల మత్స్యకారుల వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలకు గ్రాంట్ ఇవ్వలేదు. ఓడిపోయిన వారిని ఇన్‌చార్జిలుగా నియమించారు. ఈ క్రమంలో పరసా అడిగిన ప్రకారం నిధులు విడుదల చేసి తెలుగుదేశం నాయకులు దోచుకునేందుకు అవకాశం కల్పించారు. ఆయన కూడా కమీషన్లు తీసుకున్నారని పెద్దఎత్తున విమర్శలున్నాయి.
అవస్థలు పడుతున్నాం
సూళ్లూరుపేట మున్సిపాలిటీగా, పట్టణం విస్తరించినా ఆ స్థాయిలో భూగర్భ డ్రెయినేజీ వ్యవస్థను అభివృద్ధి చేయలేకపోయారు. పరసా రత్నయ్య భూగర్భ డ్రెయినేజీని గురించి పట్టించుకోలేదు. నీరు – చెట్టు కింద కోట్ల రూపాయలు స్వాహా చేశారే కానీ ప్రజలకు ఉపయోగపడే పనిని మాత్రం చేయలేకపోయారు.
– శ్రీపతి రవీంద్ర, సూళ్లూరుపేట
సరిహద్దు సమస్యలతో ఇబ్బందులు
సరిహద్దు సమస్యలతో సుమారు 25 ఏళ్ల నుంచి ఆంధ్రా – తమిళనాడు మత్య్సకారుల మధ్య వివాదాలున్నాయి. పులికాట్ సరస్సులో చేపలవేట చేసుకునే విషయంలో ప్రతి ఏటా మే, జూన్‌లో రెండు రాష్ట్రాల మత్స్యకారుల మధ్య వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. 1999 ఎన్నికల సమయంలో చంద్రబాబునాయుడు ప్రచారానికి వచ్చినప్పుడు ఈ సమస్యను చెబితే పరిష్కరిస్తామని హామీ ఇచ్చి పూర్తిగా విస్మరించారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన పరసా రత్నయ్యకు ఎన్నిసార్లు విన్నవించినా పెడచెవిన పెట్టారు.
– శివాజీ, పూడి కుప్పం, మత్స్యకారుల సంఘం నాయకుడు
అసంపూర్తిగా ఉన్నాయి
నియోజకవర్గంలో టీడీపీ నేతలు ఐదు బ్రాంచ్ కాలువ నిర్మాణానికి శిలాఫలకాలు వేశారు. అవి ఇంకా అసంపూర్తిగా ఆగిపోయాయి. అలాగే సుమారు 15 చెరువులకు సాగునీరందించే నెర్రికాలువకు కనీసం చిన్నపాటి మరమ్మతులు చేయలేకపోయారు. నీరు – చెట్టు కింద కూడా పనులు చేయించలేకపోవడంతో అది మురుగునీటి కాలువలా తయారైంది.
– గండవరం సురేష్‌రెడ్డి, గ్రద్ధగుంటతడ మండలం
Comments
Please login to add a commentAdd a comment